Begin typing your search above and press return to search.

నేడు డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు .. హాజరుకానున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ

By:  Tupaki Desk   |   30 Nov 2021 5:31 AM GMT
నేడు డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు .. హాజరుకానున్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ
X
టీటీడీ ఓఎస్డీ డాలర్ శేషాద్రి అంతిమసంస్కారాలు ఈ రోజు 30 నవంబర్ 2021) జరగబోతున్నాయి. సిరిగిరి అపార్ట్‌ మెంట్‌ లో ప్రజల సందర్శనార్థం శేషాద్రి భౌతిక కాయాన్ని ఉంచారు. మధ్యాహ్నం తిరుపతి గోవిందదామం లో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. శేషాద్రి అంతమసంస్కారాల్లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కూడా పాల్గొంటారు. ఉదయం 11.10గం.లకు ఎన్వీ రమణ రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అటునుంచి డాలర్ శేషాద్రి నివాసానికి వెళ్లి ఆయన పార్థివదేహానికి అంతిమ నివాళి అర్పిస్తారు. అనంతరం జరిగే అంతిమ యాత్రలో పాల్గొంటారు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ. విశాఖలో కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనడానికి వైజాగ్ వెళ్లిన డాలర్ శేషాద్రి.. గుండెపోటు రావడంతో మృతి చెందారు.

డాలర్ శేషాద్రి మృతిపట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుతోపాటు పలువు ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. డాలర్ శేషాద్రి ధన్యజీవి అని కొనియాడారు టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి. డాలర్ శేషాద్రి మరణం టీటీటీకి తీరని లోటని, టీటీడీలో శేషాద్రి సేవలు అనిర్వచనీయమైనవి అని తెలిపారు. తిరుమల స్వామివారి కైంకర్యాలు.. దేవాలయ సాంప్రదాయాలపై అపార అనుభవం ఉన్న వ్యక్తి. తిరుమల శ్రీవారి దర్శనానికి ప్రముఖులు ఎవరు వచ్చినా.. వారితో డాలర్ శేషాద్రి కనిపించేవారు. తిరుమలలో జరిగే ప్రతి ఉత్సవంలోనూ డాలర్ శేషాద్రి పాల్గొనేవారు. తన తుది శ్వాస వరకూ శ్రీవారి సేవలోనే తరిస్తానని గతంలో చెప్పారు.. చెప్పినట్లుగానే చివరకు అలాగే స్వామివారికి సేవచేసి కన్నుమూశారు.

1978 నుంచి శ్రీవారి సేవలో శేషాద్రి తరిస్తున్నా రు. 2007లోనే రిటైర్‌ అయినప్పటికీ ఆయన సేవలను గుర్తించిన టీటీడీ ఓఎస్డీగా కొనసాగిస్తున్నది. తిరుమలలో శేషాద్రి శ్రీవారి బంగారుడాలర్లు అమ్మేవారు. అందుకే డాలర్‌ శేషాద్రి అని పేరు వచ్చింది. 1948 జులై 15న జన్మించిన డాలర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. మెడలో పొడవైన డాల్లర్ ధరించి వుండడంతో.. ఆ పేరుతో డాలర్ శేషాద్రిగా ప్రసిద్దిగాంచారు. శేషాద్రి పూర్వీకులది తమిళనాడు రాష్ర్టంలోని కంచి...శేషాద్రి స్వామి తండ్రి గోవిందరాజ స్వామి ఆలయంలోని తిరుమల నంబి ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించే వారు.., తిరుపతిలోనే జన్మించిన శేషాద్రి... విద్యాభ్యాసాన్ని తిరుపతిలోనే పూర్తిచేశారు.

2009లో డాలర్ కు ఊహించని దెబ్బ తగిలింది. తిరుపతికి చెందిన రైతు నాయకుడు టీటీడీలో 60ఏళ్ళకు పైబడిన వారిని కొనసాగించకూడదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీని పై స్పందించిన హైకోర్టు టీటీడిలో 60ఏళ్ళకు పైబడి పనిచేస్తున్నవారందరిని ఇంటికి పంపించాలని టీటీడిని ఆదేశించింది. దీంతో శేషాద్రితో పాటు సుమారు 58మందిని టీటీడి విధుల నుంచి తప్పించింది. అయితే శేషాద్రి మాత్రం పట్టువిడవని విక్రమార్కుడిలా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఈ కేసును హైకోర్టు పరధిలోని ఆంశం కాబట్టి అక్కడే పరిష్కరించుకోవాలని సూచించింది.

హైకోర్టును ఆశ్రయించిన డాలర్ కు రాష్ట్ర హైకోర్టు అనుకూలంగా తీర్పునిచ్చింది. దీంతో 2010 అక్టోబర్ 1న రాష్ట్ర హైకోర్టు శేషాద్రిని విధుల్లోకి తీసుకోవాలంటూ టీటీడిని ఆదేశించింది. కోర్టులో కేసు నడుస్తున సమయంలో ఆయన కోల్పోయిన పదవికాలాని తిరిగి ఇవ్వాలంటూ హైకోర్టు టీటీడిని ఆదేశించింది. ఇలా దాదాపు 10నెలల కాలం డాలర్ శేషాద్రి శ్రీవారి సేవలకు దూరమయ్యారు. ఆ తరువాత వచ్చిన బాపిరాజు నేతృత్వంలోని పాలకమండలి కూడా రెండుసార్లు డాలర్ పదవికాలాన్ని పొడిగించగా ఆ తరువాత స్పెసిఫైడ్ ఆధారిటీ వున్న సమయంలో అప్పుడు ఈవోగా పని చేసిన ఎంజీ గోపాల్ తదుపరి ఉత్తర్వులు వెల్లువడే వరకు ఆయనకు పొడిగింపును ఇవ్వడంతో నేటికి కూడా డాలర్ శ్రీవారి ఆలయ ఓయస్డిగా విధుల్లో కొనసాగారు.