Begin typing your search above and press return to search.

తిరుమ‌ల ర‌చ్చకు పాతికేళ్లు

By:  Tupaki Desk   |   28 May 2018 6:48 AM GMT
తిరుమ‌ల ర‌చ్చకు పాతికేళ్లు
X
తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం ఇన్నాళ్లుగా వెంక‌న్న క‌రుణాక‌టాక్షాల‌తో దేశ‌వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ‌వ్యాప్తంగా భ‌క్తుల‌ను త‌న‌వైపున‌కు తిప్పుకోగా...ఇప్పుడు దుర‌దృష్ట‌వ‌శాత్తు వివాదాల ద్వారా అదే రీతిలో ఫోక‌స్ అవుతోంద‌నేది అనేక మంది ఆవేద‌న. ఎందుకంటే..ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు...వెంక‌న్న స‌న్నిధిలో సాగుతున్న రాజ‌కీయాలు - టీటీడీ వేదిక‌గా కొన‌సాగుతున్న వివాదాలు. అయితే, ఇప్పుడు ఈ వివాదాలు తెర‌మీద‌కు వ‌చ్చిన‌ప్ప‌టికీ...ఈ విబేధాలు ఎప్ప‌టినుంచో ఉన్నాయ‌ని ఇంకా చెప్పాలంటే పాతికేళ్లుగా టీడీపీలో ముస‌లం కొన‌సాగుతోంద‌ని అంటున్నారు. రెండు గ్రూపులుగా విడివ‌డి ఇక్క‌డ వివాదం చెల‌రేగుతోంద‌న్న‌ది టీటీడీ వ్య‌వ‌హారాల‌ను గ‌మ‌నించిన వారి మాట‌. ఒక గ్రూపునకు రమణ దీక్షితులు - మరో గ్రూపునకు డాలర్‌ శేషాద్రి నాయకత్వం వహిస్తున్నారని, తిరుమల ఆలయంలో రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు గత పాతికేళ్లుగా కొనసా..గుతోందని చెప్తున్నారు.

తాజా వివాదాన్ని అర్థం చేసుకోవాలంటే...ఓ పాతికేళ్ల వెన‌క్కు వెళ్లాల్సి ఉంది. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమ‌యంలో మిరాశీ వ్యవస్థను రద్దు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. దీంతో తర్వాత మిరాశీదార్లు కోర్టుకెళ్లి 'స్టే' తెచ్చుకున్నారు. కొన్నేళ్లపాటు కోర్టుల చుట్టూ ఈ వ్యవహారం నడిచింది. చివరకు 1996 నాటికి సుప్రీం కోర్టు తీర్పుతో ప్రధానమైన మిరాశీలన్నీ సంపూర్ణంగా రద్దయిపోయాయి. ఈ తీర్పుతో షాక్‌ కు గురైన మిరాశీ అర్చకులు స్వామివారికి సేవలు ఎలా నడుపుతారో చూస్తామని అలిగి చెన్నైకి వెళ్లిపోయారు. పైడిపల్లి - తిరుపతమ్మ - గొల్లపల్లి - పెద్దింటి వంశీకులు ఆలయాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఆనాడు అర్చకుల హెడ్‌ గుమాస్తా ( ప్రధాన అర్చకుడు) మాడంబాకం శ్రీనివాస భట్టాచార్య డాలర్‌ శేషాద్రి - కొందరు అర్చక గుమస్తాలతో స్వామివారి కైంకర్యాలకు ఇబ్బంది రాకుండా నెట్టుకొచ్చారు. తాము ఆలయం విడిచివెళ్తే టీటీడీ యాజమాన్యం నానా అవస్థలు పడి తిరిగి కాళ్లబేరానికి వస్తుందనుకున్న మిరాశీలకు చుక్కెదురయింది.మిరాశీదార్లతో అలిగి వెళ్లిపోయిన వారిలో రమణ దీక్షితులు కూడా ఒకరు. తాము లేకపోయినా పనులు సవ్యంగా జరగడానికి కారణం డాలర్‌ శేషాద్రి - అర్చక గుమస్తాలని మిరాశీలు నాటి నుంచి కోపం పెంచుకున్నారు. అయితే, నాటి ప్రధాన అర్చకుడు మాడంబాకం శ్రీనివాస భట్టాచార్య పేష్కార్‌ కృష్ణస్వామి చొరవతో మిరాశీలను ఉద్యోగులుగా ఆలయానికి తిరిగి రప్పించారు.

అయితే, అన్ని కుటుంబాల మిరాశీలు తిరిగి ఉద్యోగాలలో చేరినా రమణ దీక్షితులు చాలా కాలంపాటు ఆలయానికి దూరంగానే ఉన్నారు. తరువాత ఉద్యోగంలో చేరిన రమణ దీక్షితులకు ప్రధాన అర్చక పదవి మాడంబాకం తదనంతరం వచ్చింది. తమకు మద్దతును ఇవ్వకుండా ఆలయంలో పనిచేసిన డాలర్‌ శేషాద్రి అర్చక గుమస్తాలపై రమణ దీక్షితులు కక్ష సాధింపులు ప్రారంభించార‌నే భావ‌న కొంద‌రిలో ఉంది. సీనియర్లకు తక్కువ పనులు కేటాయించడం - జూనియర్‌ లకు కీలక పనులు కేటాయించటం, అవమానకరంగా మాట్లాడటం వేధింపులకు పాల్పడటం వంటి చర్యలతో రెండు గ్రూపులుగా మారిపోయి ప్రతినిత్యం ఘర్షణలకు పాల్పడటం నిత్యకృత్యమైందని ప‌లువురు భ‌క్తులు చెప్తుంటారు. ఈ వివాద‌మే ముదిరిపాకాన ప‌డి ప్ర‌స్తుత స్థితికి చేరిందని చెప్తున్నారు. టీటీడీ పరిధిలోని అన్ని ఆలయాలలోకి బదిలీలు చేస్తే ఈ వివాదాలు భవిష్యత్తులో వచ్చేందుకు అవకాశం లేదని, అందుకు తగిన చర్యలు టీటీడీ యాజమాన్యం తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.