Begin typing your search above and press return to search.

కరోనా వేళ డోలో 650పై మీమ్స్.. స్పందించిన సంస్థ ఎండీ

By:  Tupaki Desk   |   23 Jan 2022 3:30 AM GMT
కరోనా వేళ డోలో 650పై మీమ్స్.. స్పందించిన సంస్థ ఎండీ
X
ఓ వైపు కరోనా మహమ్మారి.. మరోవైపు సీజనల్ వ్యాధులు జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విపరీతంగా చలి వణికిస్తున్న సమయంలో వరుణుడు కరుణించాడు. మళ్లీ కాస్త గ్యాప్ ఇవ్వడంతో చలిపులి పంజా విసురుతోంది. రోజుల వ్యవధిలోనే వాతావరణంలో పలు మార్పులు జరిగాయి.

ఈ నేపథ్యంలో సీజనల్ వ్యాధులు చుట్టుముడుతున్నాయి. ప్రతీ నలుగురిలో ఒక్కరికి దగ్గు, జలుబు, జ్వరం వంటి లక్షణాలు ఉన్నాయని వివిధ సర్వేల్లో తేలింది. అయితే వచ్చిన సమస్య అంతా ఇక్కడే ఉంది. కరోనా లక్షణాలు కూడా ఇవే.

జలుబు చేసినా, జ్వరం వచ్చినా... కాస్త దగ్గు వచ్చినా జనం బెంబేలిత్తిపోతున్నారు. తమకు వచ్చింది సాధారణ జ్వరమా? కరోనానా? అనే సందేహంలో ఉంటున్నారు. ఎందుకైనా మంచిదని డోలో 650 మాత్రను మింగుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆస్పత్రులకు వెళ్లడం కన్నా ఇంట్లోనే ట్యాబ్లెట్ వేసుకోవడం ఉత్తమం అనుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో పిప్పరమెంట్ల మాదిరి మందు గోళీలను మింగేస్తున్నారు. కాగా వీటిపై నెట్టింట సరదా మీమ్స్ పుట్టుకొస్తున్నాయి. గత వారం రోజులుగా డోలోపై మీమ్స్ విపరీతంగా పెరిగాయి.

దగ్గు జలుబు, జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పు.... ఫైవ్ ప్రాబ్లమ్స్ వన్ సొల్యూషన్ డోలో అంటూ ఫన్నీ మీమ్స్ సృష్టిస్తున్నారు. కరోనా వేళ డోలో చాలా ట్రెండ్ అవుతోంది. కాగా దీనిపై డోలో 650ని తయారు చేసే సంస్థ మైక్రో ల్యాబ్స్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ దిలీప్ సురానా స్పందించారు. ఇటీవల కాలంలో డోలో అమ్మకాలు విపరీతంగా పెరిగాయని వెల్లడించారు. ఇంతటి ప్రజాదారణను తాము ఊహించలేదని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

అంతేకాకుండా కరోనా వైరస్ ప్రధాన లక్షణాలను నివారించే ఔషధంగా డోలో నిర్ధారించబడిందని తెలియజేశారు.

ఇటీవల కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. అయితే ప్రతీ ఇంట్లో డోలో నిల్వలు పెరిగాయి. ఈ మాత్రలను షీట్ల మాదిరి తెచ్చి పెట్టుకుంటున్నారు. అయితే వీటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయని ఫార్మా కంపెనీలు వెల్లడించాయి. డోలోతో పాటు ఇతర జ్వర ట్యాబ్లెట్ల విక్రయాలు కూడా బాగా జరిగాయట. ఇక జనాలు కూడా ఒంట్లో కాస్త నలతగా అనిపించినా ఓ ట్యాబ్లెట్ ను కడుపులో పడేస్తున్నారు.

ఈ నేపథ్యంలో నెట్టింట తెగ మీమ్స్ పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం డోలో మీమ్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి. అయితే వీటిని చూసి సెలబ్రిటీలు సైతం ఎంజాయ్ చేస్తున్నారు. అంటే ప్రస్తుత పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. అయితే ఔషధాలను వైద్యుల సూచనలు లేకుండా తీసుకోవడం ఏమాత్రం శ్రేయస్కారం కాదని అంటున్నారు. అలా చేస్తే చాలా ఇతర సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు.