Begin typing your search above and press return to search.

అటు అమెరికా.. ఇటు రష్యా.. భారత్ రూట్ ఎటు... ?

By:  Tupaki Desk   |   25 Feb 2022 5:21 AM GMT
అటు అమెరికా.. ఇటు రష్యా.. భారత్ రూట్ ఎటు... ?
X
భారత్ ది మొదటి నుంచి శాంతి వాదం. అలీన విధానం. అందరూ బాగుండాలన్నదే భారత్ తపన. అయితే కాలం మారుతోంది. దేశాల మధ్య ఆధిపత్య పోరు పెరుగుతోంది. ప్రపంచ పెద్దన్న పాత్ర కోసం కొన్ని అగ్ర దేశాల మధ్య పోరు నడుస్తోంది. మూడు దశాబ్దాల క్రితం దాకా అమెరికాను అడ్డుకున్న సోవియట్ యూనియన్ పతనంతో ఏకధృవ ప్రపంచంగా మారిపోయింది. నాటి నుంచి అమెరికా ఏకైక అగ్ర రాజ్యంగా తన హవా కొనసాగిస్తోంది. అయితే ఎల్లపుడూ పరిస్థితులు ఒక్కలా ఉండవు.

ఈ మధ్య కాలాలలో చైనా బాగా ఎదుగుతోంది. తానే సూపర్ పవర్ అంటోంది. ప్రపంచ పెద్దన్న సీటు కోసం కర్చీఫ్ పరచేసింది. ఇపుడు రష్యా చూపు కూడా పెద్దన్న పోస్ట్ మీదనే ఉంది. ఈ నేపధ్యంలో ప్రపంచ దేశాల మధ్య తప్పనిసరిగా పోటీ పెరిగింది. అలాగే తమ వారూ పరవారూ అన్న విభజన రేఖను కూడా కచ్చితంగా ఆయా దేశాలు పాటిస్తూ వస్తున్నాయి.

చైనా రష్యా ఒక కూటమిగా ఉన్నాయి. పాకిస్థాన్ కూడా వీరితోనే ఉంది. ఈ కీలక సమయంలో భారత్ తటస్థ విధానంతోనే ముందుకు పోతోంది. శాంతి కోసమే పరితపిస్తోంది. అయితే ప్రపంచ రాజకీయం బాగా మారుతోంది. అమెరికా ఒక వైపు భారత్ ని తన మిత్ర దేశంగా చేసుకోవాలని చూస్తోంది. గట్టిగా చెప్పాలీ అంటే ఆర్ధిక సంస్కరణల తరువాత ప్రపంచీకరణ నేపధ్యం తరువాత సోవియట్ యూనియన్ పతనం తరువాతా భారత్ అమెరికాకు సన్నిహితం అవుతోంది.

అదే టైమ్ లో పూర్తిగానా అంటే కాదు, కొన్ని విషయాల్లో అమెరికానూ భారత్ విభేదిస్తూ వస్తోంది. దాని వల్ల దక్షిణాసియాలో భారత్ ఇబ్బందులు కూడా పడుతోంది. ఇపుడు రష్యా ప్రపంచ పెద్దన పాత్ర కోసం ఉక్రెయిన్ దాడిని ఉపయోగించుకోవాలని చూస్తోంది. కచ్చితంగా చైనా మద్దతు రష్యాకు ఉంటుంది. ఈ కీలకమైన సమయంలో భారత్ వైఖరి తటస్థంగా ఉండాలా లేక ఏటో ఒక వైపు మొగ్గాలా అంటే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.

రష్యా మిత్రదేశమని, అలాగే అమెరికాతో సాన్నిహిత్యం ఉందని భారత్ భావిస్తోంది. కానీ రష్యా అమెరికా రెండూ ఇపుడు ఉక్రెయిన్ విషయంలో ఎదురు నిలిచి ఉన్న వేళ భారత్ కూడా తన రూటు ఎటో చెప్పమంటోంది అమెరికా. భారత్ మీద అమెరికా వత్తిడి కూడా పెరుగుతోంది. ఈ మేరకు అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ తో తాజాగా ఫోన్ లో మాట్లాడారు.

భారత్ తమతో చేతులు కలిపితే రష్యా ఆటకు కట్టించవచ్చు అని ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. భారత్ రష్యా పట్ల అనుసరిస్తున్న మెతక వైఖరి మీద అమెరికా గుర్రుగా ఉందని అంటున్నారు. ఉక్రెయిన్ పై రష్యా దాడిని ఖండించే విషయంలో భారత్ వైఖరి పట్ల అమెరికా సంతోషంగా లేదని అంటున్నరు. ఇదే విషయాన్ని భారత్ లోని అధికారులకు అమెరికా అధికారులు తెలియజేసినట్టు సమాచారం.

మొత్తానికి చూస్తే భారత్ ని తన వైపునకు లాగాలని అమెరికా ప్రయత్నం ఒక వైపు ఉంటే. మరో వైపు రష్యా భారత్ ని మిత్ర దేశంగా ఎంత వరకూ చూస్తుంది అన్నది మరో ప్రశ్న. చైనా, భారత్ ల మధ్య సరిహద్దు వివాదాలు వచ్చినపుడు రష్యా చైనా వైపే ఉంది. గట్టిగా చెప్పాలీ అంటే భారత్ చైనాలలో చైనాకే రష్యా మద్దతు ఎప్పటికైనా ఇస్తుందని కూడా అంటారు.

మరి ఈ కీలకమైన వేళలో అమెరికాతో కలసి ప్రయాణం చేయడం కూడా సమంజసమేనా అంటే అది కూడా గట్టిగా చెప్పలేని స్థితి. అమెరికా తన ప్రయోజనాలను మాత్రమే కాపాడుకుంటుంది. అవసరం అయిన మేరకే ఇతరులను వాడుకుంటుంది. ఈ పరిస్థితుల్లో ఉక్రెయిన్ రష్యా యుధ్ధం కాదు కానీ భారత్ తటస్థ వైఖరి ఇపుడు పెద్ద చర్చగా మారుతోంది.

అయితే ఇక్కడ మరో విషయం కూడా దౌత్య నిపుణుల నుంచి వస్తోంది. రష్యా ఉక్రెయిన్ లాంటి చిన్న దేశం మీద యుద్ధం చేయడం తప్పు. అంతర్జాతీయ నియమాలను రష్యా ఇక్కడ పూర్తిగా ఉల్లంఘించింది. ఈ విషయాన్ని అయినా భారత్ గట్టిగా చెప్పి ఉండవచ్చు. అలా తన స్వతంత్ర వాణిని, తన విదేశీయ విధానాన్ని బయటపెట్టుకోవచ్చు అని అంటున్నారు.

ఒక వేళ ఈ రోజు భారత్ తటస్థంగా ఉన్నా లేక మౌనంగా ఉన్నా రేపటి రోజున రష్యా స్పూర్తితో తన వద్ద అపారమైన ఆయుధాలు ఉన్నాయి కాబట్టి భారత్ మీద ఏకపక్షంగా చైనా యుధ్దానికి దిగితే అపుడు పరిస్థితి ఏంటి అన్నది కూడా మరో చర్చగా ఉంది. తప్పును తప్పు అని చెప్పినపుడే రేపటి రోజున భారత్ అయినా మరో దేశమైనా ప్రపంచ దేశాల నైతిక మద్దతు కోరే అవకాశం ఉంటుంద‌న్నది కూడా ఒక వాదన. మొత్తానికి భారత్ ఉన్నది ఉన్నట్లుగా చెప్పడమే బెటర్ అన్న మాట అయితే ఉంది. చూడాలి మరి.