Begin typing your search above and press return to search.

ఎన్నారైల‌నూ దెబ్బ కొట్టేసిన ట్రంప్‌!

By:  Tupaki Desk   |   1 Feb 2017 10:48 AM GMT
ఎన్నారైల‌నూ దెబ్బ కొట్టేసిన ట్రంప్‌!
X
అమెరికా అధ్యక్షుడిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌రుక్ష‌ణం నుంచే డొనాల్డ్ ట్రంప్ త‌న‌దైన దూకుడును ప్ర‌ద‌ర్శించ‌డం మొదలెట్టారు. పొరుగు దేశం నుంచి వ‌ల‌స‌ల‌ను ర‌ద్దు చేసేసిన ట్రంప్‌... తాజాగా భార‌త్‌ పైనా ప‌రోక్షంగా దాడి మొద‌లుపెట్టిన‌ట్టుగా ఉన్నారు. అయినా అమెరికా అధ్య‌క్షుడి హోదాలో భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి స్వ‌యంగా ఫోన్ చేసిన ట్రంప్‌... భార‌త్‌ కు వ్య‌తిరేకంగా ఎందుకు నిర్ణ‌యం తీసుకుంటార‌నేగా మీ అనుమానం? ఎంత స్నేహ హ‌స్తం ముందుకు చాపినా... త‌మ సొంత ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకునే క్ర‌మంలో ట్రంప్ తీసుకున్న ఓ కీల‌క నిర్ణ‌యం భార‌త్‌ కు నిజంగా అశ‌నిపాతంగానే ప‌రిణ‌మించ‌నుంది. ఇక అసలు విష‌యంలోకి వెళితే... హెచ్‌-1బీ వీసాల‌కు సంబంధించి అమెరికా అమ‌లువుతూ వ‌స్తున్న చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేస్తూ ‘ద హై స్కిల్డ్‌ ఇంటిగ్రిటీ అండ్‌ ఫెయిర్‌ నెస్‌ యాక్ట్‌ 2017’ పేరిట రూపొందించిన బిల్లు నిన్న అమెరికా చ‌ట్ట‌సభల్లోని దిగువ స‌భ ప్ర‌తినిధుల స‌భ ముందుకు వ‌చ్చింది. ఈ బిల్లుకు ప్ర‌తినిధుల స‌భ‌తో పాటు అమెరికా ఎగువ స‌భ కాంగ్రెస్ కూడా ఆమోదం తెల‌పాల్సి ఉంది. ఈ రెండు స‌భ‌ల్లో ఈ బిల్లుకు ఆమోదం ల‌భిస్తే... ఈ బిల్లు చ‌ట్టంగా మారిపోతుంది.

అస‌లు ఈ బిల్లులో ఉన్న అంశాల విష‌యానికి వ‌స్తే... అమెరికాలో కార్య‌క‌లాపాలు సాగిస్తున్న సంస్థ‌లు ఇక‌పై విదేశాల నుంచి నిపుణుల‌ను నియ‌మించుకోవాలంటే... వారికి క‌నీస వేత‌నాన్ని 1.30 ల‌క్ష‌ల డాల‌ర్లుగా అమ‌లు చేయాలి. అంటే అక్ష‌రాల రూ.88 ల‌క్ష‌ల‌న్న మాట‌. .ప్ర‌స్తుతం ఈ ప‌రిమితి 60 వేల డాల‌ర్లుగా ఉంది. క‌నీస వేత‌నం 60 వేల డాల‌ర్ల వేత‌నం ఇస్తూ ఏ సంస్థ అయినా విదేశాల నుంచి నిపుణుల‌ను అమెరికా ర‌ప్పించుకోవ‌చ్చు. అయితే ఎంత‌మంది అవ‌స‌ర‌మైతే అంత‌మందిని మాత్రం ర‌ప్పించుకోలేవు. 1989 నుంచి అమ‌లులో ఉన్న ఈ చ‌ట్టానికి దాదాపుగా ఇప్ప‌టిదాకా మార్పులేమీ జ‌ర‌గ‌లేదు. అధ్య‌క్ష ప‌ద‌వి చేప‌ట్టిన ప్ర‌తి నేత కూడా దీని జోలికి వెళ్లిన దాఖ‌లా లేదు. అయితే అమెరిక‌న్లకే ఉపాధి అవ‌కాశాలు అందివ‌చ్చేలా ఈ చ‌ట్టానికి ట్రంప్ తాజా ప్ర‌తిపాద‌న చేసిన‌ట్లుగా చెబుతున్నారు. కాలిఫోర్నియా కాంగ్రెస్‌ సభ్యురాలు జోయ్‌ లోఫ్‌ గ్రెన్ ఈ బిల్లును ప్ర‌తినిధుల స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్టారు. బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన సంద‌ర్భంగా ఆమె ఈ బిల్లుకు కొత్త అర్థం చెప్పారు. కేవ‌లం అమెరికన్ల‌కు ఉపాధి అవ‌కాశాలు అందించేందుకు మాత్ర‌మే ఈ బిల్లును ప్ర‌వేశ‌పెట్ట‌లేద‌ని చెప్పారు. త‌మ ఉద్దేశ్యం కూడా అది కాద‌ని కూడా చెప్పుకొచ్చారు.

ఈ బిల్లు చ‌ట్టంగా మారితే... ఏదేనీ కంపెనీ తాము ప్ర‌తిపాదించిన మేర వేత‌నం ఇస్తూ... ఎంత‌మంది నిపుణులైన విదేశీయుల‌నైనా అమెరికాకు తీసుకెళ్లొచ్చ‌ని ఆమె చెప్పుకొచ్చారు. దీంతో మంచి వేత‌నాలు ఇచ్చే కంపెనీల‌కు ఈ బిల్లు సువ‌ర్ణావ‌కాశ‌మేన‌ని ఆమె చెప్పారు. ఇక ఈ బిల్లులోని మ‌రో ప్ర‌ధాన అంశం విష‌యానికి వ‌స్తే... 50 మంది కంటే త‌క్కువ సిబ్బంది ఉన్న కంపెనీలు అస‌లు విదేశాల నుంచి నిపుణులైన ఉద్యోగుల‌నే అమెరికాకు తీసుకెళ్ల‌లేవు. ఇక ఈ బిల్లు చ‌ట్టంగా మారితే... భార‌త్‌ కు ఎదుర‌య్యే న‌ష్టాల విష‌యానికి వ‌స్తే... మ‌న దేశానికి చెందిన ఐటీ నిపుణులంతా దాదాపుగా అమెరికాలోనే ఉంటున్నారు. ఇత‌ర దేశాల్లో మ‌న ఐటీ నిపుణులున్నా... మ‌నోళ్ల ల‌క్ష్యం మాత్రం అమెరికా అనే చెప్పాలి. అయితే ట్రంప్ బిల్లు చ‌ట్టంగా మారితే... మ‌న‌వాళ్ల‌లో ఏ ఒక్క శాత‌మో, రెండు శాతమో త‌ప్పించి మిగిలిన వారంతా మూటా ముల్లే స‌ర్దుకుని వెనుదిర‌గాల్సిందే.

మ‌న దేశం నుంచి అమెరికా వెళ్లి వివిధ ఐటీ సంస్థ‌ల్లో ప‌నిచేస్తున్న మ‌నోళ్ల వేత‌నాలు 1.30 ల‌క్ష‌ల డాల‌ర్ల మార్కుకు చాలా దూరంలో ఉంది. ప్ర‌స్తుతం అమ‌లులో ఉన్న చ‌ట్టం ప్ర‌కారం 60 వేల డాల‌ర్ల వేత‌నం కంటే కాస్త అటు ఇటూగా వేత‌నాలు ఖ‌రారు చేసిన అమెరిక‌న్ సంస్థ‌లు మ‌నోళ్ల‌ను అక్కడికి తీసుకెళ్లాయి. వారికంద‌రికీ కొత్త చ‌ట్టం ప్ర‌కారం 1.30 ల‌క్ష‌ల డాల‌ర్ల క‌నీస వేత‌నాన్ని అమ‌లు చేయ‌డం దాదాపుగా దుస్సాధ్య‌మే. టెక్ దిగ్గ‌జాలైన యాపిల్‌ - మైక్రోసాఫ్ట్‌ - గూగుల్ తదిత‌ర సంస్థ‌లు కొత్త బిల్లు మేర‌కు వేత‌నాలు స‌వ‌రించినా... మిగిలిన సంస్థ‌లకు మాత్రం వేత‌న స‌వ‌రణ దాదాపుగా సాధ్యం కాదు. దీంతో మనోళ్లంతా తిరుగుముఖం ప‌ట్ట‌క త‌ప్ప‌ద‌న్న వాద‌న వినిపిస్తోంది. మ‌రి ప్ర‌తినిధుల స‌భ‌తో పాటు కాంగ్రెస్ కూడా ఈ బిల్లుపై ఎలా స్పందిస్తాయో చూడాలి. ఒక‌వేళ ట్రంప్ ఆశిస్తున్న‌ట్లుగా ఈ బిల్లుకు మాత్రం చ‌ట్ట‌బ‌ద్ధ‌త ల‌భిస్తే... మ‌నోళ్లంగా త‌ట్టా బుట్టా స‌ర్దేసుకుని తిరుగుముఖం ప‌ట్ట‌డం ఖాయ‌మే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/