Begin typing your search above and press return to search.

మ‌న ఐటీ కంపెనీలకు ట్రంప్ దిమ్మ‌తిరిగే షాక్‌

By:  Tupaki Desk   |   29 Sep 2017 7:10 AM GMT
మ‌న ఐటీ కంపెనీలకు ట్రంప్ దిమ్మ‌తిరిగే షాక్‌
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో షాక్ ఇచ్చారు. త‌న‌దైన శైలిలో తీసుకున్న నిర్ణయంతో భారత ఐటీ కంపెనీల నెత్తిన మరో పిడుగు పడింది. ఇప్పటికే హెచ్-1బీ వీసాలపై ఆంక్షలు విధించడంతో భారత ఐటీ కంపెనీలు తీవ్రంగా నష్టపోయాయి. వంద‌లాది ఐటీ ఉద్యోగాలు ఊడిపోయాయి. బై అమెరికన్...హైర్ అమెరికన్ నినాదంతో అధికారం చేజిక్కించుకున్న ట్రంప్.. విదేశీ కంపెనీలపై ఉక్కుపాదం మోపుతున్నారు. అమెరికా కంపెనీలకు - అమెరికన్లకు తమ ప్రభుత్వ హయాంలో ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని తేల్చిచెబుతున్నారు. దీనికి కొన‌సాగింపుగా మరో షాక్ ఇస్తూ...అమెరికాలో ఉండే ఐటీ కంపెనీలు విదేశాలకు ఔట్‌ సోర్సింగ్ ఇవ్వడాన్ని సమీక్షిస్తామని ట్రంప్‌ ప్రకటించారు. ఈ ప‌రిణామంపై ఐటీ ప‌రిశ్ర‌మ షాక్‌ కు లోన‌వుతోంది.

భారత ఐటీ సంస్థలతో కుదిరిన ఔట్‌ సోర్సింగ్ కాంట్రాక్టులతోపాటు హెచ్1బీ వీసాలపైనా సమీక్షించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఔట్‌ సోర్సింగ్ విధానాలనే కాకుండా, హెచ్-1బీ వీసాలపైనా సమీక్షించాలని అధికారులను ట్రంప్ ఆదేశించారు. తాము ఇచ్చిన కాంట్రాక్టులపై - ప్రాజెక్టుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాల్సిందిగా టీసీఎస్ - ఇన్ఫోసిస్ వంటి ఐటీ దిగ్గజ సంస్థలను అమెరికా ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం. నాలుగునెలల్లోగా ఈ నివేదికలపై సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిసింది. అమెరికాలో 3.2-3.5శాతం కాంట్రాక్టులను కాగ్నిజెంట్ - టీసీఎస్ - ఇన్ఫోసిస్ వంటి పలు భారత కంపెనీలే దక్కించుకున్నాయి. వీటి విలువ వేల కోట్ల డాలర్లు ఉంటుంది.ఇప్పుడు ఔట్‌ సోర్సింగ్‌ లో కూడా ఆంక్షలు విధిస్తే భారత ఐటీ పరిశ్రమ కుప్పకూలుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఐటీ కంపెనీల్లోని వేల మంది ఉద్యోగులపై దాని ప్రభావం తీవ్రంగా పడుతుందని విశ్లేషిస్తున్నారు.

కాగా, ఈ ఏడాది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - భారత ప్రధాని నరేంద్ర మోడీ భేటీలో భార‌తీయ ఐటీ ప‌రిశ్ర‌మ కళ్లు కాయ‌లు కాసేలా ఎదురు చూస్తున్న హెచ్-1బీ వీసాల అంశం చ‌ర్చ‌కు రాని సంగ‌తి తెలిసిందే. ఈ భేటీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఎలాగైన ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తార‌ని, ఐటీ ప‌రిశ్ర‌మ‌కు ఉప‌శ‌మ‌నం క‌లిగించే ప్ర‌క‌ట‌న‌ను ఈ భేటీ ద్వారా సాధిస్తార‌ని ఆకాంక్షించారు. కానీ అలాంటి ప్ర‌క‌ట‌న ఏమీ రాక‌పోవ‌డంతో ఐటీ ప‌రిశ్ర‌మ నిరాశ‌లో కూరుకుపోయింది. ట్రంప్‌ తో భేటీ - సుదీర్ఘ సమ‌యం జ‌రిపిన సంభాష‌ణ‌లో కీల‌కమైన అంశానికి ప‌రిష్కారం చూప‌లేక‌పోయార‌ని ప‌లువురు వ్యాఖ్యానించారు. దానికి కొన‌సాగింపుగా అన్న‌ట్లు తాజా ప‌రిణామం చోటుచేసుకుంది.