Begin typing your search above and press return to search.

ట్రంప్ నోటి నుంచి పే..ద్ద బాంబే పేలింది

By:  Tupaki Desk   |   14 Nov 2016 3:57 AM GMT
ట్రంప్ నోటి నుంచి పే..ద్ద బాంబే పేలింది
X
వివాదాస్పద వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. అమెరికా అధ్యక్ష పదవిలో ఎలాంటి అధినేత వద్దంటే వద్దన్న భావనను అమెరికన్లు వినిపించారో.. ఇప్పుడు అదే వ్యక్తి వచ్చే ఏడాది అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచార సమయంలో దూకుడుగా వ్యవహరించిన ఆయన.. ఎన్నికల విజయం నేపథ్యంలో ఆయన నోటి మాట మారుతుందని.. ఎన్నికల సమయంలో మాదిరి విరుచుకుపడే అవకాశం తక్కువగా ఉంటుందన్న భావన వ్యక్తమైంది.

ఎన్నికల్లో చారిత్రక విజయం తర్వాత మాట్లాడిన ట్రంప్.. అందరిని కలుపుకుపోతానన్న సంకేతాల్ని ఇచ్చేలా మాట్లాడి.. అందరిలో కొత్త ఆశల్ని పెంచారు. అయితే.. తాను ఏమీ మారలేదని.. ప్రచార సమయంలో ట్రంప్ నోటి నుంచి ఎలాంటి మాటలు వచ్చాయో.. అవే మాటలు మరోసారి వచ్చాయి. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త కలకలాన్ని రేపుతున్నాయి.

అమెరికాలో చట్ట విరుద్ధంగా నివసిస్తున్న 30 లక్షల మంది విదేశీయుల్ని తాను అధికారపీఠం ఎక్కిన మరుక్షణమే పంపేస్తానని బాంబు పేల్చారు. తాజాగా సీబీఎస్ న్యూస్ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన.. బాంబు లాంటి వ్యాఖ్యను పేల్చినట్లుగా తెలుస్తోంది. నేరగాళ్లు.. నేరచరిత ఉన్నవాళ్లు.. గ్యాంగస్టర్లు.. డ్రగ్ డీలర్లు 20 నుంచి 30 లక్షలమంది ఉన్నారని.. వారిని స్వదేశాలకు పంపటం లేదంటే వారిని అరెస్ట్ చేయటం లాంటివి చేస్తామని ట్రంప్ స్పష్టం చేశారు.

మెక్సికోతో సరిహద్దుల్లో భారీ గోడను నిర్మిస్తానని ట్రంప్ స్పష్టం చేశారు. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితుల్ని భద్రతా సిబ్బంది నియంత్రించగలుగుతారని.. కొన్ని ప్రాంతాల్లో మాత్రం గోడ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. తాను తీసుకున్న ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదన్న వ్యాఖ్య చేసిన ట్రంప్ పుణ్యమా అని మెక్సికోకు అమెరికాకు అడ్డుగా గోడ రానుందన్నది ఇప్పుడు స్పష్టమైందని చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ట్రంప్ గెలిచినట్లుగా వార్తలు వచ్చిన వెంటనే.. మెక్సికోకు అడ్డుగా కట్టే గోడకు అమెరికాకు ఒక్క పైసా కూడా ఇవ్వమని ఆ దేశం స్పష్టం చేసింది.

ఈ రోజు (సోమవారం) టెలికాస్ట్ కానున్నఈ ఇంటర్వ్యూలో మెక్సికో నుంచి క్రిమినల్స్.. డ్రగ్స్ ను కట్టడి చేసేందుకు వీలుగా సరిహద్దుల్లో గోడ నిర్మాణం తప్పనిసరి అన్న మాటను ఆయన నోటి నుంచి రావటం కలకలం రేపుతోంది. ట్రంప్ నిర్ణయంతో ఆయన నేతృత్వం వహిస్తున్న రిపబ్లికన్ల నేత విభేదించటం గమనార్హం. ఇలా.. ప్రతి అంశంపై తనదైన శైలిలో విరుచుకుపడుతున్న ట్రంప్.. తన రాజకీయ ప్రత్యర్థి హిల్లరీపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆమె హుందాతనం.. శక్తివంతమైన తెలివైన నేతగా అభివర్ణించారు. ఓడిన తర్వాత ఆమె ఎంతో హుందాగా.. ఎంతో మర్యాదగా ఫోన్ చేసిన విషయాన్ని ఆయన గుర్తించటం గమనార్హం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/