Begin typing your search above and press return to search.

ట్రంపూ... అదేమంత వీజీ కాదు!

By:  Tupaki Desk   |   4 March 2017 9:29 AM GMT
ట్రంపూ... అదేమంత వీజీ కాదు!
X
ఔట్ సోర్సింగ్ సేవ‌ల‌ను విదేశాల‌కు త‌ర‌లించేందుకు అమెరికా కంపెనీల‌కు చెక్ పెట్టేందుకు ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధం చేస్తున్న కార్య‌రంగం భార‌త్ లాంటి దేశాల‌కు పెద్ద దెబ్బే అయినా... అదే స‌మ‌యంలో అమెరికాకు మాత్రం చుక్క‌లు క‌నిపించ‌క మాన‌వ‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా అమెరికా కంపెనీలు విదేశీయుల‌కు ఇచ్చేసిన ఉద్యోగాల‌ను తిరిగి త‌మ దేశానికి చెందిన వారికి ఇస్తే... వారికి లాభం కాకుండా న‌ష్ట‌మెలా వ‌స్తుంద‌న్న అనుమానం రాక మాన‌దు. మ‌రి అమెరికాకు అంత మేర లాభం క‌లిగించే ఈ విష‌యానికి సంబంధించి ఇటీవ‌లే ఆ దేశ అధ్య‌క్షుడిగా ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన బ‌రాక్ ఒబామా హయాంలోనే చ‌ట్ట‌స‌భ‌ల ముందుకు వ‌చ్చిన ఈ బిల్లు ఎందుకు వెన‌క్కి వెళ్లిపోయిందో తెలుసా? ఆ విష‌యం తెలిస్తే... మ‌న‌కు దెబ్బేయాల‌నుకుంటున్న ట్రంప్ అండ్ కోకు ఎంత భారీ షాక్ త‌గులుతుందో అర్ధం అవుతుంది.

ఇక అస‌లు విష‌యంలోకి వ‌స్తే... అమెరికా కంపెనీలు ఔట్ సోర్సింగ్ పేరిట భార‌త్ లాంటి దేశాల బాట ఎందుకు ప‌డుతున్నాయో తెలుసుగా. అమెరికాలో కంటే ఇక్కడ అతి త‌క్కువ ధ‌ర‌ల‌కే సేవ‌లు అందుతున్నాయి. అమెరికాలో ఓ ప‌ని చేసేందుకు అయ్యే వ్య‌యం... అదే ప‌నిని భార‌త్ లాంటి దేశాల‌కు త‌ర‌లించి చేయిస్తే... అతి త‌క్కువ వ్య‌య‌మే అవుతుంది. అంటే స‌ద‌రు ప‌నిని అమెరికాలో చేయించుకునే కంటే కూడా ఆ దేశ కంపెనీల‌కు భార‌త్ లాంటి ఔట్ సోర్సింగ్ డెస్టినేష‌న్ల‌లో చేయించుకోవ‌డ‌మే చౌక‌. మ‌రి అలాంటి వెసులుబాటు ఉన్న‌ప్పుడు ఏ దేశ కంపెనీలైనా లాభాలు ఎందుకు వ‌దులుకుంటాయి? ఎక్కువ ఖ‌ర్చు పెట్టి అమెరికాలోనే ఎందుకు చేయించుకుంటాయి? అయినా భార‌త్ లోలా త‌క్కువ వేత‌నాల‌కే ప‌నిచేసే వారు అమెరికాలో చాలా అరుదు. ఆ దేశ యువ‌త‌కు భారీ వేతనాలిస్తే త‌ప్పించి ఈ ప‌నులు చేయ‌లేరు. అందుకే ఆ దేశ కంపెనీల‌కు ఔట్ సోర్సింగ్ విధానం వ‌రంలా మారింది.

అమెరికా దేశ కంపెనీల‌కు వ‌రంలా మారిన ఈ విధానం... ఆ దేశ ప్ర‌భుత్వానికి మాత్రం చాలా ఇబ్బందిక‌ర‌మైన ప‌రిస్థితుల‌నే తెచ్చి పెట్టింద‌ని చెప్పాలి. ఇలా ఔట్ సోర్సింగ్ పేరిట అమెరికా ఉపాధి అవ‌కాశాల‌న్నీ విదేశాల‌కు త‌ర‌లిపోతే... అమెరికా యువ‌త‌కు ఉపాధి ఎక్క‌డి నుంచి దొరుకుతంది? ఇదే రీతిలో ఆలోచించిన ఒబామా స‌ర్కారు ఔట్ సోర్సింగ్ సేవ‌ల‌ను క‌ట్ట‌డి చేసేందుకు య‌త్నించింది. ఈ స‌మ‌యంలోనే త‌క్కువ ఖ‌ర్చుతో అయ్యే ప‌నిని ఇక్క‌డ అధిక ఖ‌ర్చులు పెట్టి చేయించుకోవ‌డంతో తమ ఆర్థిక ప‌రిస్థితులు దిగ‌జారడం ఖాయ‌మ‌ని ఆ దేశ కంపెనీల‌న్నీ గ‌గ్గోలు పెట్టాయి. దీంతో ఈ వ్య‌వ‌హారంపై పూర్తి స్థాయిలో స‌మీక్ష జ‌రిపిన ఒబామా ప్ర‌భుత్వం నాడు వెన‌క‌డుగు వేయ‌క త‌ప్ప‌లేదు.

ఇక ప్రస్తుత విష‌యానికి వ‌స్తే... నాడు ఒబామా స‌ర్కారు ప్ర‌తిపాదించిన బిల్లుకే కాస్త అటూ ఇటూగా మార్పులు చేసి ట్రంప్ స‌ర్కారు ప్ర‌తినిధుల స‌భ ముందుకు తీసుకువ‌చ్చింది. అయితే ఇప్పుడు కూడా కంపెనీలు నాడు చేసిన వాద‌న‌నే తిరిగి వినిపించేందుకు కార్యరంగం సిద్ధం చేసుకుంటున్నాయి. వేలల్లో పూర్త‌య్యే ప‌నికి ల‌క్షలు ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తే త‌మ ప‌రిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించాల‌ని ఆయా కంపెనీలు ట్రంప్ ముందు క్యూ క‌ట్టే అవ‌కాశాలు లేక‌పోలేదు. అంతేకాకుండా ఔట్ సోర్సింగ్ సేవ‌ల‌కు, ప్ర‌భుత్వ సాయానికి ముడిపెట్ట‌డం ఎంత‌వ‌ర‌కు భావ్య‌మ‌న్న విష‌యాన్నికూడా మ‌రోమారు ప‌రిశీలించాల‌ని కూడా ఆయా కంపెనీలు ట్రంప్ బృందానికి విజ్ఞ‌ప్తి చేయ‌నున్న‌ట్లు స‌మాచారం. మ‌రి వారికి ట్రంప్ ఏ రీతిన స‌మాధానం చెబుతారో?... ఈ బిల్లుకు ఆమోద ముద్ర కోసం ఆయ‌న ఏ ర‌క‌మైన వ్యూహం అవ‌లంబిస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/