Begin typing your search above and press return to search.

అమెరికాలో మరీ ఇంత కంపు రాజకీయమా?

By:  Tupaki Desk   |   9 May 2016 7:38 AM GMT
అమెరికాలో మరీ ఇంత కంపు రాజకీయమా?
X
మన రాజకీయ నేతల మాటలు.. చేష్టలు.. ప్రత్యర్థుల పట్ల వ్యవహరించే వైఖరిని చూసి విపరీతంగా ఆవేదన చెందుతాం. ఏమిటిలా వ్యవహరిస్తారు? మరి ఇంత దిగజారుడు రాజకీయాలు అవసరమా? అన్న చర్చ తరచూ తెర మీదకు వస్తుంటుంది. మనకంటే ఎంతో ఉన్నతంగా ఉంటారని అనుకోవటమే కాదు.. హుందాగా రాజకీయాలు చేస్తారనుకునే అమెరికాలో తాజా రాజకీయం చూస్తే.. మరీ ఇంత కంపు రాజకీయమా? అంటూ ముక్కున వేలేసుకోవాల్సిందే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో తాజాగా చోటు చేసుకుంటున్న పరిణామాలు షాకింగ్ గా మారటమే కాదు.. మరీ ఇంత దిగజారుడు వ్యాఖ్యలు మన దగ్గర ఉండవన్న భావన కలగటం ఖాయం.

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగాలని భావిస్తున్న డోనాల్డ్ ట్రంప్ ది ఎంత కంపు నోరు అన్నది అందరికి తెలిసిందే. తన వివాదాస్పద వ్యాఖ్యలతో ఇప్పటికే ప్రపంచ మీడియాను ఆకర్షించిన ఆయన తాజాగా తన ప్రత్యర్థిగా అయ్యే అవకాశం ఉన్న హిల్లరీ క్లింటన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ల అభ్యర్థిగా దాదాపు కన్ఫర్మ్ అయిన ట్రంప్ తొలిసారి తన ప్రత్యర్థి అయ్యే హిల్లరీపై వ్యక్తిగత విమర్శలు చేయటం గమనార్హం.

హిల్లరీ భర్త క్లింటన్ అమెరికా మాజీ అధ్యక్షుడిగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. అమెరికా అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించే సమయంలో ఆయనకున్న వివాహేతర సంబంధాలు బయటకు పొక్కి ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఇదే అంశాన్ని తనదైన శైలిలో ప్రస్తావించిన ట్రంప్.. క్లింటన్ వివాహేతర సంబంధాలకు ఆయన భార్య హిల్లరీ ప్రోద్బలం ఉందంటూ ఆరోపించారు. భర్త అక్రమ సంబంధాలను హిల్లరీ అనుమతించారని.. ఆమె కానీ అమెరికా అధ్యక్షురాలు అయితే మహిళల జీవితాల్ని నాశనం చేస్తుందంటూ మండిపడ్డారు.

‘‘ఇంత నీచంగా భర్త ఎఫైర్స్ కు మద్దతు ఇస్తారంటే నమ్మలేం. ఆ మహిళల పట్ల హిల్లరీ తీరు చాలా అవమానకరం. వివాదాలన్నీ సద్దుమణిగాక హిల్లరీ తీరు కారణంగా వారి జీవితాలు దెబ్బ తిన్నాయి’’ అంటూ తీవ్రస్థాయిలో చెలరేగిపోయారు. ఒక మహిళ.. తన భర్త వివాహేతర సంబంధాలకు మద్దతు ఇస్తుందంటూ విమర్శలు చేసే స్థాయి మన రాజకీయాల్లో ఎక్కడా కనిపించదు. మహిళలకు ఇవ్వాల్సిన కనీస మర్యాదను మర్చిపోయిన ట్రంప్ తీరు చూస్తే.. రానున్న రోజుల్లో మరెన్ని కంపు వ్యాఖ్యలు ఆయన నోటి నుంచి వస్తాయో..?