Begin typing your search above and press return to search.

కూతురు మీదా ట్రంప్ కారు కూతలు!

By:  Tupaki Desk   |   10 Oct 2016 4:13 AM GMT
కూతురు మీదా ట్రంప్ కారు కూతలు!
X
ఇప్పటివరకూ చాలామంది రాజకీయ నేతల గురించి విన్న వారికి.. ఆ రాజకీయ నేతల్లో కొందరి దుర్మార్గాల గురించి తెలిసిన వారు సైతం షాక్ తినేలా ఉంది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వ్యవహారం. ఏ తండ్రి కూడా తన కూతురి గురించి అసభ్యంగా మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు. దురదృష్టవశాత్తు ట్రంప్ లో అలాంటి రాక్షస గుణం కూడా ఉందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా.. బరిలో ఉన్న ఇద్దరు ప్రముఖులకు సంబంధించిన గత అంశాల్ని టైమ్లీగా బయట పెట్టటం కనిపిస్తుంది.

అదే తీరులో ట్రంప్ మీద ఇటీవలే బయటకు వచ్చిన సెక్సీ టేపుల దుమారం ఒక కొలిక్కి రాక ముందే.. తాజాగా తన కుమార్తె గురించి ఒక ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు కొత్త దుమారానికికారణం అవుతున్నాయి. దాదాపు 17 ఏళ్ల కిందట హోవార్డ్ స్టెర్న్ అనే రేడియో జర్నలిస్ట్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ ఒకటి బయటకు వచ్చింది. ఇందులో.. తన కుమార్తెపై ట్రంప్ పలుమార్లు అసభ్య వ్యాఖ్యలు చేయటం ఉందంటూ సీఎన్ఎన్ తాజాగా ఒక కథనాన్ని వెల్లడించింది.

ఇదొక్కటే కాదు.. పదేళ్ల కిందట అంటే 2006లో సైతం ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో సైతం తన కుమార్తె ఇవాంకా ట్రంప్ పై నోరు పారేసుకున్న వైనం బయట పడింది. తన కూతురు మరింత సెక్సీగా కనబడుతోందంటూ ట్రంప్ తెగబడిన వైనం ఇప్పుడు సంచలనంగా మారటమే కాదు.. ఆయనపై తీవ్ర వ్యతిరేకతకు కారణమవుతోంది. చివరకు ట్రంప్ సతీమణి మోలానియా సైతం స్పందించి.. తన భర్త చేసిన వ్యాఖ్యలు సరిగా లేవని పేర్కొన్నారు. అయితే.. తన భర్త చేసిన వ్యాఖ్యలు గతమని.. అప్పటికీ.. ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందని.. ఆయన చాలా మారారంటూ ఆమె కవర్ చేసే ప్రయత్నం చేశారు. తాజాగా బయటకు వచ్చిన వీడియోలో ఆడవారి గురించి చేసిన మరికొన్ని వ్యాఖ్యలు ఉండటం గమనార్హం. తన కోసం మహిళలు పడి చచ్చేవారని.. తన కోసం వారు ఏం చేసేందుకైనా వెనుకాడేవారు కాదంటూ గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశారు.

ఇటీవల మహిళల్ని చులకనగా చేస్తూ గతంలో చెప్పిన మాటలకు సంబంధించిన వీడియోలు బయటకు రావటంతో సొంతపార్టీ నేతల నుంచే కాదు.. అమెరికన్ల నుంచి ట్రంప్ తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారు. ఇది సరిపోదన్నట్లుగా తాజాగా తన కూతురిపైనా చేసిన సెక్స్ వ్యాఖ్యలు ఇప్పుడు ట్రంప్ కు భారీ ఎదురుగాలి వీచేలా చేస్తున్నాయి. ట్రంప్ కు సంబంధించి తాజాగా వెలుగులోకి వచ్చిన వీడియోలతో డెమొక్రాట్ల అభ్యర్థి హిల్లరీ క్లింటన్ గెలుపు అవకాశాలు చాలా ఎక్కువగా పెరిగినట్లుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నోటి మాటలతో తన ఓటమిని తానే కొని తెచ్చుకున్న అరుదైన రాజకీయ నేతగా డోనాల్డ్ ట్రంప్ అమెరికన్లతో పాటు.. మిగిలిన ప్రపంచ ప్రజలకు గుర్తుండి పోవటం ఖాయం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/