Begin typing your search above and press return to search.

డ్యామేజ్ కంట్రోల్ షురూ చేసిన ట్రంప్ స‌ర్కార్!

By:  Tupaki Desk   |   23 July 2019 8:20 AM GMT
డ్యామేజ్ కంట్రోల్ షురూ చేసిన ట్రంప్ స‌ర్కార్!
X
అవ‌స‌రం లేని విష‌యాల మీద అన‌వ‌స‌రంగా మాట్లాడ‌టం ఎంత‌టి ఇబ్బందిక‌ర ప‌రిస్థితిగా మారుతుంద‌న్న విష‌యం తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ న‌కు అర్థ‌మై ఉంటుంది. ఎంత పెద్ద‌న్న అయితే మాత్రం.. త‌న‌కే మాత్రం సంబంధం లేని అంశాలను ట‌చ్ చేస్తే.. తిప్ప‌లు త‌ప్ప‌వ‌న్న విష‌యం తాజా ఎపిసోడ్ తో ఆయ‌న‌కు అర్థ‌మై ఉంటుంది. తాజాగా క‌శ్మీర్ అంశం పై ట్రంప్ చేసిన వ్యాఖ్య‌లు ఎంత సంచ‌ల‌నంగా మారాయో తెలిసిందే.

క‌శ్మీర్ పై మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయాల్సిందిగా భార‌త ప్ర‌ధాని మోడీ త‌న‌ను సాయం అడిగార‌న్న మాట‌ను ట్రంప్ చెప్ప‌టం.. దీనిపై స్పందించిన భార‌త్‌.. అలాంటిదేమీ లేద‌ని.. ట్రంప్ వ్యాఖ్య‌ల్ని తీవ్రంగా ఖండించ‌ట‌మే కాదు.. క‌శ్మీర్ భార‌త్ అంత‌ర్భాగ‌మ‌ని.. వేరే వారి జోక్యం అస్స‌లు అక్క‌ర్లేద‌ని తేల్చేసింది. దీంతో.. ట్రంప్ స‌ర్కారు ఇరుకున ప‌డింది. త‌మ అధ్య‌క్షుల వారు నోరు జారి చేసిన వ్యాఖ్య‌ల కార‌ణంగా చోటు చేసుకున్న డ్యామేజ్ ను కంట్రోల్ చేసేందుకు వైట్ హౌస్ న‌డుం బిగించింది.

ట్రంప్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల కార‌ణంగా జ‌రిగే న‌ష్టాన్ని వీలైనంత‌గా త‌గ్గించే ప‌నిని మొద‌లెట్టిన వైట్ హౌస్ అధికారులు.. అందులో భాగంగా భార‌త్ స్పంద‌న‌ను స్వాగ‌తించింది. క‌శ్మీర్ అంశంలో భార‌త్.. పాక్ లు చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్క‌రించుకోద‌లిస్తే అమెరికా స్వాగ‌తిస్తుంద‌న్నారు. భార‌త్- పాక్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌ల‌ను త‌గ్గించ‌టానికి అమెరికా స‌హ‌కారం ఎప్పుడూ ఉంటుంద‌న్నారు.

క‌శ్మీర్ పై ట్రంప్ చేసిన వ్యాఖ్య‌ల‌పై అమెరికా కాంగ్రెస్ స‌భ్యులు సైతం త‌మ అధ్య‌క్షుల వారి వ్యాఖ్య‌ల్ని త‌ప్పు ప‌ట్ట‌ట‌మే కాదు.. ఆ విష‌యంలో ట్రంప్ త‌ర‌ఫున తాము క్ష‌మాప‌ణ‌లు కోరుతున్న‌ట్లుగా వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం. ట్రంప్ చేసిన తాజా వ్యాఖ్య‌లు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల మీద ప్ర‌భావం చూపిస్తాయ‌ని భావిస్తున్న వాద‌న‌లు జోరుగా వినిపిస్తున్నాయి. దీంతో.. దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగిన అమెరికా.. న‌ష్ట‌నివార‌ణ‌కు అవ‌స‌ర‌మైన అంశాల‌పై దృష్టి పెట్టింద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. భార‌త్ తో ఆర్థిక సంబంధాలు దెబ్బ తింటే ట్రంప్ స‌ర్కారుకు జ‌రిగే న‌ష్టం పెద్ద ఎత్తున ఉంటుందంటున్నారు. ఈ కార‌ణంతోనే భార‌త్ తో తొల్లి అగ్ర‌రాజ్యానికి ఇబ్బందే అన్న అభిప్రాయాన్ని ప‌లువ‌రు వ్య‌క్తం చేస్తున్నారు. ఇదే.. అగ్ర‌రాజ్యం వెన‌క్కి త‌గ్గ‌టానికి కార‌ణంగా చెప్ప‌క త‌ప్ప‌దు.