Begin typing your search above and press return to search.

కేసుల్లో మేమే టాప్, ఇది గొప్పే: ఎందుకో చెప్పిన ట్రంప్

By:  Tupaki Desk   |   20 May 2020 5:37 PM GMT
కేసుల్లో మేమే టాప్, ఇది గొప్పే: ఎందుకో చెప్పిన ట్రంప్
X
కరోనా మహమ్మారి కారణంగా ఇప్పటి వరకు 3.26 లక్షల మంది మృత్యువాత పడ్డారు. ఇందులో అమెరికాలోనే 94 వేలమంది ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక కేసులు, అత్యధిక మరణాలు అమెరికాలో చోటు చేసుకున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆ దేశ అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయి. ఎవరూ ఊహించని ప్రకటన చేశారు.

ప్రపంచంలోనే అత్యధిక కేసులు కూడా గొప్పవంటూ ట్రంప్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇదో గౌరవ పూర్వకమైన గుర్తింపు అని అభిప్రాయపడ్డారు. ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసుల అమెరికాలో నమోదయ్యాయని, వాస్తవానికి ఇది చెడు విషయం కాదని, అన్ని దేశాలకంటే మేమే టెస్టులు ఎక్కువగా నిర్వహిస్తున్నాం కాబట్టే కేసులు భారీగా నమోదయ్యాయని, దీనిని బ్యాడ్జ్ ఆఫ్ హానర్‌గా భావిస్తున్నామన్నారు. కరోనా టెస్టుల్లో అందరికంటే ముందున్నందుకు గర్విస్తున్నామన్నారు.

అమెరికాలో 1.27 కోట్ల మందికి పైగా కరోనా టెస్టులు చేశారు. ప్రతి పది లక్షల మందిలో 38,671 మందికి పరీక్షలు నిర్వహించారు. ప్రతి పది లక్షల మందికి మృతుల సంఖ్య 284గా ఉంది. అలాగే, ప్రతి పది లక్షల మందిలో సగటున 4,767 కేసులు నమోదయ్యాయి. కరోనా నేపథ్యంలో అమెరికాలోని చాలా రాష్ట్రాలు కొన్ని ఆంక్షలతో తిరిగి తెరుచుకున్నాయి.