Begin typing your search above and press return to search.
ట్రంప్ గుట్టు రట్టు చేసిన న్యూయార్క్ టైమ్స్!
By: Tupaki Desk | 4 Oct 2018 6:27 AM GMTపవర్లో ఉన్న వారు మీడియా మీద దృష్టిని సారించి.. వారిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు వీలుగా ఒత్తిళ్లను తెస్తున్న వైనం ఇప్పుడు ట్రెండ్ గా మారింది. రెండు తెలుగు రాష్ట్రాలతో మొదలుకొని.. జాతీయ స్థాయిలో మోడీ.. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ చేస్తున్న తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
తాజాగా అలాంటి తీరుతో ట్రంప్ బిల్డప్ లను నవ్వుల పాలు చేసే సంచలన కథనాన్ని ప్రచురించింది న్యూయార్క్ టైమ్స్. తాను స్వయంకృషితో బిలియనీర్ గా ఎదిగినట్లుగా అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న ట్రంప్ చెప్పే మాటల్లో ఎంత మాత్రం నిజం లేదని తేల్చింది న్యూయార్క్ టైమ్స్. ట్రంప్ తండ్రి న్యూయార్క్ లో ప్రముఖ బిల్డర్ గా ఉండేవారని తేల్చారు.
తన గురించి ట్రంప్ చెప్పుకునే గొప్పల్లో నిజం లేదన్న విషయాన్ని బయటపెడుతూ సంచలన కథనాన్ని ప్రచురించింది. ట్రంప్ తండ్రి ఫ్రెడ్ సి ట్రంప్.. న్యూయార్క్ నగరంలో ప్రముఖ బిల్డర్ గా ఉండేవారని.. తండ్రి నుంచి కొడుక్కి భారీగా లభించిన ఆస్తి.. కొన్ని రకాల పన్ను ఎగవేతలతో అమెరికా అధ్యక్షుడు స్థితిమంతుడు అయినట్లుగా తేల్చారు.
సీక్రెట్ పన్ను రిటర్న్స్ పత్రాలు.. ఇతర దస్తావేజులను చేజిక్కించుకున్న న్యూయార్క్ టైమ్స్ ప్రతిక ట్రంప్ వాదన నిజం కాదని తేల్చటమే కాదు.. తన తండ్రి నుంచి ట్రంప్ దాదాపు రూ.3వేల కోట్లకు సమానమైన ఆస్తిని పొందినట్లుగా తేల్చింది. పన్నుల ఎగవేతలో తల్లిదండ్రులకు సహకరించటం వల్ల ఈ మొత్తంలో ఎక్కువభాగం ఆయనకీ ఆస్తి వచ్చినట్లుగా పేర్కొంది.
తన తోబుట్టువులతో కలిసి ఉత్తుత్తి కంపెనీలను పెట్టినట్లుగా చూపించిన ట్రంప్.. తల్లిదండ్రుల నుంచి లక్షల డాలర్లను బహుమతుల రూపంలో వచ్చినట్లు చూపించారని చెప్పింది. తన తండ్రి ఆస్తుల్ని తమకు బహుమతుల రూపంలో బదలాయించేలా చేసి భారీ పన్ను రాయితీల్ని పొందినట్లుగా న్యూయార్క్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. ఈ సంచలన కథనంపై యథావిధిగా అమెరికా అధ్యక్ష భవనమైన శ్వేతసౌధం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధ్యక్షుల వారికి సారీ చెప్పాలని.. అధ్యక్షుల వారు సాధిస్తున్న విజయాలు కంటికి కనిపించట్లేదా? అంటూ మండిపడింది. ఇలాంటి మాటలకు తెలుగు మీడియా సంస్థలైతే ఫ్యాంటు తడిపేసుకొని భారీ ఖండనలు వేసేవి. కానీ.. అక్కడున్నది అమెరికా మీడియా.