Begin typing your search above and press return to search.
ట్రంప్ కు భలే చాన్స్ దొరికింది
By: Tupaki Desk | 23 Dec 2016 2:30 AM GMTఅమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు భలే చాన్స్ దొరికింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేయడాన్ని పలువురు తప్పుపట్టగా తాజాగా జరిగిన బెర్లిన్ - అంకారా దాడులతో ట్రంప్ ఘాటుగా రియాక్టయ్యారు. బెర్లిన్ దాడులు తమ పనేనని ఇప్పటికే ఇస్లామిక్ స్టేట్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై ట్రంప్ స్పందిస్తూ...అమెరికాకు ముస్లిం వలసలను నియంత్రించాలన్న తన ప్రతిపాదనను బెర్లిన్ - అంకారా దాడులు వంద శాతం నిజమని నిరూపించాయని అన్నారు. ఈ దాడులు చాలా భయంకరమైనవి అని ఆయన విశ్లేషించారు.
తాజాగా మీడియాతో ట్రంప్ మాట్లాడుతూ ముస్లిం తీవ్రవాదం గురించి రియాక్టయ్యారు. తాజాగా బెర్లిన్ - అంకారాల్లో జరిగిన దాడులు విపరిణామాలకు చిహ్నామన్నారు. ఈ దాడులు అమెరికాలోకి ముస్లిం వలసలపై నిషేధం విధించడం లేదా ముస్లిం దేశాల నుంచి వచ్చేవారికి ప్రత్యేక రిజిస్ట్రీ పెట్టడంలాంటి చర్యలపై ప్రభావం చూపుతుందా అని రిపోర్టర్లు ట్రంప్ ను ప్రశ్నించారు. దీనిపై స్పందించిన ఆయన.. "నేను ఏం చేయబోతున్నానో మీకు తెలుసు. నేను చెప్పిందే వందశాతం నిజమైంది. ఇప్పుడు ఏం జరుగుతున్నది చాలా దురదృష్టకరం" అని అన్నారు. కాగా.. ఉగ్రవాదానికి వ్యతిరేక పోరులో భాగంగా ముస్లింలపై తాత్కాలిక నిషేధం విధిస్తానని కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశాల నుంచి వచ్చేవారిపై తాత్కాలిక నిషేధం అని ట్రంప్ తర్వాత వివరణ ఇచ్చారు. బెర్లిన్ - అంకారా దాడులు క్రిస్టియన్లపై జరుగుతున్న గ్లోబల్ జిహాద్ గా మొదట అభివర్ణించిన ట్రంప్.. తాజాగా అవి మానవత్వంపై జరుగుతున్న దాడులని, వాటిని ఆపాల్సిందేనని అన్నారు. ఈ క్రమంలో అమెరికాలో తాను ఏవిధంగా వ్యవహరించనున్నానో మరోమారు క్లారిటీ ఇచ్చారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/