Begin typing your search above and press return to search.

ట్రంప్ సారుకి కొడుకు కూతురే ఓటేయరట

By:  Tupaki Desk   |   12 April 2016 10:56 AM GMT
ట్రంప్ సారుకి కొడుకు కూతురే ఓటేయరట
X
భారత్ మీద విషం కక్కుతూ.. తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూనే.. అమెరికా అధ్యక్ష రేసులో దూసుకెళ్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు ఓ విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. ఆయనకు సొంత కుటుంబ సభ్యులే ఓటు వేయట్లేదు. అలాగని వాళ్లేమీ ఆయనకు వ్యతిరేకులు కాదు. ఆయన ఓడిపోవాలని కోరుకోవట్లేదు. మేజర్లయినప్పటికీ నిర్ణీత సమయానికి ఓటు నమోదు చేసుకోకపోవడం వల్ల డొనాల్డ్ ట్రంప్ కూతురు - కొడుకు ఎన్నికల్లో ఓటు వేయడానికి అవకాశం లేకపోయింది. ట్రంప్ కు ఇవాంకా అనే అమ్మాయి.. ఎరిక్ అనే అబ్బాయి ఉన్నారు. వీళ్లిద్దరూ తమ తండ్రి కోసం ప్రచారం కూడా చేశారు. కానీ ఆ హడావుడిలో పడి.. ఓటు నమోదు చేయించుకోవడం మరిచిపోయారు. దీంతో ఈ నెల 19న జరిగే ప్రైమరీ ఎన్నికల్లో వారికి ఓటు వేసే అవకాశం లేకపోయింది. దీంతో ట్రంప్ కు పడాల్సిన రెండు ఓట్లు మైనస్ అయిపోయినట్లే అన్నమాట.

‘‘నా పిల్లలిద్దరికీ ఓటు నమోదు చేసుకునేందుకు చాలా సమయం ఉంది. కానీ సరైన నియమ నిబంధనలు తెలియక వారు ఓటు రిజిస్ట్రేషన్ చేయించుకోవడంలో విఫలమయ్యారు. దీని పట్ల వాళ్లిద్దరూ చాలా బాధపడుతున్నారు. అయినా ఏం పర్వాలేదు. నేను అర్థం చేసుకోగలను. ఏడాది ముందే ఓటు నమోదు చేసుకోవాల్సింది. కానీ చేయలేదు. కాబట్టి ఎరిక్.. ఇవాంకా.. ఓటు వేయలేకపోవచ్చు’’ అని చెప్పాడు ట్రంప్. ఇలా అంటూనే ఓటు నమోదు చేయించుకోనందుకు తన పిల్లలిద్దరికీ ఇస్తున్న అలవెన్ససులు కట్ చేస్తానంటూ తనదైన శైలిలో చమత్కరించాడు ట్రంప్. తన పిల్లలు ఓటు వేయకున్నా ట్రంప్ ఎన్నికల్లో గెలిచి తీరుతారని ఎన్నికల విశ్లేషకులు అంటున్నారు.