Begin typing your search above and press return to search.

అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ.. ఏం చేస్తున్నారు?

By:  Tupaki Desk   |   14 March 2020 5:00 AM GMT
అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీ.. ఏం చేస్తున్నారు?
X
అగ్రరాజ్యం ఇప్పుడు ఆగమాగమవుతోంది మొన్నటివరకూ కరోనా ప్రభావం పడని అమెరికా.. ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఎప్పుడైతే యూరప్ లో.. అందునా ఇటలీలో కరోనా వ్యాప్తి చెందటం షురూ అయ్యిందో.. అప్పటి నుంచి ఆ ప్రభావం అమెరికా మీద పడిందన్న మాట వినిపిస్తోంది. చూస్తున్నంతనే అమెరికాలో కరోనా ఓ రేంజ్ లో విస్తరించటమే కాదు.. శుక్రవారం ఒక్కరోజులోనే 500 కొత్త కేసులు నమోదైన వైనం ఉలిక్కిపడేలా చేసింది. దీంతో.. సీన్లోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటిస్తూ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు.

దాదాపు పదకొండేళ్ల క్రితం H1N1 వైరస్ సోకినప్పుడు అమెరికాలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించారు. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ప్రకటించారు. ఈ ప్రకటనతో అమెరికాలో ఎలాంటి పరిస్థితి ఉందన్న విషయం ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పటివరకూ అమెరికాలో 25 బెడ్లకు మాత్రమే పరిమితమైన ఆసుపత్రులు.. ఇప్పుడు బెడ్ల సంఖ్య మీద పరిమితులు పెట్టుకోకుండా సంఖ్యను పెంచేసుకోవచ్చు. ఎలాంటి పేషంట్లనైనా చేర్చుకునే వీలుంది. అంతేకాదు.. ఇంతకాలం పేషంట్ చేరిన 96 గంటల్లో డిశ్చార్జి చేయాలన్న నిబంధనను కూడా పక్కన పెట్టేశారు.

అమెరికాలో కరోనా కారణంగా ఇప్పటివరకూ 48 మంది చనిపోతే.. తాజాగా ఏడుగురు చనిపోయారు.తాజాగా విధించిన ఆరోగ్య అత్యవసర పరిస్థితి నేపథ్యంలో.. ఆరోగ్య శాఖకు ప్రత్యేక అధికారాలు ఇవ్వనున్నారు. కరోనా మీద యుద్ధం చేసేందుకు రాష్ట్రాలకు 50 బిలియన్ డాలర్లను కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తాజాగా విడుదల చేస్తున్న నిధులతో ప్రత్యేక చికిత్సలు చేయొచ్చని వెల్లడించారు. ఏమైనా.. అగ్రరాజ్యంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించటం చూస్తే.. కరోనా దెబ్బకు ఎవరైనా భయంతో వణకటమే తప్పించి.. మరెలాంటి మినహాయింపులు ఉండవన్న వైనం ఇట్టే అర్థం కాక మానదు.