Begin typing your search above and press return to search.

తమిళ పాలిటిక్సు చేయబోనన్న ట్రంప్

By:  Tupaki Desk   |   23 Nov 2016 5:55 AM GMT
తమిళ పాలిటిక్సు చేయబోనన్న ట్రంప్
X
తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాల్లో పగ - ప్రతీకారాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుంటాయి. అధికారంలోకి వచ్చిన వారు తమ ప్రత్యర్థులను జైలుకు పంపించేందుకు నిత్యం ప్రయత్నిస్తుంటారు. కరుణానిధి జయలలితను... జయలలిత కరుణానిధిని... మళ్లీ కరుణానిధి జయలలితను.. ఇలా పలుమార్లు ఒకరినొకరు జైలుకు పంపించి తమ కసి తీర్చుకున్నారు. పలు ఇతర రాష్ట్రాల్లోనూ ఈ తరహా రాజకీయాలు కనిపిస్తుంటాయి. ప్రత్యర్థులపై కేసులు పెట్టి ఉక్కిరిబిక్కిరి చేయడం సాధారణమే. అయితే... అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ మాత్రం తాను ఆ తరహా ప్రతీకార రాజకీయాలు చేయబోనని చెప్పేశారు. ఎన్నికల ముందు ఆయన తన ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ ను జైలుకు పంపిస్తానని చెప్పినా కూడా ఇప్పుడు మాత్రం ఆ విషయంలో కరుణ చూపించారు.

తాను అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే - డెమోక్రాట్ల అభ్యర్థిని హిల్లరీ క్లింటన్ ను జైలుకు పంపిస్తానని ఎన్నికల ముందు ట్రంప్ చెప్పిన సంగతి గుర్తుండే ఉంటుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఆమెను జైలుకు పంపించబోనని అభయం ఇచ్చారు. ఈ విషయాన్ని ట్రంప్ ఎన్నికల ప్రచార బాధ్యతలు నిర్వహించిన కెల్యాన్నే కాన్వే వెల్లడించారు. ఈ-మెయిల్స్ కేసులో ఆమెను జైలుకు పంపుతానని ట్రంప్ అప్పట్లో అన్నారు. కానీ, ఇప్పుడాయన మనసు మార్చుకున్నారు. ఓటమితో కుంగిపోతున్న హిల్లరీ త్వరగా కోలుకునేందుకు సాయం చేయాలని ట్రంప్ అనుకుంటున్నారని సమాచారం.

కాగా మోడీ ప్రధాని అయిన తరువాత కూడా కాంగ్రెస్ పెద్దలంతా చాలా భయపడ్డారు. పాత కేసులన్నీ తిరగదోడి మోడీ తమను ముప్పతిప్పలు పెడతారాని ఆందోళన చెందారు కానీ.. ఆయన మాత్రం ఎవరినీ జైలుకు పంపించే ఆలోచన చేయకుండా జనాన్ని బ్యాంకులు, ఏటీఎంలకు పంపిస్తున్నారు. ట్రంపు కూడా ఇప్పుడు అలాంటి బుద్ధిమంతుడే అయిపోతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/