Begin typing your search above and press return to search.

పావుగంటలో 7 లక్షల కోట్లు హారతి

By:  Tupaki Desk   |   9 Nov 2016 6:46 AM GMT
పావుగంటలో 7 లక్షల కోట్లు హారతి
X
అంతర్జాతీయ పరిణామాల ప్రభావం భారత స్టాక్‌ మార్కెట్లపై పడటంతో సెన్సెక్స్‌, నిఫ్టీలు మహాపతనాన్ని నమోదుచేశాయనే చెప్పాలి. ఒకవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్‌ ఆధిక్యం, మరోవైపు బ్లాక్‌ మనీ నివారణ కోసం ఆర్బీఐ తాజా నిర్ణయం స్టాక్‌ మార్కెట్లపై ప్రభావాన్ని చూపాయి. సెన్సెక్స్‌ ప్రారంభమైన కొద్ది సమయానికే 1000 పాయింట్లకు పైగా నష్టం చవిచూసింది. ఒకదశలో గరిష్ఠంగా 1500 పాయింట్ల నష్టంతో 26600 మార్కును తాకింది. అంతర్జాతీయ మార్కెట్లు భారీ నష్టాలబాటలో పయనిస్తున్నాయి. ఆసియా మార్కెట్లు కూడా విపరీతమైన నష్టాల్లో ట్రేడింగ్‌ అవుతున్నాయి.

తాజా ఫలితాల్లో ట్రంప్‌ ఉన్నట్టుండి ముందంజ వేయడంతో విశ్లేషకులు అంచనాలకనుగుణంగానే ప్రపంచ స్టాక్‌ మార్కెట్లలో భారీ సునామీ చెలరేగింది. బ్రెగ్జిట్ ను మించిన ఆందోళన మదుపర్లను పట్టి కుదిపేసింది. ఈమేరకు దలాల్ స్ట్రీట్ లో "వెడ్నెస్ డే బ్లడ్ బాత్" గా నిపుణులు విశ్లేషించారు. 2008లో లీమన్ బ్రదర్స్ దివాలా ఉదంతం సమయంలో కూడా ఈ స్థాయిలో మార్కెట్ పతనం కాలేదని నిపుణులు చెబుతుండగా... సెన్సెక్స్‌ ఏకంగా 1500 పాయింట్లు, ఎన్‌.ఎస్‌.ఈ ప్రధాన సూచీ నిఫ్టీ 500 పాయింట్ల నష్టంతో రికార్డు స్థాయి పతనాన్ని నమోదుచేసింది.

ఈ విషయంలో అమెరికా 45వ ప్రెసిడెంట్ గా ఎవరు గెలవనున్నారన్న ఉత్కంఠతో మార్కెట్ లో కేవలం 15 నిమిషాల్లోనే 7 లక్షల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి. ఈ అనూహ్య పరిణామాలుతో డాలర్ ఢమాల్ అంది. దీంతో దేశీయ కరెన్సీ రూపాయి నఫ్టంతో 66.83 వద్ద ఉండగా పసిడి మాత్రం ప్రస్తుతం రూ. 31,174 వద్ద ఉండి దూసుకుపోతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/