Begin typing your search above and press return to search.

ట్రంప్ తో ప్రపంచానికి ఏమవుతుంది..?

By:  Tupaki Desk   |   9 Nov 2016 5:30 PM GMT
ట్రంప్ తో ప్రపంచానికి ఏమవుతుంది..?
X
అసలే ట్రంప్. ఆ పైన అధికారం చేతికి వస్తే..? వినేందుకే వణికిపోయే ఈ మాట ఇప్పుడు నిజమై కూర్చుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికైతే మాత్రం ఈ ప్రపంచానికి వచ్చేదేంది? మరీ ఓవరాక్షన్ కాకపోతే.. అదేదో మన పంచాయితీ ఎన్నికలన్నట్లుగా ఫీలైపోయి.. ఎవరికి వారు ట్రంప్ తో తమకు ఆజన్మ శత్రుత్వం ఉన్నట్లుగా ఫీలై.. ఏది ఏమైనా ట్రంప్ మాత్రం గెలవకూడదంటే గెలవకూడదని ఫీలైనోళ్లు దేశంలో కోట్లాది మంది ఉన్నారు.

ఆ మాటకు వస్తే.. ప్రపంచంలోని పలు దేశాల్లో ఇలాంటి పరిస్థితే. ఎక్కడో అమెరికాలో.. ఆ దేశానికి అధ్యక్ష పదవికి ఎన్నికలు జరిగితే ప్రపంచంలోని దేశాల ప్రజలంతా అంతా ఫీలైపోవటానికి కారణం ఏమిటన్న ప్రశ్న కూడా ఉంది. ఎందుకింతలా ఉలికిపాటు అంటే.. అమెరికా ఏమీ ఆషామాషీ దేశం కాదు. ఆ దేశానికి అధ్యక్షుడు కావటం అంటే.. ప్రపంచానికే బిగ్ బాస్ అయిపోయినట్లు. మరి.. ప్రపంచానికే బాస్ అయ్యే వ్యక్తి ఎలా ఉండాలి? అన్న ప్రశ్న వేసుకుంటేనే అసలు సమస్యంతా.

కేవలం వ్యాపారం.. తన వ్యాపార ప్రయోజనాలు.. తన లాభాలు.. వాటి సాధనలో భాగంగా పన్నులు ఎగ్గొట్టేందుకు సైతం వెనుకాడని ట్రంప్ లాంటి వ్యక్తి అమెరికా దేశానికి అధ్యక్షుడైపోయి.. ఆ దేశాన్ని.. అదే సమయంలో ప్రపంచాన్ని ఏలేద్దామని ఫిక్స్ అయితే.. సగటు జీవి ఫీల్ కాకుండా పోతాడా? నీ లాంటి బ్రహ్మ రాక్షసి ఈ భూ ప్రపంచంలోనే ఉండదన్న మాటను తన ప్రత్యర్థి అయిన మహిళపై అనేసే తెంపరితనం ట్రంప్ కు మాత్రమే ఉంటుంది. తనను వ్యతిరేకించే వారి విషయంలో నిప్పులు కురిపించే ఆయన.. అమెరికా అధ్యక్షుడిగా ఎలా వ్యవహరిస్తారన్నది కోటి రూకల ప్రశ్నగా మారింది.

తన దేశ ప్రయోజనాలు తప్పించి మరేమీ ముఖ్యం కాదని తేల్చేసి ట్రంప్ మాటల్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ.. ఆ మాటలు చెప్పే టోన్ తోనే ఇబ్బంది అంతా. అవసరం ఉన్నా.. లేకున్నా విద్వేషాన్ని కురిపించేయటం.. ఆవేశంతో నోరు జారటం లాంటి చాలా అవలక్షణాలు ట్రంప్ ట్రేడ్ మార్కులు. పేచీ పెట్టుకోనోడు పాపాత్ముడన్నట్లుగా ప్రతిఒక్కరితో గిల్లికజ్జాలు పెట్టుకునేలా వ్యవహరిస్తూ.. అందరిపై తన మాటలతో మీద పడిపోయే ట్రంప్ లాంటి వ్యక్తి ఈ రోజు ఎవరు అవునన్నా.. కాదన్నా ప్రపంచానికి పెద్దన్న. ఆయన చెప్పిందే వేదం. ఆయన పంది అంటే పంది.. నంది అంటే నంది. ఒకవేళ ఆయన మాటను కాదన్నా.. ఆయనతీసుకునే నిర్ణయాల ప్రభావానికి ప్రపంచం మాత్రం పడక తప్పని పరిస్థితి. మరి.. ఇళాంటి వేళ.. ట్రంప్ ఎలా వ్యవహరిస్తారన్నదే అసలు ప్రశ్న. ఇప్పటివరకూ తెలిసిన ట్రంప్ మాదిరే అమెరికా అధ్యక్ష పదవిలోనూ వ్యవహరిస్తే ప్రపంచంలో ఉపద్రవాలన్నీ క్యూ కట్టినట్లే. ఒకవేళ.. అందుకు భిన్నంగా వ్యవహరించి.. కొత్త బాధ్యత వచ్చే వరకే తెంపరితనం కానీ.. నమ్మి బాధ్యత ఇచ్చిన తర్వాత జాగ్రత్తగా ఉంటానన్నట్లుగా వ్యవహరిస్తే మాత్రం ప్రపంచ ప్రజలు కాస్తంత ప్రశాతంతంగా ఉంటారనటంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని చెప్పాలి. మరి.. ఎలా ఉండనుందన్నది కాలం మాత్రమే చక్కగా సమాధానం చెప్పనుంది. వెయిట్ చేయటానికి మించి చేయగలిగిందేమీ లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/