Begin typing your search above and press return to search.

ట్రంప్ కొత్త ర‌చ్చ అమెరిక‌న్ల అయోమ‌యం

By:  Tupaki Desk   |   11 Jun 2017 7:29 AM GMT
ట్రంప్ కొత్త ర‌చ్చ అమెరిక‌న్ల అయోమ‌యం
X
అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణ‌యాలు అంటేనే ప‌లు దేశాధినేత‌ల్లో హ‌డ‌ల్ మొద‌లవుతోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా నిర్ణ‌యాల‌ను తీవ్రంగా వ్యతిరేకించే ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌...ఒబామా ప్రతీ నిర్ణయాన్ని సమీక్షించటమే ప్రధాన ఉద్దేశంగా పెట్టుకున్నార‌ని అంటున్నారు. ఇరాన్‌ అణు ఒప్పందం - పారిస్‌ పర్యావరణ ఒప్పందం, క్యూబాతో సంబంధాల పునరుద్ధరణ...వీటన్నింటినీ తన పాలనలో జరిగిన గొప్ప చారిత్రక ఘట్టాలుగా ఒబామా ప్ర‌క‌టించుకున్నారు. ఒబామా మొద‌టి రెండు విధానాల‌ను విజ‌య‌వంతంగా తిర‌గ‌దోడిన ట్రంప్ తాజాగా క్యూబాపై క‌న్నువేశార‌ట‌. 'క్యూబాపై కొత్త విధానాన్ని' రూపకల్పన చేయటంలో ప్రస్తుతం ట్రంప్‌ సలహాదారుల బృందం తలమునకలై ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.ఇరు దేశాల సంబంధాలపై సమీక్ష జరపాలని ఆ బృందం ఇప్పటికే తేల్చిందని, ఆ ప్రతిపాదనల్ని జాతీయ భద్రతా సంస్థ (ఎన్‌ ఎస్‌ ఏ)కు కూడా పంపారని 'రాయటర్స్‌' - 'సీఎన్‌న్‌' వార్తా కథనాల్ని రాసింది.

వచ్చే శుక్రవారం డొనాల్డ్‌ ట్రంప్‌ మియామీలో పర్యటించబోతున్నారని, ఈ సందర్భంగా క్యూబాపై విధానపరమైన ప్రకటన చేస్తారని వార్తలు వెలువడుతున్నాయి. వాణిజ్యం - రవాణా - ఎగుమతి - దిగుమతి...మొదలైనవాటిలో మరిన్ని కఠినమైన నిబంధనల్ని తీసుకురావాలని ట్రంప్‌ ఆలోచిస్తున్నారట. దీనికి సంబంధించి ట్రంప్‌ సహాయక బృందం విధివిధానాల్ని రూపొందించే పనుల్లో ఉన్నారని తెలిసింది. ఉన్నపళంగా క్యూబాతో సంబంధాల్ని తెగతెంపులు చేసుకునే నిర్ణయాన్ని ట్రంప్‌ తీసుకోకపోవచ్చు. కాకపోతే ట్రంప్‌ మనసులో మాత్రం క్యూబా పట్ల వ్యతిరేక భావంతోనే ఉన్నారన్నది బహిరంగ రహస్యమే. పూర్తిగా కాకపోయినా...పాక్షికంగానైనా పాత విధానాన్ని ట్రంప్‌ మారుస్తాడనే మాటలు వెలువడుతున్నాయి. మిగ‌తా దేశాల కంటే అమెరికా-క్యూబా సంబంధాల పునరుద్ధరణకు ఎన్నో శతాబ్ధాలు - సంవత్సరాలు పట్టింది. ఇరు దేశాల మధ్య ఇప్పుడిప్పుడే సాధారణ సంబంధాలు ఏర్పడుతున్న తరుణంలో...ట్రంప్‌ ఏం చేస్తాడో ? అని అమెరికా ఉన్నతస్థాయి అధికారుల్లో గుబులు కూడా నెలకొందని వార్త‌లు వ‌స్తున్నాయి.

ముఖ్యంగా అమెరికా-క్యూబా వాణిజ్య సంబంధాలపై ట్రంప్‌ దృష్టిపెట్టారు. క్యూబా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు, అమెరికా కంపెనీలకు మధ్య వర్తక - వ్యాపార సంబంధాలు ప్రస్తుతం ఉన్నాయి. నిబంధనల్ని కఠినతరం చేసి వీటిని దెబ్బతీయాలని ట్రంప్‌ ఆలోచిస్తున్నారు. దీనికోసం అమెరికా కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున లాబీయింగ్‌ జరుగుతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాల పునరుద్ధరణ జరిగాక అమెరికన్లు పెద్ద సంఖ్యలో క్యూబాలో పర్యటిస్తున్నారు. అయితే క్యూబా వెళ్తున్నవారిపై ట్రంప్‌ సర్కార్‌ అనుమానాల్ని ఏర్పరుచుకుంది. క్యూబాలోని కమ్యూనిస్టులను కలుసుకొని చర్చలు సాగించటాన్ని సహించలేకపోతున్నది. ఇరు దేశాల పౌరుల రాకపోకలపై నిబంధనల్ని కఠినతరం చేయాలని ట్రంప్‌ సర్కార్‌ భావిస్తున్నది. నూతన విధానానికి సంబంధించి ప్రతిపాదనలు దాదాపు సిద్ధమైయ్యాయని శ్వేతసౌధం ఉన్నతాధికారి ఒకరు ఆ దేశ మీడియాకు తెలిపారు. కాగా, క్యూబాతో సంబంధాల పునరుద్ధరణకు ఎన్నో శతాబ్ధాలు పట్టింది. ఎంతో మంది ఉన్నతాధికారుల కృషి దీని వెనుక దాగి ఉన్నదని, ఇప్పుడు దీనిని దెబ్బతీసేలా వ్యవహరిస్తే నష్టం మనకే ఎక్కువ అని కొంతమంది ట్రంప్‌ సలహాదారులు హెచ్చరించారు. క్యూబాతో వాణిజ్యంపై నిబంధనల్ని కఠినతరం చేస్తే...అమెరికా కంపెనీలకు నష్టం వాటిల్లుతుందని, పర్యాటకం, పౌర విమానయానం, ఎగుమతి, దిగుమతి, సాంస్కృతిక కళలు, క్రీడారంగాల్లో ఎంతోమంది ఉద్యోగాలు కోల్పోతారని వారు తెలుపుతున్నారు. ముఖ్యంగా ఎయిర్‌లైన్స్‌, ట్రావెల్‌ ఇండస్టీ ప్రముఖులు క్యూబాతో సంబంధాల్ని కోరుకుంటున్నారు. క్యూబాపై మళ్లీ ఆంక్షల్ని విధించటం, నిబంధనల్ని కఠితరం చేస్తే...అది మంచి రాజకీయం కాదని, అమెరికా వాణిజ్యంకు చెడు చేస్తుందని వారు భావిస్తున్నారు. మొత్తంగా ఇన్నాళ్లు త‌న నిర్ణ‌యాల‌తో పొరుగుదేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేసిన ట్రంప్ ఇప్పుడు దేశీయంగా ఉన్న వ్యాపార‌వేత్త‌ల‌ను సైతం వ‌ణికించేస్తున్నాడ‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/