Begin typing your search above and press return to search.

ట్రంప్ తాకరాని చోట్ల తాకారంటున్న మహిళలు!

By:  Tupaki Desk   |   13 Oct 2016 6:22 AM GMT
ట్రంప్ తాకరాని చోట్ల తాకారంటున్న మహిళలు!
X
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ కు సంబందించిన మరో కంపు పని తాజాగా వెలుగుచూసింది. మహిళల విషయంలో ట్రంప్ ప్రవర్తన పై ఇప్పటికే హిల్లరీ క్లింటన్ తో పాటు పత్రికా - మీడియా మొత్తం ఏకిపారేస్తున్న తరుణంలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ విషయం మరింత సంచలనం రేపుతోంది. ఈ తాజా విషయం ఏమిటంటే... ట్రంప్ గతంలో తమను అసభ్యంగా తాకారని ముగ్గరు మహిళలు ఆరోపించారు. తనను పెదవుల మీద బలవంతంగా ముద్దుపెట్టుకున్నారని వారిలో ఒకరు చెప్పగా, చెప్పుకోలేని చోట తాకారని మరొకరు అన్నారు. తనను వెనక భాగంలో అసభ్యంగా నొక్కారని మూడో మహిళ తెలిపింది. ఈ విషయాలను పొందుపరిస్తూ న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది.

వీరిలో జెస్సికా లీడ్స్(74) అనే వ్యాపారవేత్త... దాదాపు మూడు దశాబ్దాల క్రితం తాను - ట్రంప్ పక్కపక్క సీట్లలో విమానంలో ప్రయాణించినప్పుడు విమానం టేకాఫ్ తీసుకున్న 45 నిమిషాల తర్వాత ట్రంప్ తమ రెండు సీట్ల మధ్య చెయ్యిపెట్టుకోడానికి ఉన్న ఆర్మ్ రెస్ట్‌ ను తీసేసి తనను చాలా అసభ్యంగా తాకడం మొదలుపెట్టారని చెబుతుంది. అదే సమయంలో తన స్కర్టు మీద కూడా ట్రంప్ చెయ్యి వేశారని, దీంతో తాను వేరే సీటులోకి మారిపోయానని చెప్పారు. కాగా అప్పటికి తన వయసు 38 ఏళ్లంట.

ఇక రెండో మహిళ రచెల్ క్రూక్స్ (22)... 2005లో ట్రంప్ టవర్‌ లోని ఒక రియల్ ఎస్టేట్‌ కంపెనీలో రిసెప్షనిస్టుగా పనిచేసేవారట. అయితే ఒకరోజు ఉదయం లిఫ్టులో ట్రంప్ తనను కలిశారని, ఆయనకు తనను తాను పరిచయం చేసుకుని షేక్‌ హ్యాండ్ ఇవ్వగా.. దగ్గరకు వచ్చిన ట్రంప్ ముందు బుగ్గల మీద - అనంతరం పెదాల మీద బలవంతంగా ముద్దుపెట్టుకున్నారని చెబుతున్నారు. అది అక్కడితో అయిపోలేదని... కొన్నాళ్ల తర్వాత మళ్లీ తన వద్దకు వచ్చి ఫోన్ నెంబరు అడిగారన్నారు. ఎందుకు అని అడగ్గా... తన మోడలింగ్ ఏజెన్సీకి పంపుతానని చెప్పారని ఆమె అంటున్నారు. తన వద్ద పనిచేసే మహిళ - తనను ఏమీ చేయలేదనే భావించి ఆయనలా చేసి ఉంటారని రచెల్ క్రూక్స్ చెబుతున్నారు.

ఇదే క్రమంలో ట్రంప్ పై ఆరోపణలు చేసిన మూడో మహిళ మిండీ మెకగ్ గిల్లివ్రే (36)... 13 ఏళ్ల క్రితం ఒక రిసార్టులో తన పృష్టభాగంలో ట్రంప్ తనను అసభ్యంగా నొక్కారని ఆరోపించారు. అప్పట్లో తాను ఒక ఈవెంటు ఫొటోగ్రాఫర్‌ తో కలిసి అక్కడికి వెళ్లినప్పుడు వెనక భాగంలో ఏదో ఇబ్బందిగా అనిపిస్తే తొలుత కెమెరా బ్యాగ్ తగిలిందేమోలే అనుకున్నానని, కానీ వెనక్కి తిరిగి చూస్తే ట్రంప్ ఉన్నాడని, అది చూసి తాను దిగ్భ్రాంతి చెందానని చెప్పారు

అయితే, ఈ విషయాలను ఖండించిన ట్రంప్... న్యూయార్క్ టైమ్స్ పత్రిక మీద పరువునష్టం దావా వేయాలని నిర్ణయించుకున్నారు. కథనం మొత్తం అవాస్తవమని, ఆ పత్రిక తప్పుడు ప్రచారం చేస్తోందని ట్రంప్ సీనియర్ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ జాసన్ మిల్లర్ మండిపడ్డగా - మహిళల ఆరోపణల గురించి తాము ప్రశ్నించిప్పుడు ట్రంప్ ఆవేశపడ్డారు తప్ప - స్పందించలేదని సదరు పత్రిక ప్రతినిధులు చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/