Begin typing your search above and press return to search.

పాక్ మీద క‌స్సుమంటున్న ట్రంప్‌

By:  Tupaki Desk   |   30 Dec 2017 10:30 AM GMT
పాక్ మీద క‌స్సుమంటున్న ట్రంప్‌
X
దాయాది పాక్ ఆట‌లు ఆగ్ర‌రాజ్య‌మైన అమెరికా ముందు అస్స‌లు సాగ‌టం లేద‌ట‌. త‌న దుష్ట‌బుద్దితో ఎప్ప‌టిక‌ప్పుడు.. తాత్కాలిక ప్ర‌యోజ‌నాల్ని చూపించి ఎప్ప‌టిక‌ప్పుడు అగ్ర‌రాజ్యం ద‌గ్గ‌ర ల‌బ్థి పొందే పాక్ ఆట‌లు.. అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ ముందు అస్స‌లు సాగ‌టం లేద‌ట‌. పాక్ తీరుపై ట్రంప్ తీవ్ర ఆగ్ర‌హంతో.. అసంతృప్తితో ఉన్నార‌ట‌.

అంత‌ర్గ‌త స‌మావేశాల్లో పాక్ తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నార‌ట‌. వైట్ హౌస్ అదికారుల స‌మావేశాల్లో పాక్ తీరుపై త‌న‌కున్న అసంతృప్తిని అస్స‌లు దాచుకోవ‌టం లేద‌ట‌. ఉగ్ర‌వాదం విష‌యంలో పాక్ అనుస‌రిస్తున్న విధానాల‌పై గుర్రుగా ఉన్న ట్రంప్‌.. ఆ దేశం నుంచి స్ప‌ష్ట‌మైన హామీ ఇచ్చే వ‌ర‌కూ పాక్ భ‌ద్ర‌త కోసం.. ఉగ్ర‌వాదుల దాడుల నుంచి త‌మ‌ను తాము రక్షించుకోవ‌టం అమెరికా నుంచి తీసుకుంటున్న 255 మిలియ‌న్ డాల‌ర్ల మొత్తాన్ని నిలిపివేయాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఉగ్ర‌వాద నిర్మూల‌న కోసం పాక్ ప్ర‌య‌త్నాలు స‌రిగా లేవ‌న్న ఆలోచ‌న‌లో ఉన్న ట్రంప్‌.. పాక్ కు ఇచ్చే సాయాన్ని కొన్నిరోజుల‌పాటు నిలిపివేస్తే ఎలా ఉంటుంద‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. 2002 నుంచి తాము పాక్ కు సాయం చేస్తున్నా.. ఎలాంటి ప్ర‌యోజ‌నం క‌నిపించ‌టం లేద‌న్న భావ‌న‌లో ట్రంప్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ పాక్ కు భ‌ద్ర‌త కోసం అమెరికా వెచ్చించిన సాయం సుమారు 33 బిలియ‌న్ డాల‌ర్లు ఉంటుంద‌ని తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో.. ఇప్పుడు అందివ్వాల్సిన సాయాన్ని కొన్నిరోజుల పాటు నిలిపివేస్తే.. ఇస్లామాబాద్ ఏ విధంగా స్పందిస్తుందో చూద్దామ‌న్న మాట ట్రంప్ నోటి నుంచి వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. సాయం ఇవ్వ‌కూడ‌ద‌న్న ఆలోచ‌న‌లో ట్రంప్ ఉన్నార‌ని.. అయితే.. దీని ప‌రిణామాలు ఎలా ఉంటాయ‌ని వైట్ హౌస్ అధికారులు మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్లుగా తెలుస్తోంది.