Begin typing your search above and press return to search.

ఇక.. కామెడీ చేస్తే తాట తీయటమేనంటున్న ట్రంప్

By:  Tupaki Desk   |   21 Nov 2016 7:52 AM GMT
ఇక.. కామెడీ చేస్తే తాట తీయటమేనంటున్న ట్రంప్
X
మొండివాడు రాజు అయితే ఎలా ఉంటుంది? రాజరికంలో మగ్గే వారికి ఇలాంటివి తెలుస్తాయి కానీ.. ప్రజాస్వామ్య దేశాల్లో మృదుస్వభావులుగా ఉండే పాలకుల పాలనలో ఉన్న దేశ ప్రజలకు ఆ ఇబ్బందులు పెద్దగా తెలీవనే చెప్పాలి. ఒకవేళ మృదుస్వభావం లేకున్నా.. జనం కోసం అలా నటించే పాలకులున్న దేశాల్లోని ప్రజలకు కరకుదనం టేస్ట్ పెద్దగా తెలీదనే చెప్పాలి. జనాగ్రహం భయపెడుతూ ఉంటుంది. లేనిపోని తిప్పలు ఎందుకులే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు.

కానీ.. ట్రంప్ లాంటి మొండి ఘటాలకు.. తాను చెప్పిందే వేదం.. తాను అభిమానించే అందలం.. తేడా వస్తే పాతాళం అన్నట్లుగా ఉంటే వారి చేతికి అధికారం చేతికి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయన్న విషయానికి సంబంధించిన ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. తన ఎన్నికల ప్రచారంలో మీడియాలో షోలో పాల్గొన్న ట్రంప్ ను.. సదరు యాంకర్ చివర్లో ఒక కోరిక కోరేశారు. ఆయన జుట్టును చెరిపివేసే అవకాశం ఇవ్వాలని.. ఒకవేళ ఆయన కానీ అమెరికా అధ్యక్షుడిగా అయితే.. తాను అడగలేనని.. తన కోరిక తీరుస్తారా? అని చిలిపిగా అడిగితే.. ఓకే.. అనేసిన ట్రంప్ ను చూసిన వారు.. ఆయనలోని మరో కోణాన్ని చూసి ఆశ్చర్యపోయారు.

అయితే.. అలాంటివి పవర్ లోకి వచ్చే వరకే అన్న విషయాన్ని ట్రంప్ తన తాజా ట్వీట్స్ తో తేల్చేశారు. మనతో పోలిస్తే.. అమెరికా టీవీల్లో కామెడీ షోల్లో హాస్యం కాస్తంత ఎక్కువే. పలు ఛానళ్లు పాలకులపై మోతాదు మించిన హాస్యంతో షోలు నడిపిస్తుంటారు. అలాంటి షోలలో బాగా పాపులర్ అయిన కామెడీ షో.. ‘‘సాటర్ డే నైట్ లైవ్’’ పై తాజాగా ట్రంప్ ఫైర్ అయ్యారు.

ఈ షోలో కామెడీ అన్నది ఏమీ లేదని తేల్చేశారు. ఈ షో అంతా ఏకపక్షంగా.. హాస్యానికి దూరంగా ఉందని తేల్చేశారు. అమెరికా అధ్యక్షుడితో పాటు.. రాజకీయ నేతల్ని ఎగతాళి చేస్తూ.. సటైర్లు వేస్తూ షోలు నడిపించే సంప్రదాయం ఇకపై ఉండదన్న విషయాన్ని తన తాజా ట్వీట్ తో చెప్పకనే చెప్పేశారు. ఏకపక్షంగా.. పక్షపాతపూరితంగా షోలు ఉన్నాయన్న ఆయన.. సాటర్ డే నైట్ లైవ్ లోని కొన్ని భాగాల్ని తాను చూశానని.. అందులో హాస్యం ఏమీ లేదని తేల్చేశారు.ట్రంప్ నుంచి ఈ తరహా ట్వీట్ రావటంతో హాలీవుడ్ స్టార్ బాల్డ్ విన్ కాస్తంత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. మీరు అధ్యక్షులువారిగా ఉండటానికి ప్రయత్నించండి.. జనాలు చెప్పేది చెబుతారంటూ వ్యాఖ్యానించారు. అధికారం చేపట్టక ముందే.. తన ఇష్టాయిష్టాల్ని.. అభిరుచుల్ని ట్వీట్ ద్వారా చెప్పటం చూస్తుంటే.. ట్రంప్ చాలా వ్యూహాత్మకంగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు లేదు..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/