Begin typing your search above and press return to search.

వైట్ హౌస్‌ లో ట్రంప్ మొద‌టిరోజు ఏం చేస్తారంటే

By:  Tupaki Desk   |   8 Sep 2016 9:21 AM GMT
వైట్ హౌస్‌ లో ట్రంప్ మొద‌టిరోజు ఏం చేస్తారంటే
X
అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న రిప‌బ్లిక‌న్ పార్టీ అభ్య‌ర్థి డొనాల్డ్ ట్రంప్ మాంచి జోరు మీదున్నారు. ఇన్నాళ్లు త‌న కామెంట్ల‌తో వార్త‌ల్లో నిలిచిన ట్రంప్ ఇపుడు అధ్య‌క్ష పీఠంపై త‌నకున్న క‌ళ‌ల ద్వారా మీడియా దృష్టిని ఆక‌ర్షించారు. నార్త్ క‌రోలినాలో భారీ ర్యాలీ నిర్వ‌హించిన సంద‌ర్భంగా ట్రంప్ అక్క‌డికి విచ్చేసిన వారిని ఉద్దేశించి ప్ర‌సంగిస్తూ డెమోక్ర‌టిక్ సిద్ధాంతాల‌ను త‌ప్పుపడుతూ ప్ర‌స్తుత అధ్య‌క్షుడు ఒబామా తీరును ఎండ‌గ‌ట్టారు. త‌ను అధ్య‌క్షుడిగా ఎన్నిక‌యిన త‌ర్వాత మొద‌టి రోజు వైట్ హౌస్‌ లో ఏ విధంగా వ్య‌వ‌హ‌రిస్తానో కూడా ప్ర‌క‌టించేశారు.

తాను అధ్య‌క్షుడిగా ఎన్నికైతే ఓవ‌ల్ ఆపీసులో మొద‌టి రోజును బిజీగా గ‌డుపుతాన‌ని ప్ర‌క‌టించారు. సిరియా శ‌ర‌ణార్దుల విష‌యంలో క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తాన‌ని, ఒబామా ఆధ్వ‌ర్యంలో తీసుకున్న నిర్ణ‌యాల‌ను ప‌క్క‌న పెట్టేయ‌డం కాకుండా వాటిని కొన‌సాగించ‌కుండా చ‌ట్టం చేస్తానని ట్రంప్ వెల్ల‌డించారు. అమెరికా ద‌క్షిణ తీరం చుట్టూ గోడ కట్టాల‌ని గ‌తంలో చేసిన ప్ర‌క‌ట‌న నుంచి కూడా ఏమాత్రం వెన‌క్కు త‌గ్గ‌న‌ని పున‌రుద్ఘాటించారు. ట్రంప్ అంత‌టితో ఆగిపోలేదు. వివిధ దేశాల నుంచి సాగుతున్న అక్ర‌మ వ‌ల‌స‌ల గురించి కూడా తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేశారు. అంతేకాకుండా అమెరికాపై ప్రేమ చాటుకుంటూ ఇత‌ర దేశాల‌తో అమెరికాకు చెందిన కంపెనీలు కుదుర్చుకున్న ఒప్పందాల‌న్నింటినీ పునఃస‌మీక్షించ‌నున్న‌ట్లు ట్రంప్‌ ప్ర‌క‌టించారు. త‌ద్వారా ఆయా ఒప్పందాల‌తో ఇత‌ర దేశాల‌కు లాభం చేకూర‌డాన్ని త‌గ్గించి అమెరిక‌న్ల‌కే పెద్ద ఎత్తున ఉద్యోగాలు ద‌క్కేలా చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అంతేకాకుండా డెమెక్ర‌టిక్ పార్టీ అభ్య‌ర్థి అయిన హిల్ల‌రి క్లింట‌న్ తీరును త‌ప్పుప‌ట్టారు. వ‌ర‌ల్డ్ ట్రేడ్ ఆర్గ‌నైజేష‌న్‌ లోకి చైనా రాక‌కు ఆమె మ‌ద్ద‌తివ్వ‌డం స‌రికాద‌ని చెప్పారు.