Begin typing your search above and press return to search.

ఇండియా దెబ్బ‌కు ట్రంప్ దిమ్మ‌తిరిగిపోయింది

By:  Tupaki Desk   |   23 July 2019 10:08 AM GMT
ఇండియా దెబ్బ‌కు ట్రంప్ దిమ్మ‌తిరిగిపోయింది
X
భార‌త‌దేశం విష‌యంలో ఊరికే నోరు జారితే ఏం జ‌రుగుతుందో...అగ్ర‌రాజ్యం అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు ఆల‌స్యంగా తెలిసివ‌చ్చింది. కీల‌క‌మైన క‌శ్మీర్ విష‌యంలో నోరు జారిన అనంత‌రం దాన్నిస‌రిదిద్దుకునేందుకు ఆయ‌న అష్ట‌క‌ష్టాలు ప‌డుతున్న తీరే, దీనికి నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. పాక్ ప్రధానిగా ఎన్నికైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ తొలిసారి అమెరికా పర్యటనకు వెళ్లారు. వైట్‌ హౌస్‌ లో సోమవారం ట్రంప్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. మధ్యవర్తిత్వం వహించడాన్ని నేను ప్రేమిస్తా.. ఒకవేళ అవసరమైతే క‌శ్మీర్ స‌మ‌స్య‌పై నేను సాయపడుతా అని అన్నారు. క‌శ్మీర్ స‌మ‌స్య గురించి మోదీ త‌న‌తో మాట్లాడార‌ని, మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హిస్తే బాగుంటుంద‌ని కోరార‌ని ట్రంప్ అన్న‌ట్లుగా కూడా ప్ర‌చారం జ‌ర‌గ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఏకంగా లోక్‌ స‌భ‌లో కూడా చ‌ర్చ జ‌రిగింది. అయితే, వెంట‌నే అమెరికా తోక‌ముడిచింది.

ట్రంప్‌ తో భేటీ అనంత‌రం పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ, వివాదాస్ప‌ద క‌శ్మీర్ స‌మ‌స్య‌పై మ‌ధ్య‌వ‌ర్తిత్వం వ‌హించేందుకు సిద్ధంగా ఉన్నాన‌ని అమెరికా అధ్య‌క్షుడు చేసిన వ్యాఖ్య‌ల‌ను స్వాగ‌తించారు. క‌శ్మీర్ స‌మ‌స్యను ద్వైపాక్షికంగా ప‌రిష్క‌రించుకోలేమ‌ని అన్నారు. స్వాతంత్య్రం వ‌చ్చి 70 ఏళ్లు అవుతున్నా...క‌శ్మీర్ స‌మ‌స్య వ‌ల్ల నిజ‌మైన నాగ‌రికులుగా ఉండ‌లేక‌పోతున్నామ‌న్నారు. క‌శ్మీర్ స‌మ‌స్య‌పై ఓ సంద‌ర్భంలో జ‌న‌ర‌ల్ ప‌ర్వేజ్ ముష్ర‌ర‌ఫ్‌, ప్ర‌ధాని వాజ్‌పేయి తీర్మానం చేసేందుకు అంగీక‌రించార‌ని, కానీ ఆ త‌ర్వాత రెండు దేశాలు దూరం దూరంగా ఉన్నాయ‌ని ఇమ్రాన్ అన్నారు. క‌శ్మీర్ స‌మ‌స్య పరిష్కారంలో అమెరికా పెద్ద పాత్ర పోషిస్తుంద‌ని, ట్రంప్ పాత్ర మ‌రీ విశేషంగా ఉంటుంద‌ని ఇమ్రాన్ తెలిపారు. 130 కోట్ల మందికి సంబంధించిన అంశాన్ని చ‌ర్చిస్తున్నామ‌ని, ఒక‌వేళ శాంతి కుదిరితే ఆ లాభాలే మ‌రోలా ఉంటాయ‌ని ఇమ్రాన్ అన్నారు. భార‌త్ త‌న అణ్వాయుధ స‌మీక‌ర‌ణ నిలిపివేస్తే.. తాము కూడా ఆపేస్తామ‌ని ఇమ్రాన్ చెప్పారు. రెండు దేశాల మ‌ధ్య అణు యుద్ధం జ‌రుగ‌ద‌ని, అది స్వంత ధ్వంస‌మే అవుతుంద‌న్నారు.

అయితే, క‌శ్మీరుపై మోదీ తనతో చర్చించారని ట్రంప్‌ అన్యాపదేశంగా పాక్ ప్ర‌ధానితో వివ‌రించ‌డంతో వివాదం రేగింది. క‌శ్మీర్ స‌మ‌స్య‌పై మ‌ధ్య‌వ‌ర్తిత్వం చేయాలంటూ ట్రంప్‌ ను మోదీ కోరిన‌ట్లు వ‌స్తున్న వార్త‌ల‌పై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ స్పందించారు. ట్రంప్‌తో క‌శ్మీర్ స‌మ‌స్య‌పై మోదీ ఏం మాట్లాడారో .. ఆ విష‌యాన్ని ఆయ‌న వెల్ల‌డించాల‌ని రాహుల్ త‌న ట్విట్ట‌ర్‌ లో డిమాండ్ చేశారు. ఒక‌వేళ ఇదే నిజ‌మైతే.. భార‌త విశ్వాసాల‌ను మోదీ దెబ్బ‌తీశార‌ని రాహుల్ అన్నారు. 1972లో కుదిరిన సిమ్లా ఒప్పందాన్ని కూడా ఉల్లంఘించిన‌ట్లు అవుతుంద‌ని ఆరోపించారు. ప్ర‌ధాని అలా మాట్లాడ‌లేద‌ని విదేశాంగ శాఖ అంటే స‌రిపోదు అని, అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్‌, మోదీ మ‌ధ్య క‌శ్మీర్ గురించి జ‌రిగిన చ‌ర్చ వివ‌రాల‌ను వెల్ల‌డించాల్సిందే అని రాహుల్ అన్నారు.

మాజీ విదేశాంగ మంత్రి శ‌శిథ‌రూర్ స్పందిస్తూ . తానేమీ మాట్లాడుతున్నాడో ట్రంప్‌ కు తెలియ‌ద‌ని, బ‌హుశా ఆయ‌న‌కి స‌మ‌స్య అర్థం కాలేద‌నుకుంటే, లేదా ఆయ‌నకు స‌రిగా ఎవ‌రూ చెప్ప‌లేద‌నుకుంట‌న‌న్నారు. క‌శ్మీర్ స‌మ‌స్య‌పై మ‌ధ్య‌వ‌ర్తి వ‌ద్దు అన్న విష‌యం మ‌న విధానం అని, మ‌ధ్య‌వ‌ర్తి కోసం మోదీ మ‌రొక‌ర్ని ఆశ్ర‌యించ‌డం అసంభ‌వ‌మే అన్నారు. ఒక‌వేళ పాక్‌ తో మాట్లాడాల‌ని అనుకుంటే, నేరుగా మాట్లాడాల‌ని శ‌శిథ‌రూర్ అన్నారు. లోక్‌ స‌భ‌లో కాంగ్రెస్ నేత అధిర్ రంజ‌న్ చౌద‌రీ మాట్లాడుతూ.. అమెరికా ముందు భార‌త్ దాసోహం అయ్యింద‌న్నారు. మ‌నం బ‌ల‌హీనులం కాదు, దీనిపై ప్ర‌ధాని వివ‌ర‌ణ ఇవ్వాల‌ని అధిర్ డిమాండ్ చేశారు. అయితే జీరో అవ‌ర్‌ లో దీని గురించి చ‌ర్చిద్దామ‌ని స్పీక‌ర్ అన్నారు. విదేశాంగ మంత్రిత్వ‌శాఖ దీనిపై ప్ర‌క‌ట‌న చేస్తుంద‌ని పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హార‌ల శాఖ మంత్రి ప్ర‌హ్లాద్ జోషి తెలిపారు. క‌శ్మీర్ స‌మ‌స్య‌ను ఐక్య‌రాజ్య‌స‌మితి వ‌ర‌కు తీసుకు వెళ్లింది ఎవ‌రో తెలుసు అని ఆయ‌న ప‌రోక్షంగా మాజీ ప్ర‌ధాని నెహ్రూపై ఆరోప‌ణ‌లు చేశారు. ఇది సీరియ‌స్ అంశ‌మ‌ని, ఇందులో రాజ‌కీయాలు ఉండ‌కూడ‌ద‌న్నారు. నిర్మాణాత్మ‌క‌మైన చ‌ర్చ జ‌ర‌గాల‌ని స్పీక‌ర్ ఓం బిర్లా తెలిపారు. ట్రంప్ కామెంట్‌ పై చ‌ర్చ చేప‌ట్టాల‌ని సీపీఐ ఎంపీ డీ రాజా రాజ్య‌స‌భ‌లో నోటీసు ఇచ్చారు.

కాగా, విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంక‌ర్ రాజ్య‌స‌భ‌లో ఈ అంశంపై మాట్లాడారు. పాక్‌ తో ఉన్న అన్ని స‌మ‌స్య‌ల‌ను ద్వైపాక్షికంగానే చ‌ర్చిస్తామ‌ని తెలిపారు. సీమాతంర ఉగ్ర‌వాదం నిలిపివేస్తేనే చ‌ర్చ‌లు సాధ్య‌మ‌న్నారు. ఇరు దేశాల మ‌ధ్య ఉన్న స‌మ‌స్య‌లు సిమ్లా అగ్రిమెంట్‌, లాహోర్ డిక్లరేష‌న్ ప్ర‌కార‌మే ప‌రిష్కారం అవుతాయ‌న్నారు. క‌శ్మీర్ స‌మ‌స్య జాతీయ అంశ‌మ‌ని, జాతి ఐక్య‌తకు సంబంధించిన అంశంపై ఒకే గొంతు వినిపించాల‌ని చైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు తెలిపారు. మ‌రోవైపు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య‌ల‌ను భార‌త్ ఖండించింది. ప్ర‌ధాని మోదీ ఎటువంటి విజ్ఞాప‌న‌లు చేయ‌లేద‌ని విదేశాంగ శాఖ త‌న ట్విట్ట‌ర్‌ లో పేర్కొన్న‌ది. విదేశాంగ కార్య‌ద‌ర్శి రావీష్ కుమార్ ట్వీట్ చేస్తూ భార‌త్‌, పాక్ మ‌ధ్య ఉన్న ఎటువంటి స‌మ‌స్య‌లైనా ద్వైపాక్షికంగానే ప‌రిష్కారం కావాల‌న్నారు. సీమాంత‌ర ఉగ్ర‌వాదం నిలిపివేస్తేనే.. పాక్‌తో సంప్ర‌దింపులు సాధ్య‌మ‌న్నారు. రెండు దేశాల మ‌ధ్య గ‌తంలో కుదిరిన సిమ్లా, లాహోర్ అగ్రిమెంట్ ప్ర‌కార‌మే ముందుకు వెళ్లాల‌ని రావిశ్ కుమార్ తెలిపారు.

ఇలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీసిన నేప‌థ్యంలో అమెరికా దిద్దుబాటు చర్యలకు దిగింది. సౌత్ అండ్ సెంట్ర‌ల్ ఏషియా అఫైర్స్ యాక్టింగ్ అసిస్టెంట్ సెక్ర‌ట‌రీ అలిస్ వెల్స్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో కశ్మీర్ అంశంపై స్పందించారు. క‌శ్మీర్ స‌మ‌స్య‌ల‌పై ఆ రెండు దేశాలే చ‌ర్చించాల‌న్నారు. కావాలంటే తాము స‌హ‌క‌రిస్తామ‌ని ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌ లో పేర్కొన్నారు. కశ్మీర్‌ అంశం పూర్తిగా ద్వైపాక్షిక సమస్య అని.. దీనిపై ఇరు దేశాలు చర్చల ద్వారా పరిష్కరించుకోదలిస్తే అమెరికా స్వాగతిస్తుందన్నారు. ఇదిలాఉండ‌గా, అమెరికా కాంగ్రెస్‌ సభ్యులు సైతం ట్రంప్‌ వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. ఈ విషయంలో ట్రంప్‌ తరఫున క్షమాపణలు కోరుతున్నామనడం గమనార్హం. అయితే, ట్రంప్ మాత్రం బ‌హిరంగంగా స్పందించ‌క‌పోవ‌డం కొస‌మెరుపు.