Begin typing your search above and press return to search.

ముస్లింలపై ట్రంప్ వాదనకు అమెరికన్లు కన్వీన్స్

By:  Tupaki Desk   |   14 Jun 2016 11:39 AM GMT
ముస్లింలపై ట్రంప్ వాదనకు అమెరికన్లు కన్వీన్స్
X
ప్రజాస్వామ్య దేశాల్లో మైనార్టీల గురించి తొందరపడి వ్యాఖ్యలు చేసేందుకు ఏ ముఖ్యనేత ఇష్టపడరు. వీలైనంతవరకూ అందరికి ఆమోదయోగ్యమైన వ్యక్తిగా చెప్పుకునేందుకు ఇష్టపడతారు. అందులోకి భారత్.. అమెరికా లాంటి దేశాల్లో మైనార్టీలకు వ్యతిరేకంగా మాట్లాడి బతికి బట్టగలిగే నేత ఎవరూ ఉండరు. కానీ.. అందుకు భిన్నమైన నేత.. డోనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల అభ్యర్థిగా బరిలోకి దిగనున్న ఆయన.. తనకున్న ముస్లిం వ్యతిరేకతను ఎప్పుడూ దాచుకున్నది లేదు. ముస్లింలను అమెరికాలోకి రాకుండా అడ్డుకోవాలన్న నినాదాన్ని ఆయన నోటి నుంచి వచ్చినప్పుడు అమెరికన్లు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ట్రంప్ కు ముందు ఈ తరహా మాటలు ఇంత పెద్ద ఎత్తున మాట్లాడిన దాఖలాలు కనిపించవు. అందులోకి అధ్యక్ష స్థానానికి పోటీ పడుతున్న నేత వీలైనంతవరకూ అందరిని ఆకట్టుకోవాలని చూడటం.. అందరి మనసు దోచుకోవాలన్నట్లు వ్యవహరించటమే కాదు.. ఇలా ఒక మతానికి చెందిన వారిపై ఒంటి కాలిపై విరుచుకుపడటం లేదు. ప్రైమరీ ఎన్నికల్లో ఉన్నప్పుడే ముస్లింలపై తనకున్నవ్యతిరేకతను బయటపెట్టటానికి ఎలాంటి మొహమాట పడని ట్రంప్.. తన మాటలతో పెద్ద షాక్ నే ఇచ్చారని చెప్పాలి.

ఇలాంటి మాటలు అమెరికా ఇమేజ్ ను నాశనం చేస్తాయని గగ్గోలు పెట్టినోళ్లు చాలామందే. అమెరికా లాంటి ఫ్రీ కంట్రీలో ఇలాంటి మాటలేందంటూ చాలానే వాదనలు.. విమర్శలు వినిపించాయి. అయితే.. తాజాగా ట్రంప్ నోటి నుంచి వస్తున్న మాటలకు అమెరికన్ల నుంచి కాస్తపాటి సానుకూలత వ్యక్తం కావటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. ఈ మధ్యనే ఓర్లాండోలో ఉగ్రవాద భావజాలంతో ప్రేరేపితమైన మతీన్..గే పబ్ లోకి చేరి విచక్షణారహితంగా కాల్పులు జరిపి యాభై మందిని పొట్టన పెట్టుకున్న నేపథ్యంలో ట్రంప్ మరోసారి తనకున్న ముస్లిం వ్యతిరేకతను నిర్మోహమాటంగా వెల్లడించారు.

అనూహ్యంగా ఎప్పటి మాదిరి ట్రంప్ వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తటానికి బదులుగా.. ఆయన మాటలపై అమెరికన్లలో మిశ్రమ స్పందన లభించటం గమనార్హం. అదే విషయాన్ని ట్రంప్ సైతం చెప్పుకొస్తూ.. ‘‘శాన్ బెర్నార్డియో ఘటన తర్వాత ముస్లింలను నిషేధించాలని నేను చెబితే అంతా నవ్వారు. తిట్టారు. ఇప్పుడు నేను కరెక్టే అంటున్నారు. ఇప్పటికి చెబుతున్నాను.. ప్రస్తుతం ముస్లింల రాకపై తాత్కాలికంగా బ్యాన్ విధించి.. శాశ్వితంగా పరిష్కారం కనుగొనాల్సిందే. మన దగ్గరకు ఇస్లాం తీవ్రవాదం ఎలా వస్తుందన్న విషయంపై మనం నిజాలు మాట్లాడుకోవాలి. వలస చట్టం విఫలం కావటం ద్వారానే మన దేశంలోకి ఇస్లాం తీవ్రవాదాన్ని దిగుమతి చేసుకుంటున్నాం. మన ఇమ్మిగ్రేషన్ వ్యవస్థ పూర్తిగా విఫలమైంది’’ అంటూ మండిపడ్డారు.

గమనించాల్సిన విషయం ఏమిటంటే.. గతంలో ఇలాంటి మాటలే ట్రంప్ నోటి నుంచి వస్తే.. విపరీతమైన వ్యతిరేకత వ్యక్తమయ్యేది. కానీ.. ఇప్పుడు అందుకు భిన్నంగా.. ట్రంప్ వాదనలోని ‘నిజాన్ని’ వెతికేందుకు అమెరికన్లు సిద్ధం కావటం తాజా పరిణామం. విద్వేషపు మాటలు మొదట్లో చేదుగా అనిపించినా.. రోజులు గడిచే కొద్దీ అదో కొత్త టేస్ట్ గా మారుతుందన్నది మరోసారి నిరూపితమైంది. దీనికి అమెరికన్లు సైతం మినహాయింపు కాదన్న విషయం మరోసారి స్పష్టమైదని చెప్పక తప్పదు.