Begin typing your search above and press return to search.

ట్రంప్ దెబ్బకు ఇండియన్సుకు ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్

By:  Tupaki Desk   |   9 March 2017 7:28 AM GMT
ట్రంప్ దెబ్బకు ఇండియన్సుకు ఫ్యామిలీ ప్రాబ్లెమ్స్
X
అమెరికాలో హెచ్-1బి వీసాల గురించి భారతీయుల్లో మరో కొత్త గుబులు మొదలయింది. హెచ్-1బి వీసాలపై అమెరికా వచ్చిన విదేశీయుల జీవిత భాగస్వాములు కూడా అక్కడ పని చేయడానికి వీలు కల్పిస్తూ 2015లో అప్పటి బరాక్ ఒబామా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిని వ్యతిరేకిస్తూ ‘సేవ్ జాబ్స్ యుఎస్‌ ఏ’ అనే సంస్థ వాషింగ్టన్ డీసీ అప్పీల్స్ కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేయడంతో కొత్త టెన్షన్ మొదలైంది.

ఒబామా ప్రభుత్వం నిర్ణయాన్ని జిల్లా కోర్టు సమర్థించిన తర్వాత సేవ్ జాబ్స్ యూఎస్ ఏ సంస్థతో పాటుగా మరికొన్ని సంస్థలు కూడా అప్పీల్స్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. కాగా, అపీళ్ళ కోర్టులో పిటిషన్ విచారణను 60 రోజుల పాటు వాయిదా వేయాలని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు కోర్టును కోరింది. కొత్త ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీలుగా విచారణను 60 రోజుల పాటు నిలిపివేయాలని కోరుతూ అమెరికా న్యాయ శాఖ గత ఫిబ్రవరి 1న కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై నిర్ణయం తీసుకోవడానికి తమకు వ్యవధి కావాలని ఆ పిటిషన్‌ లో న్యాయ శాఖ కోరింది. దీంతో హెచ్-1బి వీసాల విషయంలో కఠినంగా వ్యవహరించాలని భావిస్తున్న ట్రంప్ ప్రభుత్వం ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకొంటుందోనని విదేశాలనుంచి వలస వచ్చిన వారు ముఖ్యంగా భారతీయులు ఆందోళన చెందుతున్నారు.

ప్రస్తుత అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ హెచ్-1బి వీసాలపై వచ్చిన వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగాలు చేయడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. కాగా, వేలాది మంది హెచ్-1బి వీసాహోల్డర్ల తరఫున ఈ కేసులో జోక్యం చేసుకోనున్నట్లు ‘ఇమిగ్రేషన్ వాయిస్’ అనే సంస్థ ప్రకటించింది. అమెరికా పౌరులయిన వలసదారులు, వారి కుటుంబాలు, పిల్లల హక్కులను రక్షించుకోవడానికి తమకు ఇది తప్ప మరో మార్గం లేదని ‘ఇమిగ్రేషన్ వాయిస్’ అంటోంది. హెచ్-1బి వీసాలపై అమెరికా వెళ్లే వారిలో ఎక్కువ మంది భారతీయులే ఉన్నారు. హెచ్ 4-ఇఏడి వర్క్ పర్మిట్‌ పై చాలా సంవత్సరాలుగా ఉద్యోగాలు -వ్యాపారాలు చేస్తున్న వారు చాలా మందే ఉన్నారు. అమెరికా ప్రభుత్వపు ఇటీవలి ప్రకటనలు చూసినట్లయితే 60 రోజుల తర్వాత న్యాయ మంత్రిత్వ శాఖ హెచ్-1బి వీసాదారులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటుందేమోనని అనుమానిస్తున్నారు. ఒక వేళ ట్రంప్ ప్రభుత్వం గనుక హెచ్-1బి వీసాదారులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే... వేలాది మంది వ్యాపారాల్లో పెట్టిన పెట్టుబడులతో పాటుగా ఉద్యోగాలు కోల్పోవడమే కాకుండా అమెరికాలో పని చేసే పరిస్థితే ఉండదని భయపడుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/