Begin typing your search above and press return to search.

వీసా ర‌చ్చ‌..ట్రంప్ చెప్పిన గుడ్ న్యూస్‌

By:  Tupaki Desk   |   1 Oct 2018 1:30 PM GMT
వీసా ర‌చ్చ‌..ట్రంప్ చెప్పిన గుడ్ న్యూస్‌
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసాల విష‌యంలో కఠిన నిబంధనలు ప్రవేశపెట్టి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఒక‌దాని వెంట మ‌రొక‌టిఅన్న‌ట్లుగా ఆయ‌న ఇస్తున్న ఆదేశాల ఫ‌లితంగా షాక్‌కు గుర‌వుతున్న వారికి తాజాగా ఓ తీపిక‌బురు అందింది. పెట్టుబడి ఆధారంగా జారీ చేసే వీసాల విష‌యంలో ఆయ‌న తీపిక‌బురు వినిపించారు. ఈబీ-5 ఇన్వెస్టర్ వీసాకు దరఖాస్తు చేసుకోవాలనుకునే భారతీయులకు శుభవార్త చెప్తూ...ప్రస్తుతం ఉన్న ఈబీ-5 వీసా పెట్టుబడి పథకాన్ని డిసెంబర్ 7 వరకు అమెరికా ప్రభుత్వం వాయిదా వేసింది. త్వరలో ఈబీ-5 వీసా పెట్టుబడి భారీగా పెరుగుతుండటంతో భారతీయులు ఎక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకుంటున్న నేప‌థ్యంలో ఈ తీపిక‌బురు సంతోషంగా మారింది.

ఈబీ-5 ప్రస్తుత నిబంధనల ప్రకారం 10 లక్షల డాలర్లు (రూ.7.2 కోట్లు)- ప్రత్యేక ప్రాంతాల్లో అయితే 5 లక్షల డాలర్లు (3.6 కోట్లు) పెట్టుబడి పెట్టాలి. ఏల్ల‌ తరబడి ఇదే మొత్తం పెట్టుబడి కొనసాగుతుండటంతో ఈ మొత్తాన్ని పెంచాలని ఒబామా హయాంలో ఓ బిల్లును తీసుకొచ్చారు. దాని ప్రకారం పెట్టుబడి మొత్తాన్ని 18 లక్షల డాలర్లు (రూ.12.96 కోట్లు) ప్రత్యేక ప్రాంతాల్లో 13.5 లక్షల డాలర్ల (రూ.9.72 కోట్లు)కు పెంచాలని ప్రతిపాదించారు. కాగా ఈ పెంపు ప్రతిపాదనను డిసెంబర్ 7 వరకు వాయిదా వేశారు. దీంతో పాత పెట్టుబడితోనే ఈబీ-5 వీసాను పొందే అవకాశం భారతీయులకు ఏర్పడింది. కాగా, 2016లో 50 మంది పెట్టుబడిదారులు దరఖాస్తు చేసుకోగా - ఆ తర్వాతి ఏడాదిలో 97 వచ్చాయని - ప్రస్తుత సంవత్సరంలో 200 వచ్చే అవకాశం ఉంద‌ని అంచ‌నా వేస్తున్నారు. ఈ అమెరికా ఈబీ-5 వీసా జారీ అయిన వ్యక్తి ఐదేళ్ల‌ పాటు అక్కడే నివసిస్తే గ్రీన్‌ కార్డు కూడా లభించనున్నదని - గృహాన్ని కూడా కొనుగోలు చేసుకునే వీలుంటుంది.

ఈ వీసాల జారీ ద్వారా అమెరికాకు వచ్చేవారిలో భారత్ మూడో స్థానంలో ఉన్నదని - తొలి స్థానంలో వియత్నాం - ఆ తర్వాతి చైనా ఉంది. ఈ వీసా కింద పెట్టుబడిదారుడితోపాటు ఆయన భార్య - 21 ఏండ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న పెళ్లి కాని యువతీ యువకులను తీసుకెళ్లవచ్చు. ప్రస్తుతం ఈ వీసాల కింద ఉన్న మార్గదర్శకాలను మార్చే అవకాశం ఉన్నదని - సెప్టెంబర్ 30 నుంచి కొత్త నిబంధనల ప్రకారం పెట్టుబడుల పరిధిని మరింత పెంచే అవకాశం ఉందన్నారు.