Begin typing your search above and press return to search.

ట్రంప్ నోటిదూల.. ఆసియా దేశాలకు అవమానం

By:  Tupaki Desk   |   6 Jun 2019 5:38 AM GMT
ట్రంప్ నోటిదూల.. ఆసియా దేశాలకు అవమానం
X
ట్రంప్ తన అగ్రరాజ్య దురహంకారాన్ని మరోసారి ప్రదర్శించారు. భారత్, చైనా, రష్యా లాంటి ఆసియా దేశాలపై నోరుపారేసుకున్నారు. శుభ్రత, పర్యావరణం విషయంలో ఆ దేశాలు ఏ మాత్రం శ్రద్ధ చూపవని.. అవి కంపు దేశాలు అనే తరహాలో విమర్శలు చేశారు. ఆ దేశాల్లో అస్సలు గాలి, నీరు, స్వచ్ఛంగా ఉండవని.. అక్కడ గాలి పీల్చుకోవడం కష్టమని నోరు పారేసుకున్నారు. ఇప్పుడీ వ్యాఖ్యలతో చైనా, భారత్, రష్యాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. ప్రొటోకాల్ ప్రకారం బ్రిటన్ రాజు ప్రిన్స్ చార్లెస్ తో 15 నిమిషాల పాటు భేటి అయ్యారు. కానీ ఆయన మాటలు, పర్యావరణంపై అవగాహన చూసి గంటన్నర సేపు భేటి కొనసాగించారట.. అదే విషయాన్ని సమావేశం అనంతరం మీడియా సమావేశంలో ప్రస్తావిస్తూ ఆసియా దేశాలను దెప్పిపొడిచారు.

అమెరికా పర్యవరణ పరిరక్షణకు పాటుపడుతుందని.. చైనా, రష్యా వంటి దేశాలు పర్యావరణ పరిరక్షణకు ఏమాత్రం బాధ్యత వహించవని ట్రంప్ విమర్శించారు. గణాంకాలు కూడా ఇవే చెబుతున్నాయని.. భారత్, చైనా, రష్యా వంటి దేశాలకు అసలు ఈ విషయంపై ధ్యాసే లేదని దుయ్యబట్టారు. భారత్, చైనా దేశాల్లోని కొన్ని నగరాల గురించి అస్సలు మాట్లాడే పరిస్థితి లేదని .. అక్కడికి వెళ్లి చూస్తే గాలి కూడా పీల్చుకోవడం కష్టమేనని ట్రంప్ ఎద్దేవా చేశారు.

ప్రపంచానికి పర్యావరణ గురించి హితబోధ చేస్తున్న ట్రంప్ చేసిన పనులు మాత్రం పర్యావరణాన్ని నాశనం చేసేలానే ఉన్నాయి. ఇటీవల ప్రపంచ పర్యావరణం కోసం ప్రపంచ దేశాలు కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి అమెరికా వైదొలగింది. ఇక మూతపడ్డ బొగ్గు ఆధారిత పరిశ్రమలను ట్రంప్ తెరిపించేశారు. ఇక ప్రపంచంలో చైనా తర్వాత అత్యధికంగా కర్భన ఉద్గారాలను వదిలేని అమెరికానే.. ఇలా అన్నింట్లో పర్యావరణానికి తూట్లు పొడుస్తున్న ట్రంప్.. తాజాగా ఆసియా దేశాలపై ఆడిపోసుకోవడంపై ప్రపంచ దేశాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.