Begin typing your search above and press return to search.

ట్రంప్ కిమ్ భేటీ...ఇదే మొద‌టి రికార్డ్‌

By:  Tupaki Desk   |   11 Jun 2018 1:31 PM GMT
ట్రంప్ కిమ్ భేటీ...ఇదే మొద‌టి రికార్డ్‌
X
సుదీర్ఘ‌కాలంగా నెల‌కొన్న ఉత్కంఠ‌కు తెర‌ప‌డి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - అటు ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఒకరి దేశాన్ని ఒకరు నాశనం చేస్తామని కత్తులు దూసుకున్న ఈ ఇద్ద‌రు నేత‌లు...ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉద్రిక్త‌త‌ను పెంచారు. అమెరికాలోని ప్రధాన నగరాలకు చేరగల క్షిపణులను ఉత్తర కొరియా పరీక్షిస్తే.. ఒక్క మీటతో ఉత్తర కొరియాను నామరూపాల్లేకుండా చేస్తామని అమెరికా హెచ్చరించింది. ఇటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ - అటు ఉత్తరకొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ తమ మాటలు - చర్యలతో ప్రపంచ దేశాలను దాదాపు వణికించారు. ఒకరికొకరు పరస్పరం దూషణలు కూడా చేసుకున్నారు. వాటిని ప‌క్క‌న‌పెట్టి స‌మావేశం అయ్యేందుకు నిర్ణ‌యించుకున్నారు.

కిమ్‌ తో సమావేశమయ్యేందుకు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం సాయంత్రం కెనడా నుంచి సింగపూర్‌ కు చేరుకున్నారు. అంతకుముందే ఉత్తరకొరియా రాజధాని ప్యాంగ్యాంగ్ నుంచి ఎయిర్‌చైనా విమానంలో సింగపూర్‌ కు చేరుకున్న కిమ్‌ కు ఘన స్వాగతం లభించింది. ట్రంప్ - కిమ్‌ లకు సింగపూర్ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్ స్వాగతం పలికారు. పటిష్ఠ భద్రత మధ్య కిమ్‌ ను ఆయన బస చేసే సెయింట్‌ రెగిస్ హోటల్‌ కు తీసుకువెళ్లారు. కెనడా నుంచి సింగపూర్‌ కు బయలుదేరిన ట్రంప్.. కిమ్‌ తో శిఖరాగ్ర భేటీపట్ల ఆశావహ దృక్పథంతో ఉన్నట్లు ట్వీట్ చేశారు. ప్రపంచ శాంతి కోసం కిమ్‌ తో భేటీకి వెళుతున్న తాను సానుకూలంగా ఉన్నట్లు చెప్పారు. భేటీ వల్ల ప్రగతి లేదని అనిపిస్తే చర్చల నుంచి అర్ధంతరంగా తప్పుకుంటానని ట్విస్ట్ ఇవ్వ‌డం గ‌మ‌నార్హం.

ఇదిలాఉండ‌గా...ఉత్తరకొరియా- అమెరికాతో దౌత్య సంబంధాలు కలిగి ఉన్న సింగపూర్ ఈ సదస్సు నిర్వహణకు రెండు కోట్ల సింగపూర్ డాలర్లను ఖర్చు చేస్తోంది. ఇదో రికార్డ్ అని విశ్లేష‌కులు చెప్తున్నారు. అయితే, ఈ శిఖరాగ్ర సదస్సు ఖర్చు భరించేందుకు తాము సిద్ధమేనని ఆయన చెప్పారు. ఇందులో సగం నిధులు ఇరు దేశాల అధినేతల భద్రత కోసమే ఖర్చు చేస్తున్నట్లు సింగపూర్ ప్రధాని లీ తెలిపారు. కాగా - కిమ్ - ట్రంప్ శిఖరాగ్ర చర్చల కోసం సింగపూర్‌ కు చెందిన సెంటోసా ద్వీపంలోని కాపెల్లా హోటల్ ముస్తాబవుతోంది. మంగళవారం ఉదయం 9 గంటల (భారత కాలమానం ప్రకారం ఉదయం 6.30 గంటల)కు వారి శిఖరాగ్ర భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశం కవరేజీ కోసం ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నుంచి సుమారు మూడు వేల మంది జర్నలిస్టులు సింగపూర్‌ కు చేరుకున్నారు. ఇరుదేశాల అధినేతలు బస చేసిన హోటళ్ల వద్ద సింగపూర్ ప్రభుత్వం పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేసింది. కిమ్ - ట్రంప్ మధ్య భేటీ ఉత్తరకొరియా అధినేత - అమెరికా అధ్యక్షుడి మధ్య తొలి సమావేశం కానుంది.