Begin typing your search above and press return to search.

అంతరిక్ష యుద్ధానికి ట్రంప్ తెర తీశారా?

By:  Tupaki Desk   |   31 Aug 2019 4:31 AM GMT
అంతరిక్ష యుద్ధానికి ట్రంప్ తెర తీశారా?
X
ఇప్పుడున్న సమస్యలు చాలవన్నట్లుగా కొత్త తరహా నిర్ణయాలతో విషయాల్ని మరింత సంక్లిష్టం చేసేలా నిర్ణయాన్ని ప్రకటించారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఎక్కడైనా సరే తమ అధిక్యమే తప్పించి.. మరెవరూ ఉండకూడదన్నట్లుగా పెద్దన్నబలుపు ప్రదర్శించింది అమెరికా. తాజాగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన.. సరికొత్త ఉద్రిక్తతకు తెర తీయటమే కాదు.. స్పేస్ వార్ కు ఒక ముందడుగు పడినట్లుగా చెప్పక తప్పదు.

అంతరిక్షంలో తమకున్నఅధిపత్యానికి ఏ మాత్రం నష్టం జరగకూడదన్న ఆలోచనతో పాటు.. ప్రపంచ దేశాల్ని అంతరిక్షంలో కంట్రోల్ చేయాలన్న కొత్త తలంపును తెర మీదకు తెచ్చారు ట్రంప్. తాజాగా ఆయన వైట్ హౌస్ లో స్టార్ట్ చేసిన ఒక కొత్త తరహా సైన్యం ప్రపంచంలోనే మొదటిదిగా చెప్పాలి. ఇప్పటివరకూ భూమి.. ఆకాశం.. నీటి మీద సైన్యాన్ని ఏర్పాటు చేసుకునే దానికి అదనంగా స్పేస్ ఆర్మీని క్రియేట్ చేసినట్లుగా ప్రకటించారు ట్రంప్.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ప్రపంచ పెద్దన్నకు ఉండే సహజసిద్ధమైన ఉడుకుమోతుతనాన్ని ప్రదర్శించారు. కొన్ని దేశాల నుంచి అంతరిక్షంలో తమ ఉపగ్రహాలకు ఎదురవుతున్న ముప్పుపై ఆందోళన వ్యక్తం చేసిన ట్రంప్..దీనికి విరుగుడుగా స్పేస్ కమాండ్ ను కొత్తగా ఏర్పాటు చేసినట్లుగా ప్రకటించారు.

తమ దేశానికి నష్టం కలిగించాలన్న ఆలోచన ఉండేవారికి.. అంతరిక్షంలో సవాళ్లు తీసుకురావాలని భావించే వారి పరిస్థితి ఇకపై వేరుగా ఉంటుందన్న వార్నింగ్ ఇచ్చేశారు. తమ అధిక్యాన్ని.. అధిపత్యాన్ని నిలుపుకోవాలన్నట్లు ఉన్న ఆయన.. ఈ రంగంలో తమకు సవాళ్లు ఎదురు కాకూడదన్న మాటను చెప్పటమే కాదు.. అందుకు తగ్గట్లే ప్రపంచ దేశాలకు వార్నింగ్ ఇచ్చేశారు.

నేల.. ఆకాశం.. సముద్రం.. సైబర్ మాధ్యమాలతో యుద్ధ ప్రదేశాలుగా గుర్తించిన దానికి భిన్నంగా తాజాగా అంతరిక్ష రంగంలో అమెరికా అధిపత్యానికి సవాళ్లు ఎదురుకాకుండా చూస్తానని చెప్పటం గమనార్హం. ఇందులో భాగంగా 11వ యూనిఫైడ్ కంబాటెంట్ కమాండ్ ఆఫ్ ద అమెరికన్ ఆర్మడ్ ఫోర్సెస్ పేరుతో ఒక బలగాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా మొత్తం 287 మంది పని చేస్తారని.. శత్రుదేశాలు ప్రయోగించిన క్షిపణుల్ని గుర్తించి సైన్యానికి సమాచారం ఇవ్వటం.. అవసరమైతే.. క్షిపణుల్ని.. శత్రుదేశాల ఉపగ్రహాల్ని లేజర్లను ఉపయోగించి ధ్వంసం చేయటం లేదంటే.. పని చేయకుండా చేస్తామని చెప్పారు. ట్రంప్ తాజా వ్యాఖ్యలతో స్పేస్ లోనూ సరికొత్త టెన్షన్ షురూ కావటం ఖాయమని చెప్పక తప్పదు. తన సైన్యాన్ని ప్రకటించిన ట్రంప్.. ఈ విభాగానికి కమాండర్ గా జనరల్ జాన్ డబ్ల్యూ రేమండ్ గా చెప్పారు. ఈ అయ్యగారి పుణ్యమా అని రానున్న రోజుల్లో మరెన్ని ఉత్సాతాల్ని ప్రపంచం చూడాల్సి వస్తుందో?