Begin typing your search above and press return to search.

గ్రీన్ కార్డు జారీలో మార్పు.. మ‌న‌కే లాభం

By:  Tupaki Desk   |   3 Aug 2017 7:46 AM GMT
గ్రీన్ కార్డు జారీలో మార్పు.. మ‌న‌కే లాభం
X
ప్ర‌పంచ వ్యాప్తంగా ఉండే ప్ర‌జ‌లు అగ్రరాజ్య‌మైన అమెరికాకు వెళ్ల‌టం తెలిసిందే. అమెరికాలో శాశ్విత నివాసం కోసం జారీ చేసే గ్రీన్ కార్డు కోసం క‌ళ్లు కాయ‌లు కాచేలా వెయిట్ చేయ‌టం చాలామంది విష‌యంలో చూసేదే. అయితే.. అమెరికా అధ్య‌క్ష ప‌ద‌విని చేప‌ట్టిన నాటి నుంచి ట్రంప్ తీసుకుంటున్న నిర్ణ‌యాల‌తో విదేశీయులు తీవ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు. ఇప్ప‌టికే హెచ్ 1బీ వీసాల విష‌యంలో తీసుకున్న నిర్ణ‌యంపై ప‌లు దేశాలు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా గ్రీన్ కార్డు జారీ విధానంలో మార్పులు చేయాల‌ని అమెరికా నిర్ణ‌యించింది.

అయితే.. కొత్త విధానం భార‌త్‌ కు లాభ‌దాయ‌కంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. రీఫార్మింగ్ అమెరిక‌న్ ఇమ్మిగ్రేష‌న్ ఫ‌ర్ స్ట్రాంగ్ ఎంప్లాయిమెంట్ పేరుతో మెరిట్ ఆధారంగా ఇచ్చే గ్రీన్ కార్డును ఇచ్చేలా మార్పులు చేస్తార‌ని చెబుతున్నారు. ఈ ప్ర‌తిపాద‌న‌కు అధ్య‌క్షుడు ట్రంప్ కూడా మ‌ద్ద‌తు ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

ఒక‌వేళ ఇప్పుడు ప్ర‌తిపాద‌న‌గా ఉన్న అంశాలు చ‌ట్టంగా మారితే భార‌త్ నుంచి వెళ్లిన ఉన్న‌త విద్యావంతులైన ఐటీ నిపుణుల‌కు పెద్ద ఎత్తున ప్ర‌యోజ‌నం క‌లిగే అవ‌కాశం ఉందంటున్నారు. ప్ర‌స్తుతం అమెరికాలో శాశ్విత నివాసం ఉండాలంటే.. ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారి నుంచి లాట‌రీ విధానంలో గ్రీన్ కార్డును ఇస్తున్నారు.

అయితే.. కొత్త చ‌ట్టం అమ‌ల్లోకి వ‌స్తే లాట‌రీ విధానానికి మంగ‌ళం ప‌లుకుతారు. మెరిట్ ఆధారంగానే గ్రీన్ కార్డు ఇస్తారు. అంటే.. ఆంగ్ల భాష మీద ప‌ట్టు.. విద్య‌.. ఎక్కువ జీతం వ‌చ్చే ఉద్యోగం ఉన్న వారికి గ్రీన్ కార్డు ల‌భించే అవ‌కాశం ఉంది. వీట‌న్నింటితో పాటు వ‌య‌సును కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటారు. అన్ని అంశాల్ని క్రోడిక‌రించిన త‌ర్వాత మెరిట్ లిస్ట్ త‌యారు చేసి గ్రీన్ కార్డు జారీ చేస్తార‌ని చెబుతున్నారు.

ఈ చ‌ట్టంతో దేశంలో పేద‌రికం త‌గ్గుతుంద‌ని.. జీతాలు పెరుగుతాయ‌ని చెబుతున్నారు. రేస్ చ‌ట్టం కార‌ణంగా త‌క్కువ నైపుణ్య వ్య‌వ‌స్థ‌కు స్వస్తి ప‌లికి.. అన్నివిధాలుగా అర్హ‌త ఉన్న వారికే శాశ్విత నివాసం పొందే వీలు క‌లుగుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చే విదేశీయుల కంటే కూడా భార‌త్ నుంచి వెళ్లే వారికి అనుకూలంగా రేస్ చ‌ట్టం ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. అదే జ‌రిగితే గ్రీన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న అమెరికాలోని భార‌తీయుల‌కు ఇది క‌చ్ఛితంగా పండ‌గ‌లాంటి వార్తే అవుతుంద‌న‌టంలో సందేహం లేదు.