Begin typing your search above and press return to search.

ట్రంప్ కు మ‌ళ్లీ త‌లనొప్పి మొద‌లైంది

By:  Tupaki Desk   |   16 March 2017 10:18 AM GMT
ట్రంప్ కు మ‌ళ్లీ త‌లనొప్పి మొద‌లైంది
X
అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌న విశిష్ట అధికారాల‌తో ఆరు ముస్లిం దేశాల వలసదారులపై ఆంక్ష‌లు విధిస్తూ తాజాగా జారీ చేసిన ఆదేశాల‌కు మ‌ళ్లీ చుక్కెదురైంది. ట్రంప్ కొత్తగా జారీ చేసిన ఆదేశాల ప్ర‌కారం ఆరు ముస్లిం దేశాల వ‌ల‌స‌దారుల‌పై 90 రోజులు, శ‌ర‌ణార్థుల‌పై 120 రోజుల‌ నిషేధం ఉంది. ఈ గురువారం అర్థ‌రాత్రి నుంచి ట్రంప్ కొత్త ఆదేశాలు అమ‌లులోకి రానున్నాయి. ఈ ప్ర‌క‌ట‌నపై హ‌వాయి రాష్ట్రం కోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ట్రావెల్ బ్యాన్ ఆదేశాల‌కు హ‌వాయి రాష్ట్ర న్యాయ‌మూర్తి చెక్ పెట్టారు. బ్యాన్‌ విష‌యంలో ప్ర‌భుత్వం వాదిస్తున్న అంశం ప్ర‌శ్నార్థ‌కంగా ఉంద‌ని హ‌వాయి జిల్లా జ‌డ్జి డెర్రిక్ వాట్స‌న్ తెలిపారు.

ఏడు ముస్లిం దేశాల ప్ర‌యాణికుల నిషేధంపై జ‌న‌వ‌రిలో డొనాల్డ్ ట్రంప్‌ జారీ చేసిన మొద‌టి ఆదేశానికి వ్య‌తిరేకంగా కూడా హ‌వాయి రాష్ట్రం దావా దాఖ‌లు చేసింది. దీనిపై తీర్పు ట్రంప్ స‌ర్కారుకు వ్య‌తిరేకంగా వ‌చ్చింది. దీంతో ట్రావెల్ బ్యాన్ ను ఆరు దేశాల‌కు కుదించింది. అయితే ఈ ఉత్త‌ర్వుల‌పైనా హ‌వాయి రాష్ట్రం కోర్టుకు ఎక్కింది. ట్రంప్ తాజా ఆదేశాల వ‌ల్ల త‌మ రాష్ట్ర ఆదాయం ప‌డిపోతుంద‌ని హ‌వాయి ఆరోపించింది. కొత్త ఆదేశాల వ‌ల్ల విద్యార్థుల‌ను, ఉపాధ్యాయుల‌ను రిక్రూట్ చేసేందుకు వ‌ర్సిటీలు ఇబ్బందిప‌డాల్సి ఉంటుంద‌ని హ‌వాయి రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న వాద‌న‌లో పేర్కొంది. తాజాగా ట్రంప్ జారీ చేసిన ఆదేశాలు అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నాయ‌ని ఆ రాష్ట్రం అభిప్రాయ‌ప‌డింది. ట్రంప్ ఆదేశాల‌ను వెంట‌నే నిలిపివేయాల‌ని కోర్టును హ‌వాయి రాష్ట్రం కోరింది. హ‌వాయి వాద‌న‌లు విన్న న్యాయ‌మూర్తి దేశ అధ్య‌క్షుడు ట్రంప్ నిర్ణ‌యాన్ని నిలిపివేస్తూ ఆదేశాలు ఇచ్చారు.

మ‌రోవైపు హ‌వాయి జ‌డ్జి జారీ చేసిన ఆదేశాల‌ను ట్రంప్ త‌ప్పుప‌ట్టారు. న్యాయ‌శాఖ అతిగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ద‌ని తీర్పుపై ట్రంప్ ట్వీట్ చేశారు. ఇదిలాఉండ‌గా తీర్పుపై వైట్ హౌజ్ సైతం రియాక్ట‌యింది. ఇమ్మిగ్రేష‌న్ చ‌ట్టాల‌ను అమ‌లు చేసేందుకు ప్రెసిడెంట్‌కు అధికారాలున్నాయ‌ని వైట్‌హౌజ్ పేర్కొంది. దేశ భ‌ధ్ర‌త-సంక్షేమం కోణంలోనే అధ్య‌క్షుడు ట్రంప్ నిర్ణ‌యాలు ఉన్నాయ‌ని తెలిపింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/