Begin typing your search above and press return to search.

ల‌క్ష మంది ఎన్ ఆర్ ఐల గుండెల్లో ట్రంప్ ద‌డ‌!

By:  Tupaki Desk   |   3 Jan 2018 5:38 AM GMT
ల‌క్ష మంది ఎన్ ఆర్ ఐల గుండెల్లో ట్రంప్ ద‌డ‌!
X
డాల‌ర్స్ డ్రీమ్స్ తో అమెరికాకు వెళ్లిన భార‌తీయుల‌కు ఇప్పుడు మ‌రోసారి ట్రంప్ ద‌డ మొద‌లైంది. వ‌ర్క్ ప‌ర్మిట్ వీసాల‌పై అమెరికాకు వెళ్లి.. కాల‌క్ర‌మంలో అమెరిక‌న్ జాతీయుడిగా మారేందుకు సాయం చేసే గ్రీన్ కార్డు కోసం అప్లై చేయ‌టం.. ఓకే కావ‌టం.. అక్క‌డే ఉండిపోవ‌టం కొన్నేళ్లుగా సాగుతున్న‌దే. అమెరికాలోని భార‌తీయ ఉద్యోగుల‌పై క‌త్తి దూస్తున్న ట్రంప్ తాజాగా మ‌రోసారి క‌త్తి దూశారు.

అమెరికాలో ప్ర‌స్తుతం హెచ్ 1బీ వీసా మీద ఉంటూ.. గ్రీన్ కార్డు కోసం అప్లై చేసిన దాదాపు ఏడు ల‌క్షల మంది విదేశీయుల్ని వారి.. వారి దేశాల‌కు పంపేందుకు ట్రంప్ రంగం సిద్ధం చేస్తున్న‌ట్లు చెబుతున్నారు. ఒక‌వేళ ఆయ‌న అనుకున్న‌దే జ‌రిగితే.. ఆ ఏడు ల‌క్ష‌ల మందిలో ల‌క్ష మంది భార‌తీయులు ఉండ‌నున్నారు.

ఈ ప‌రిణామం అమెరికాలోని భార‌తీయుల గుండెల్లో గుబులు పుడుతోంది. అమెరికాలో అమెరికా జాతీయుల‌కు ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని.. అక్క‌డివారికే ఉద్యోగాలు ద‌క్కాల‌న్న త‌న మాట‌ను వివిధ కంపెనీ సీఈవోల‌తో ఇటీవ‌ల‌ స‌మావేశ‌మైన సంద‌ర్భంగా ట్రంప్ తేల్చి చెప్ప‌టం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో అమెరికాలో ప‌ని చేస్తున్న త‌మ వృత్తి నిపుణుల్ని ఒక క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో అమెరికా నుంచి స్వ‌దేశాల‌కు పంపే ప్ర‌క్రియ మొద‌ల‌వుతోంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే అమెరికాలోఉన్న విదేశీయుల మీద ట్రంప్ స‌ర్కారు తీసుకుంటున్న నిర్ణ‌యాల కార‌ణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా హెచ్ 1బీ వీసాల మీద ఉంటూ గ్రీన్ కార్డుల కోసం అప్లై చేసిన వారిని వెన‌క్కి పంపేందుకు వీలుగా ఒక ప్ర‌తిపాద‌న‌ను ట్రంప్ స‌ర్కారు సిద్ధం చేసింది.

ఇది కానీ అమ‌లు జ‌రిగితే దాదాపు ల‌క్ష మంది వ‌ర‌కు భార‌తీయులు అమెరికా నుంచి వెన‌క్కి రావాల్సి ఉంటుంది. అదే జ‌రిగితే.. ఆర్థిక వ్య‌వ‌స్థ మీద ప్ర‌భావం చూప‌టంతో పాటు.. ఉద్యోగ క‌ల్ప‌న విష‌యంలోనూ దేశంలో ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డుతుంద‌ని చెబుతున్నారు. హెచ్ 1బీ నిబంధ‌న‌ల్ని క‌ఠిన‌త‌రం చేయ‌టం.. హెచ్ 4 వీసాల‌పై నియంత్ర‌ణ విధించ‌టంతో పాటు మ‌రో కొత్త రూల్‌ను తీసుకురావాల‌న్న యోచ‌లో ట్రంప్ స‌ర్కారు ఉంద‌ని చెబుతున్నారు.

హెచ్ 1 బీ వీసాల మీద అమెరికాలో ఉంటున్న ప‌లువురు విదేశీయులు.. గ్రీన్ కార్డు కోసం అప్లై చేసుకుంటే.. వారికి అమెరికాలో ఉండేందుకు పొడిగింపు ఇవ్వ‌రని చెబుతున్నారు. ఒక‌ప్పుడు గ్రీన్ కార్డు చాలా సులువుగా వ‌చ్చేద‌ని.. కానీ.. రానురాను అది చాలా క‌ష్టంగా మారింద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఒక‌ప్పుడు నాలుగేళ్లు అమెరికాలో జాబ్ చేస్తే గ్రీన్ కార్డు వ‌చ్చేసేద‌ని.. దాని కోసం పెద్ద‌గా క‌ష్ట‌ప‌డాల్సి ఉండేది కాద‌ని చెబుతున్నారు. విదేశీ నిపుణులు పెరుగుతున్న కొద్దీ.. అమెరిక‌న్ల‌కు అవ‌కాశాలు త‌గ్గుతున్నాయ‌న్న భావ‌న అంత‌కంత‌కూ పెరుగుతోంద‌ని.. ఆ అసంతృప్తిని త‌గ్గించేందుకు విదేశీయుల‌కు వీలైనంత వ‌ర‌కూ త‌క్కువ అవ‌కాశాలు ఉండేలా చేయాల‌న్న ఒత్తిడి పెరుగుతోంద‌ని చెబుతున్నారు.

అందులో భాగంగానే ట్రంప్ స్వ‌దేశీ మంత్ర‌ను తెర మీద‌కు తీసుకురావ‌ట‌మే కాదు.. అసంతృప్తితో ఉన్న ప‌లువురి అమెరిక‌న్ల మ‌న‌సుల్ని దోచేశాడు. తాజాగా గ్రీన్ కార్డు అప్లై చేసిన వారికి హెచ్ 1బీ వీసా పొడిగింపు ఉండ‌ద‌న్న నిర్ణ‌యంతో ఎలాంటి ప‌రిణామాలుఎదుర‌వుతాయ‌న్న అంశంపై డిపార్ట్ మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యురిటీ ఇటీవ‌ల ఒక మెమో జారీ చేసింది. ఈ ప‌రిణామం అగ్రరాజ్యంలో ఉన్న విదేశీయుల్ని వ‌ణికిస్తోంది. కోటి క‌ల‌ల‌తో.. భ‌విష్య‌త్ ప్రణాళిక‌ల‌తో అమెరికాలో ఉంటున్న తమ‌ను వెన‌క్కి పంపితే త‌మ ప‌రిస్థితేమిట‌న్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ట్రంప్ స‌ర్కారు తీసుకునే నిర్ణ‌యంతో దాదాపు ల‌క్ష మంది భార‌తీయులు ఎఫెక్ట్ కానున్న నేప‌థ్యంలో అమెరికాలోని ఎన్ఆర్ఐలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.