Begin typing your search above and press return to search.

కశ్మీర్ పై ట్రంప్ తాజా స్టాండ్ ఇదే!

By:  Tupaki Desk   |   2 Aug 2019 5:30 AM GMT
కశ్మీర్ పై ట్రంప్ తాజా స్టాండ్ ఇదే!
X
ఇటీవల పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అమెరికాకు వెళ్లటం.. ఆయన్ను రిసీవ్ చేసుకునేందుకు అమెరికాకు చెందిన వారెవరూ వెళ్లకపోవటం.. ఆయనకు ఘోర అవమానం జరిగిందంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే.. ఇలాంటివాటిని పెద్దగా పట్టించుకోనట్లుగా వ్యవహరించారు ఇమ్రాన్ ఖాన్. ట్రంప్ - ఇమ్రాన్ ల మధ్య జరిగిన సమావేశంపై ఎలాంటి అంచనాలు లేవు. పాక్ ప్రధానితో భేటీకి ట్రంప్ పెద్దగా ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కూడా కనిపించలేదు.

ఇదిలా ఉంటే.. ట్రంప్ తో ఇమ్రాన్ భేటీ అనంతరం ఆసక్తికర పరిణామాలు వరుసగా చోటు చేసుకున్నాయి. కశ్మీర్ పై మధ్యవర్తిత్వానికి తాను సిద్ధమంటూ ట్రంప్ ముందుకొచ్చారు. ఊహించని పరిణామంతో అవాక్కు అవ్వటం భారత్ వంతైంది. దీంతో.. అలెర్ట్ అయిన ట్రంప్ ప్రకటనను ఖండించటం తెలిసిందే. దీంతో వెనక్కు తగ్గిన అమెరికా.. దిద్దుబాటు ప్రయత్నాల్ని మొదలుపెట్టింది.

తాజాగా కశ్మీర్ వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి మాట్లాడారు. ఈ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలకు (భారత్-పాక్) వదిలేస్తున్నట్లుగా వెల్లడించారు. కశ్మీర్ పై అమెరికా మధ్యవర్తిత్వాన్ని భారత్ తిరస్కరించటంపై స్పందించిన ట్రంప్.. వాస్తవానికి అది మోడీ ఇష్టం. నేను పాక్ ప్రధాని ఇమ్రాన్ తో భేటీ అయ్యాను. గొప్పగా అనిపించింది. నాకు తెలిసి మోడీ.. ఇమ్రాన్ ఇద్దరూ అద్భుతమైన వ్యక్తులు.. ఇద్దరు కలిసి కట్టుగా వెళ్లగలరని భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. అదే సమయంలో దశాబ్దాల తరబడి నెలకొన్న కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకునేందుకు రెండు దేశాలు సాయం కోరితే అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మరోసారి పేర్కొన్నారు. మొత్తానికి కశ్మీర్ ఇష్యూలో వేలెట్టాలన్న ఆశ తనలో ఎంత ఉందన్న విషయాన్ని ట్రంప్ చెప్పకనే చెప్పేశారని చెప్పాలి.