Begin typing your search above and press return to search.

ప్రైవేట్ జైళ్ల‌కు అదిరిపోయే ఆఫ‌రిచ్చిన ట్రంప్‌

By:  Tupaki Desk   |   1 March 2017 7:35 AM GMT
ప్రైవేట్ జైళ్ల‌కు అదిరిపోయే ఆఫ‌రిచ్చిన ట్రంప్‌
X
బతుకుదెరువు కోసం పొట్టచేత పట్టుకొని అమెరికాకు వచ్చి కూలినాలి చేసుకుని జీవించేవారి లెక్కలు తీయాలని తలపెట్టిన ట్రంప్ ప్ర‌భుత్వ నిర్ణ‌యం మ‌రిన్ని విప‌రిణామాల‌కు కార‌ణంగా మారింది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటున్నవారిని అరెస్టు చేసి జైల్లో పెట్టాలని చూస్తూ...దేశాన్ని పెద్ద జైలులా మార్చాలని తెగ ఉత్సాహ పడుతోంది. ట్రంప్ కోరిక మేరకు అమెరికాలో అనధికారకంగా కొనసాగుతున్నవారందరిని జైళ్లల్లో పెట్టాలంటే సర్కారు జైళ్లు సరిపోవు. అందుకే మేమున్నామంటూ ప్రైవేటు జైళ్లు నోల్లు తెరుస్తున్నాయి. దిక్కుమాలిన శరణార్థులను కటకటాల్లోకి తోసి నోట్లు లెక్కపెట్టుకునే ప్రైవేటు కంపెనీలకు ట్రంప్ సర్కారు నోట్లో చక్కెర పోస్తున్నది.

అమెరికాలో ప్రైవేటు జైళ్ల వ్యాపారం ఎప్పటినుంచో నడుస్తోంది. ఇప్పుడు ఈ రంగంలోని కంపెనీలకు స్వర్ణయుగం వచ్చింది. అంతే తేడా! ట్రంప్ విధానాల పుణ్యమా అని రకరకాల సమస్యలతో సొంతగడ్డను వదిలి అమెరికా చేరుకుని కాయకష్టం చేసుకునేవాళ్లకు కష్టకాలం వచ్చింది. ఎందుకంటే చాలామందికి సరైన పత్రాలు ఉండవు. అలాంటివారిని బంధించి సర్కారు నుంచి రుసుం వసూలు చేసే ప్రైవేటు కంపెనీలు ట్రంప్ సర్కారుకు ఎంతైనా రుణపడి ఉంటారు. అమెరికాలో జైళ్ల వ్యాపారం చేసే కంపెనీల్లో రెండింటి గుత్తాధిపత్యం నడుస్తోంది. కోర్ సివిక్, జియో గ్రూప్ అనే ఆ రెండు కంపెనీలకు జైల్ల‌ మార్కెట్‌లో 85 శాతం వాటా ఉంది. ట్రంప్‌పై వీరాభిమానంతో ఆయన ప్రమాణ స్వీకారోత్సవానికి ఒక్కొక్కటి రెండున్నర లక్షల డాలర్ల చొప్పున విరాళాలు కూడా ఇచ్చుకున్నాయి. ట్రంప్ లాంటి అధ్యక్షుని రాక ఇలాంటి కంపెనీలకు పండుగే కదా. ప్రైవేటు జైళ్ల ఉపయోగాన్ని తగ్గించబోమని గతవారం అటార్నీ జనరల్ జెఫ్ సెషన్స్ ప్రకటించిన తర్వాత ప్రైవేటు జైళ్లు నడిపే కంపెనీల షేర్ల ధర రెండింతలైంది. ప్రైవేటు జైళ్లు లేకపోతే భవిష్యత్తు అవసరాలు తీర్చడం కష్టమని సెషన్స్ చెప్పడం గమనార్హం.

గత నవంబర్ నాటికే ఇమ్మిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డిటెన్యూలలో 65 శాతం మంది ప్రైవేటు జైళ్లలోనే మగ్గుతున్నారు. లాభాపేక్షతో పనిచేసే ఈ కంపెనీలు ఖైదీకి రోజుకు ఇంత అని సర్కారు నుంచి వసూలు చేస్తున్నాయి. ఇప్పుడు పత్రాలు లేనివారిని జైళ్లలో పెడతామని సర్కారు వేస్తున్న వీరంగం ఈ కంపెనీలకు ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తోంది. ప్రస్తుతం అమెరికాలో పత్రాలు లేనివారు 80 లక్షల నుంచి 1.14 కోట్ల వరకు ఉంటారని అంచనా. ఇదివరకైతే అలాంటివారిని అధికారుల పర్యవేక్షణలో లేదా చేతికి ఓ ఎలక్ట్రానిక్ గుర్తింపు పట్టీ తగిలించి బయటకు పంపేవారు. ఇప్పుడు అదంతా జాంతానై అంటున్నది ట్రంప్ సర్కారు. వారిని ఆయా దేశాలకు వెనుకకు పంపేవరకు జైళ్లలో పెట్టాలని అంటున్నది. ఒబామా హయాంలో అందుబాటులోకి వచ్చిన రెండు జైళ్లను ప్రస్తుతం వినియోగిస్తున్నారు. వింతైన విషయం ఏమిటంటే శరణార్థులను జైల్లో పెట్టే కార్యక్రమం ఒబామా హయాంలోనూ విస్తారంగా సాగింది. భారీగా జైళ్ల వ్యవస్థ రూపకల్పనకు ఆయన సర్కారు కృషి చేసింది. ఏ క్షణాన్నైనా 34 వేల కొట్టాలు అందుబాటులో ఉండేలా చూడాలని గతంలో కాంగ్రెస్ ఓ చట్టాన్ని రూపొందించింది. రాబర్ట్ బైర్డ్ అనే డెమొక్రాటిక్ సెనేటర్ కాంగ్రెస్ ఉభయ సభల్లో ఆ పార్టీకి మెజారిటీ ఉన్నరోజుల్లో ఈ చట్టాన్ని ప్రతిపాదించి నెగ్గించుకున్నారు. అంటే శరణార్థుల విషయంలో అమెరికాలోని డెమొక్రాటిక్, రిపబ్లికన్ పార్టీలు దొందూదొందే అనిపిస్తుంది. నిజానికి ఒబామా అధికారంలోకి రాకముందే ఈ ప్రైవేటు జైళ్ల వ్యవస్థ 1980లు, 1990లలో వేళ్లూనుకొన్నదన్నది వేరే సంగ తి. ఒబామా సర్కారు హయాంలో కొంత విస్తరణ జరిగితే దానిని ఇబ్బడిముబ్బడిగా పెంచేందుకు ట్రంప్ బృందం లోపల్లోపల పథకాలు వేస్తున్నదని అంటున్నారు.

ప్రైవేటు జైళ్లు అనగానే అవేవో ఫైవ్‌స్టార్ లెవెల్లో ఉంటాయనుకుంటే పొరపాటే. ఖర్చు తగ్గించుకునేందుకు అరకొర సౌకర్యాలతోనే ఖైదీలను దారుణంగా చూస్తారని జియో గ్రూప్‌పై పలు ఆరోపణలూ ఉన్నాయి. వీటిలో వైద్య సౌకర్యాలు సరిగా ఉండవు. న్యాయ సహాయం అందుబాటులో ఉండనివ్వరు. కట్టుకునేందుకు శుభ్రమైన బట్టలివ్వరు. భోజన సౌకర్యం దైవాధీనం అన్నట్టు ఉంటుంది. భౌతిక, లైంగిక దాడులు సర్వసాధారణం. ఏదోలా అమెరికా చేరుకుని తలదాచుకుందామని వచ్చి జైలుపాలైన వారి సంఖ్య అంత తక్కువేమీ కాదు. చివరి లెక్క ప్రకారం 4.41 లక్షల మంది శరణార్థులు జైళ్లలో మగ్గుతున్నారు. పశ్చిమ టెక్సాస్ ప్రాంతం ఎల్‌పాసోలోని ప్రైవేటు జైలును సందర్శించిన ఓ అంతర్జాతీయ పరిశీలక బృందం అక్కడి దుర్భర పరిస్థితులను చూసి అవాక్కయ్యింది. జైలుపై ఆడిట్ జరిపిన ఓ ప్రైవేటు కన్సల్టెన్సీ సంస్థ జైలులోని సమస్యలను ఏకరువు పెట్టి చివరకు ఆమోదయోగ్యమైనదే అని సర్టిఫికెట్ ఇచ్చిది. నరకానికి నకళ్ల వంటి ఈ జైళ్లకు సంబంధించిన భయానక కథనాలకు కొదువలేదు. చిన్నపిల్లలను నిర్బంధించే విధానం విమర్శలకు గురవుతున్నది. వీటిని గమనించిన కోర్టులు అప్పుడప్పుడు మొట్టికాయలు వేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఇప్పుడు ఖైదీల సంఖ్య ఒక్కసారిగా బద్దలు కాబోతున్నదని అంటున్నారు. అప్పుడిక ఈ జైళ్లు ఎలా ఉంటాయో ఎవరికి వారు ఊహించుకోవాల్సిందేన‌ని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/