Begin typing your search above and press return to search.

నాతో పెట్టుకుంటే అమెరికాలో క‌ల్లోల‌మే!

By:  Tupaki Desk   |   23 Aug 2018 4:37 PM GMT
నాతో పెట్టుకుంటే అమెరికాలో క‌ల్లోల‌మే!
X
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను సెక్స్ స్కాండల్ వెంటాడుతున్న సంగ‌తి తెలిసిందే. 2016లో దేశాధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ముందు ఇద్దరు పోర్న్ స్టార్లకు ట్రంప్ డబ్బులు ఇప్పించారని మాజీ లాయర్ మైఖేల్ కోహెన్ తెలిపారు. మన్‌హటన్ కోర్టులో విచారణకు హాజరైన ట్రంప్ మాజీ లాయర్.. ఈ విషయాన్ని వెల్లడించారు. పోర్న్ స్టార్ స్టార్మీ డానియల్స్ - ప్లేబాయ్ మాడల్ కరేన్ మెక్‌ డౌగల్.. ఎన్నికల ప్రచారానికి ముందు నోరు విప్పకుండా ఉండేందుకు ట్రంప్ అక్రమంగా తన చేత డబ్బులు ఇప్పించారని కోర్టులో కోహెన్ తెలిపారు. అయితే, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలు జారీ చేశారు.

త‌న‌ మాజీ లాయర్ మైకేల్ కోహెన్ మాన్‌ హటన్ కోర్టులో వాంగ్మూలం ఇవ్వ‌డం దాని ఆధారంగా త‌న‌పై అభిశంస‌న‌కు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్న నేప‌థ్యంలో ఫాక్స్ అండ్ ఫ్రెండ్స్ అనే కార్యక్రమంలో ట్రంప్ మాట్లాడుతూ సంచ‌ల‌న వ్యాఖ్యాలు చేశారు. తనపై ఉన్న సెక్స్ స్కాండల్‌ ను అడ్డం పెట్టుకొని అధ్యక్ష పదవి నుంచి తొలగించాలని చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుందని గురువారం ఇచ్చిన ఈ ఇంటర్వ్యూలో ట్రంప్ హెచ్చరించారు. ``నన్ను ఎప్పుడైనా అభిశంసించాలని అనుకుంటే అమెరికా మార్కెట్ మొత్తం కుప్పకూలుతుంది. అందరూ చిక్కుల్లో పడతారు. మీరు ఊహించని ఫలితాలు ఉంటాయి`` అని ట్రంప్ అనడం గమనార్హం. ``అయినా ఎన్నో గొప్ప పనులు చేసిన ఓ వ్యక్తిని మీరు ఎలా అభిశంసించాలని అనుకుంటున్నారో అర్థం కావడం లేదు`` అని త‌న‌దైన శైలిలో ట్విస్ట్ ఇచ్చారు.

కాగా, ఈ కేసు వల్ల ట్రంప్ తన దేశాధ్యక్ష పదవిని కోల్పోతాడా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కానీ లీగల్ నిపుణులు మాత్రం ఆయ‌న ప‌ద‌వి కోల్పోయే ప్ర‌మాదం ఏమీ ఉండందంటున్నారు. ట్రంప్‌ పై క్రిమినల్ కేసు కూడా నమోదు కాదన్న వాదనలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ కేసు ఆధారంగా ట్రంప్‌ ను అభిశంసించడం అంత సులువైంది కాదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ఒకవేళ ట్రంప్ నేరం రుజువైతే ముందు ఆయన్ను కాంగ్రెస్ నుంచి తప్పించాల్సి ఉంటుంది. కానీ అలా జరగాలంటే, ముందుగా రెండు సభల్లోనూ ప్రతిపక్ష డెమోక్రటిక్ పార్టీ పట్టు సాధించాల్సి ఉంటుంది.