Begin typing your search above and press return to search.

అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం... ట్రంప్ ఏమన్నారంటే?

By:  Tupaki Desk   |   9 Jun 2020 4:48 PM GMT
అమెరికాలో గాంధీ విగ్రహం ధ్వంసం... ట్రంప్ ఏమన్నారంటే?
X
అగ్రరాజ్యం అమెరికాలో ఇప్పుడు జాత్యహంకార నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ ‌ను పోలీస్ హత్య చేయడంతో మొదలైన ఈ నిరసనలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఇలాంటి కీలక తరుణంలో అక్కడ మన జాతిపిత మహాత్మా గాంధీకి చెందిన ఓ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్... ఈ ఘటనను అవమానకర చర్యగా అభివర్ణించారు.

అమెరికాలోని భారత రాయబార కార్యాలయం వద్దనున్న గాంధీ విగ్రహానికి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రంగు పులిమారు. అంతటితో ఆగకుండా విగ్రహంపై అభ్యంతరకర రాతలు రాశారు. ఓ వైపు అమెరికా వ్యాప్తంగా జాత్యహంకార నిరసనలు జరుగుతున్న తరుణంలోనే గాంధీ విగ్రహం ధ్వంసం ఘటన చోటుచేసుకోవడంతో అమెరికా ఈ ఘటనపై వేగంగా స్పందించింది.

గాందీ విగ్రహం ధ్వంసం ఘటనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీన్ని అవమానకరమైన చర్యగా ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికే గాంధీ విగ్రహంపై దుండగుల దుశ్చర్య విషయంలో భారత్‌ను అమెరికా క్షమాపణలు కోరింది. విగ్రహ పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చింది.