Begin typing your search above and press return to search.

భార‌తీయుల‌కు శుభ‌వార్త చెప్పిన ట్రంప్

By:  Tupaki Desk   |   31 Jan 2018 6:12 AM GMT
భార‌తీయుల‌కు శుభ‌వార్త చెప్పిన ట్రంప్
X
కోట్లాది మంది భార‌తీయులు ఎంతో ఆస‌క్తితో ఎదురుచూస్తున్న స‌మ‌యం వ‌చ్చేసింది. కాంగ్రెస్ ఉభ‌య స‌భ‌ల్ని ఉద్దేవించి అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్ర‌సంగంలో కీల‌క‌మైన వీసా విధానంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ట్రంప్ ప్ర‌సంగం మీద ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న భార‌తీయుల‌కు తాజాగా ఆయ‌న చెప్పిన మాట‌లు స్వీట్ న్యూస్ గా మారాయ‌ని చెప్పాలి.

త‌మ దేశంలోకి ప్ర‌వేశాన్ని ప్ర‌తిభ ఆధారంగానే చేప‌ట్టాల‌ని భావిస్తున్న‌ట్లు ట్రంప్ వెల్ల‌డించారు. అలా చేయ‌టం ద్వారా మాత్ర‌మే అమెరికాను ప్ర‌థ‌మ స్థానంలో ఉంచగ‌ల‌మ‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. లాట‌రీ వీసా వ్య‌వ‌స్థ‌కు తాను ముగింపు ప‌ల‌క‌నున్న‌ట్లు ఆయ‌న చెప్పారు. కాంగ్రెస్ ఉభ‌య స‌భ‌ల్ని ఉద్దేశించిన ప్ర‌సంగించిన ఈ ప్ర‌సంగ కార్య‌క్ర‌మానికి కాన్సాస్ జాతి విద్వేష కాల్పుల్లో ప్రాణాలు పోగొట్టుకున్న తెలుగోడు కూచిభొట్ల శ్రీ‌నివాస్ స‌తీమ‌ణి సున‌య‌న హాజ‌ర‌య్యారు. మ‌రోవైపు ట్రంప్ తీరును త‌ప్పు పడుతూ.. విప‌క్ష డెమోక్రాట్లు ఈ స‌భ‌ను బ‌హిష్క‌రించారు.

విభేదాల్ని ప‌క్క‌న పెట్టి అమెరిక‌న్లు అంద‌రూ ఐక‌మ‌త్యంగా వ్య‌వ‌హ‌రించాల‌న్నారు. అమెరికాలో శాశ్వ‌త పౌర‌స‌త్వం ఇచ్చేందుకు అందించే గ్రీన్ కార్డుల్ని ప్ర‌తిభ ఆధారంగానే ఇవ్వాల‌ని..ఎందుకంటే అమెరికాను ఎల్ల‌ప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంచ‌టానికి ఉన్న మార్గం ఇదొక్క‌టేన‌ని వ్యాఖ్యానించారు. మెరిట్ ఆధారంగా వ‌ల‌స విధానాన్ని ప్రారంభించ‌టానికి ఇదే స‌రైన స‌మ‌య‌మ‌న్న ఆయ‌న‌.. ఎవ‌రైతే అధిక నైపుణ్యాలు ఉన్నారో.. ఎవ‌రైతే స‌మాజానికి మంచి సేవ‌లు అందించ‌గ‌ల‌రో.. ఎవ‌రైతే దేశాన్ని అమితంగా ప్రేమించి గౌర‌విస్తారో వారికి మాత్ర‌మే గ్రీన్ కార్డులు ఇవ్వాల‌న్నారు.

లాట‌రీ స్థానే.. మెరిట్ ఆధారంగా వీసాలు అందించే కార్య‌క్ర‌మం మొద‌లు పెడితే అమితంగా లాభ‌ప‌డేది భార‌తీయులు మాత్ర‌మేన‌ని చెప్పాలి. భార‌తీయుల‌కు మేలు క‌లిగేలా ట్రంప్ వ్యాఖ్య‌లు ఉండ‌గా..ఈ విధానంలో కుటుంబాల్ని విస్త‌రించుకునే విష‌యంలో మాత్రం ఇబ్బందులు ఎదుర‌వుతాయ‌ని చెబుతున్నారు.