Begin typing your search above and press return to search.

పాకిస్థాన్‌ కు మైండ్ బ్లాంక‌య్యే షాకిచ్చిన ట్రంప్‌!

By:  Tupaki Desk   |   21 Nov 2018 5:35 PM GMT
పాకిస్థాన్‌ కు మైండ్ బ్లాంక‌య్యే షాకిచ్చిన ట్రంప్‌!
X
కయ్యాల‌మారి పాకిస్థాన్‌ కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి షాకిచ్చారు. ట్రంప్‌ ఆదేశాల మేరకు పాకిస్థాన్‌కు అందజేస్తున్న 166 కోట్ల డాలర్ల (రూ.11,818 కోట్లు) భద్రతా సహాయాన్ని నిలిపేస్తున్నట్టు అమెరికా రక్షణశాఖ కేంద్ర కార్యాలయం పెంటగాన్‌ వెల్లడించింది. పాకిస్థాన్‌ పట్ల అమెరికా ఆగ్రహం కట్టలు తెంచుకుందనడానికి ఇదే నిదర్శనమని నిపుణులు పేర్కొంటున్నారు. అమెరికా కోసం పాకిస్థాన్‌ చేసింది శూన్యమని.. పైగా అబొటాబాద్‌ లో అల్‌ ఖైదా అధిపతి ఒసామా బిన్‌ లాడెన్‌ దాక్కునేందుకు పాక్‌ సహాయం చేసిందని ట్రంప్‌ మండిపడిన కొద్దిరోజులకే పెంటగాన్‌ నుంచి ఈ ప్రకటన వెలువడటం విశేషం.

అమెరికా రక్షణశాఖ అధికారప్రతినిధి కల్నల్‌ రోబ్‌ మానింగ్‌ మీడియాకు పంపిన ఈ మెయిల్‌ లో ఈ అంశాన్ని వెల్లడించారు. ‘పాకిస్థాన్‌ కు అందజేస్తున్న 166 కోట్ల డాలర్ల భద్రతా సహాయాన్ని నిలిపేస్తున్నాం’ అని అందులో పేర్కొన్నారు. పాకిస్థాన్‌ కు అందజేస్తున్న సైనికపరమైన ఆర్థికసాయం నిలిపవేత ప్రక్రియ ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైందని - ఇది అమెరికా ఆగ్రహానికి తార్కాణమని ఒబామా హయాంలో ఆఫ్ఘన్‌ - పాక్‌ - మధ్య ఆసియా వ్యవహారాల రక్షణ సహాయ కార్యదర్శిగా పనిచేసిన డేవిడ్‌ సెడ్నీ అభివర్ణించారు. ‘అమెరికా ఆందోళనకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి పాకిస్థాన్‌ ఇప్పటివరకు గట్టి చర్యలేవీ తీసుకోలేదు. దీంతోపాటు పొరుగున ఉన్న దేశాలకు వ్యతిరేకంగా హింసను ప్రేరేపించేందుకు ఉగ్రవాద గ్రూపులను తరచూ ప్రోత్సహించింది. సహకారం అందిస్తామని పాకిస్థాన్‌ నాయకులు ఎప్పుడూ హామీలు ఇచ్చేవారు. కానీ సహకారం అనేది కేవలం మాటల్లో మాత్రమే ఉన్నది. అదే ట్రంప్‌ ఆగ్రహానికి కారణమైంది. అధికశాతం అమెరికన్ల భావన కూడా అదే’ అని పేర్కొన్నారు.

ఇదిలాఉండ‌గా - పాకిస్థాన్‌ భూభాగంలో ఉన్న ఉగ్రవాద సంస్థలను నిర్మూలించే దాకా ఆ దేశానికి చేస్తున్న భద్రతా సహాయాన్ని నిలిపేస్తున్నామని ట్రంప్‌ మంగళవారం ప్రకటించారు. సెలవులను గడిపేందుకు ఫ్లోరిడాలోని తన వ్యక్తిగత రిసార్ట్‌ అయిన మార్‌ ఎ లాగోకు బయల్దేరే ముందు ట్రంప్‌ శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడారు. ‘పాకిస్థాన్‌ మాకు సహాయం చేస్తుందని ఆశించాం. పాకిస్థాన్‌ కు ఇక ఎటువంటి ఆర్థిక సాయం అందించం. వారు మాకు చేసింది ఏమీలేనందున ఇకమీదట మేం ఎటువంటి చెల్లింపులు చేయం’ అని ట్రంప్‌ స్పష్టంచేశారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్‌ లో పాకిస్థాన్‌ కు అందజేస్తున్న 30 కోట్ల డాలర్ల (రూ.2,135 కోట్లు) సహాయాన్ని అమెరికా నిలిపేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ప్రభుత్వ వ్యవహారాలకు సంబంధించి సమాచారాన్ని పంపేందుకు అధ్యక్షుడి సలహాదారుగా వ్యవహరిస్తున్న ఇవాంకా ట్రంప్‌ వ్యక్తిగత ఈమెయిళ్లను ఉపయోగించడంపై ట్రంప్‌ మాట్లాడూతూ ఇవాంకా పంపిన సమాచారంలో ప్రభుత్వ రహస్యాలకు సంబంధించిన అంశాలేవీ లేవని పేర్కొన్నారు.