Begin typing your search above and press return to search.

ఆ ఒక్క‌టే త‌న గోల్ అంటున్న ట్రంప్‌

By:  Tupaki Desk   |   15 Dec 2016 6:34 AM GMT
ఆ ఒక్క‌టే త‌న గోల్ అంటున్న ట్రంప్‌
X
విదేశీ కంపెనీలను ప్రోత్సహించొద్దు.. స్వదేశీ ఉత్పత్తుల్నేకొనండి.. దేశ ప్రజలంతా దేశీయ కంపెనీల ఉత్పత్తుల్ని 90 రోజులు కానీ కొనేస్తే.. భారత్ ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా అవతరిస్తుంది.. ఆర్థికంగా తిరుగులేని శక్తి అవుతుంటుందంటూ కొన్ని పోస్టింగ్ లు తరచూ సోషల్ మీడియాలో దర్శనమిస్తుంటాయి. సంఘ్ పరివార్ తరచూ చెప్పే ఈ తరహా మాటలు విన్నప్పుడు అనిపించేది ఒక్కటే.. ఇన్నిమాటలు చెప్పే సంఘ్.. ప్రధాని నరేంద్రమోడీ వినియోగించే వస్తువులు.. ధరించే వస్త్రాలు స్వదేశీ సంస్థలు తయారు చేసినవి ఎందుకు ఉండవన్న సందేహం రాక మానదు.

నీతులు చెప్పటానికి మాత్రమే కానీ ఆచరించటానికి ఎంతమాత్రం కాదన్నట్లుగా వ్యవహరించే ధోరణి కొందరిలో కనిపిస్తూ ఉంటుంది.ఇదేతరహా మాటల్ని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు ట్రంప్ నోటి నుంచి కూడా వస్తున్నాయి. స్వతహాగా వ్యాపారస్తుడైన ఆయన.. ప్రపంచంలోని పలు దేశాల్లో వ్యాపారాలు చేస్తూ.. వందలాది కోట్లు సంపాదించే వ్యక్తి.. ఇప్పుడు సంఘ్ తరహా మాటలే మాట్లాడుతున్నారు.

అమెరికా ప్రయోజనాల కోసం అమెరికా ఉత్పత్తుల్ని మాత్రమే అమెరికన్లు కొనుగోలు చేయాలని.. అంతేకాదు.. అమెరికన్లకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలంటూ పిలుపునిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికలకు పోటీపడే సమయంలో.. ప్రత్యర్థి కంటే భిన్నంగా నిలవటం కోసం.. ఓటర్లను ఆకర్షించేందుకు ఈ తరహా మాటలు ఎంతోకొంత ఉపయోగపడతాయని చెప్పొచ్చు. కానీ.. ఎన్నికలు ముగిసి.. విజయం సాధించి.. మరికొద్ది రోజుల్లో అధ్యక్ష బాధ్యతలు స్వీకరించనున్న సమయంలోనూ కేవలం దేశీయ ఉత్పత్తులు.. దేశీయలకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలంటూ చెబుతున్న మాటలు విస్మయంగా మారాయని చెప్పాలి.

స్వతహాగా వ్యాపారస్తుడైన ట్రంప్.. అధ్యక్షుడి హోదాలో అమెరికన్లకు లాభం చేకూరేలా మాట్లాడటం తప్పు కాదు. ప్రపంచానికే పెద్దన్న లాంటి అమెరికా.. ప్రపంచం మొత్తం తనదే అన్నట్లుగా వ్యవహరిస్తూ ఉంటుంది. అలాంటి వేళ.. సంకుచితంగా.. అమెరికన్లు అందరూ అమెరికన్ ఉత్పత్తులే కొనాలి.. అమెరికన్లను మాత్రమే ఉద్యోగులుగా పెట్టుకోవాలని మాట్లాడటంలో అర్థం ఉందా? అన్నది ఒక ప్రశ్న. ట్రంప్ మాటల్ని అన్ని దేశాల వారు అమలు చేస్తే.. అమెరికన్ కంపెనీలు మొత్తం దివాళా ఎత్తటం ఖాయమన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఎవరి దాకానో ఎందుకు.. వివిధ దేశాల్లో వ్యాపారాలు చేసే ట్రంప్ సంస్థల ఉత్పత్తుల్ని ఎవరూ వినియోగించకూడదన్న మాటపై ప్రపంచ ప్రజలంతా ఒక మాట మీదకు వస్తే.. పరిస్థితి ఎలా ఉంటుంది? ప్రపంచానికి పెద్దన్న లాంటి అమెరికా అధ్యక్షుడు.. మరీ చిల్లరగా మాట్లాడటం బాగోదేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/