Begin typing your search above and press return to search.

సద్దాంలో ట్రంప్ కు కనిపించిన యాంగిల్..

By:  Tupaki Desk   |   6 July 2016 10:31 AM GMT
సద్దాంలో ట్రంప్ కు కనిపించిన యాంగిల్..
X
ఈ మధ్య కాలంలో కేవలం మాటలతో ప్రపంచం మొత్తాన్ని తన వైపు చూసేలా చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఉండాలని భావిస్తున్న డోనాల్డ్ ట్రంప్ అనే చెప్పాలి. ముస్లింలు అమెరికాకు రానివ్వొద్దని చెప్పటం దగ్గర నుంచి మహిళలపై వివాదాస్పద వ్యాఖ్యలతో పాటు.. పలు దేశాలపై ఆయన చెప్పిన మాటలు అంతర్జాతీయంగా ట్రంప్ పేరు మారుమోగేలా చేశాయి.

అమెరికా అధ్యక్ష రేసులో ఉండి.. ఇంతటి వివాదాస్పద వ్యాఖ్యల్ని మాట్లాడటం.. ప్రస్తావించటం ట్రంప్ కు మాత్రమే చెల్లుతుందేమో. తాజాగా ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు విని అంతా షాక్ తినే పరిస్థితి. అమెరికాకు బద్ధ శత్రువైన సద్దాంహుస్సేన్ గురించి ట్రంప్ చెప్పిన మాటలు వింటే ఆశ్చర్యపోవాల్సిందే. తాజాగా తన ఎన్నికల ప్రచారంలో భాగంగా సద్దాంను ఉద్దేశించి ఆయన ఆసక్తికర అంశాల్ని చెప్పుకొచ్చారు.

సద్దాం చెడ్డవ్యక్తిగా అనుకుంటారని.. కానీ.. ఆయనలో మంచి కోణం ఉందంటూ తాను గుర్తించిన కొత్త యాంగిల్ ను అమెరికన్లకు చెప్పే ప్రయత్నం చేశారు. సద్దాం చెడు వ్యక్తా? చెడ్డ వ్యక్తే అంటూనే ఆయన చేసిన మంచిపని తెలుసా? అంటూ.. ‘‘నిజంగానే సద్దాం చెడ్డ వ్యక్తా? ఆయన చేసిన మంచి పని గురించి మీకు తెలుసా? సద్దా తీవ్రవాదుల్ని చంపించేవాడు. ఆయన అలా చేయటం మంచి పని. ఉగ్రవాదానికి ఇరాక్ హార్వర్డ్ యూనివర్సిటీ లాంటిది. ఎవరైనా ఉగ్రవాది కావాలనుకుంటే ఇరాక్ వెళ్లాలి. ఇది నిజంగా బాధాకరం. అప్పట్లో ఉగ్రవాదుల్ని సద్దాం చంపించాడు’’ అంటూ ప్రశంసించారు. నిజానికి సద్దాంను ట్రంప్ ప్రశంసించటం ఇది మొదటిసారి కాదు. గతంలోనూ ఆయన ఇదే రీతిలో ఆయన్ని ప్రసంశించారు. చరిత్రలోకి వెళితే.. మొదట్లో సద్దాంకు స్నేహంగా ఉన్న అమెరికా ఆ తర్వాత ఆయనపై కత్తి దూయటమే కాదు.. ప్రపంచాన్ని నాశనం చేసే రసాయనిక ఆయుధాలు తయారు చేస్తున్నారన్న ఆరోపణ మీద ఆ దేశంలోకి అమెరికా సైన్యాన్ని దింపి.. సద్దాంను బంధించి.. ఆయన్ను పదవి నుంచి తప్పించి కోర్టులో విచారించి ఉరిశిక్ష విధించారు. ఇప్పుడు అదే వ్యక్తిని అమెరికా అధ్యక్షుడి కుర్చీలో కూర్చోవాలని తహతహలాడుతున్న ఒక వ్యక్తి సద్దాంను పొగిడేసిన తీరు చూస్తే.. కాల వైచిత్రి అంటే ఇదేనని అనిపించకమానదు.