Begin typing your search above and press return to search.

చెరోదారి: వార్‌ కి కిమ్..చ‌ర్చ‌ల‌కు ట్రంప్ రెఢీ

By:  Tupaki Desk   |   1 Oct 2017 9:25 AM GMT
చెరోదారి: వార్‌ కి కిమ్..చ‌ర్చ‌ల‌కు ట్రంప్ రెఢీ
X
గ‌డిచిన కొన్ని నెల‌లుగా ఉత్త‌ర కొరియా.. అగ్ర‌రాజ్య‌మైన అమెరికాల మ‌ధ్య మాట‌ల యుద్ధం జోరుగా సాగుతున్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస క్షిప‌ణి ప్ర‌యోగాల‌తో ప్ర‌పంచానికి కొత్త వ‌ణుకు పుట్టించిన ఉత్త‌ర కొరియా నియంత కిమ్ పుణ్య‌మా అని.. అగ్ర‌రాజ్య‌మైన అమెరికా సైతం త‌గ్గాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఇటీవ‌ల హైడ్రోజ‌న్ బాంబు ప్ర‌యోగించిన కిమ్ తీరుపై ఐక్య‌రాజ్య స‌మితి తీవ్ర ఆంక్ష‌ల్ని విధించింది.

అప్ప‌టి నుంచి కిమ్ మ‌రింత ర‌గిలిపోతున్నారు. త‌న‌ను ఇబ్బందిపెడుతున్న అమెరికాకు చుక్క‌లు చూపిస్తాన‌ని వ్యాఖ్యానించాడు. త‌న‌పై ఆంక్ష‌లు విధించే విష‌యంలో అమెరికా హ‌స్తం ఉంద‌ని భావిస్తున్న కిమ్‌.. అగ్ర‌రాజ్యానికి త‌న స‌త్తా చాటాల‌న్న ఆలోచ‌న‌లో కిమ్ ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఎవ‌రెన్ని చెబుతున్నా ప‌ట్టించుకోకుండా కిమ్ యుద్ధానికి సిద్ధ‌మ‌వుతున్నారు. క్షిప‌ణుల్ని త‌ర‌లిస్తూ ఆందోళ‌న‌ను అంత‌కంత‌కూ పెంచుతున్నారు.

కిమ్ తీరుతో జ‌పాన్‌.. ద‌క్షిణ కొరియాలు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఉత్త‌ర కొరియా క‌ద‌లిక‌ల్ని ద‌క్షిణ కొరియా నిశితంగా ప‌రిశీలిస్తోంది. అదే స‌మ‌యంలో అమెరికాతో క‌లిసి సంయుక్తంగా యుద్ధ విన్యాసాల్ని చేస్తోంది. దీంతో.. ఏ క్ష‌ణంలో అయినా యుద్ధం ముంచుకొస్తుంద‌న్న భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే త‌న సైనిక సంప‌త్తిని సిద్ధం చేసుకుంటోంది ఉత్త‌ర‌కొరియా. త‌న‌కున్న క్షిప‌ణుల్ని వ్యూహాత్మ‌కంగా త‌ర‌లిస్తోంది. అయితే.. ఎక్క‌డికి త‌ర‌లిస్తుంద‌న్న విష‌యంపై వివ‌రాలు అంద‌టం లేదు.

మ‌ధ్యంత‌ర శ్రేణి హ‌సోంగ్ 12 లేదంటే ఇంట‌ర్ కాంటినెంట‌ల్ బాలిస్టిక్ హ‌సోంగ్ 14 క్షిప‌ణుల్లో ఏదో ఒక దానిని ప్ర‌యోగించేందుకు ఉత్త‌ర కొరియా సిద్ధం చేస్తుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. ఇదిలా ఉంటే.. ఉత్త‌ర‌కొరియాను దారికి తెచ్చుకునేందుకు ఆఖ‌రి ప్ర‌య‌త్నాల్ని షురూ చేసింది.

ఇప్ప‌టివ‌ర‌కూ చ‌ర్చ‌ల గురించి మాట్లాడ‌ని ట్రంప్‌.. అందుకు భిన్నంగా ఉత్త‌ర‌కొరియాతో నేరుగా చ‌ర్చ‌ల‌కు రెఢీ అని ప్ర‌క‌టించారు. అదే స‌మ‌యంలో ఎలాంటి ప‌రిస్థితుల‌కైనా తాము సిద్ధంగా ఉన్న‌ట్లుగా అమెరికా మిత్ర‌ప‌క్షాలు వెల్ల‌డించాయి. ఉత్త‌ర కొరియా కొన‌సాగిస్తున్న అణ్వాయుధాల త‌యారీపై ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతున్న నేప‌థ్యంలో మొద‌ట ఉద్రిక్త ప‌రిస్థితుల్ని చ‌ల్లార్చ‌ట‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని పేర్కొన్నారు. త‌మ‌కు ఇప్పుడు రెండు మార్గాలు ఉన్నాయ‌ని.. అందులో ఒక‌టి సొంతంగా చ‌ర్చ‌లు జ‌ర‌ప‌ట‌మ‌ని అమెరికా విదేశాంగ మంత్రి టైల్లెర్స‌న్ వెల్ల‌డించారు. రెండో మార్గం గురించి మాత్రం వెల్ల‌డించ‌లేదు. కాకుంటే.. తామేం చేసేది త్వ‌ర‌లోనే తెలుస్తుంద‌ని న‌ర్మ‌గ‌ర్భ వ్యాఖ్య‌లు చేశారు.