Begin typing your search above and press return to search.

ట్రంప్ గ్రాఫ్ పాద‌ర‌సం కంటే వేగంగా జారుతోంది

By:  Tupaki Desk   |   12 Oct 2017 2:18 PM GMT
ట్రంప్ గ్రాఫ్ పాద‌ర‌సం కంటే వేగంగా జారుతోంది
X
``ప్రతీ అధ్యక్షుడు పొరపాట్లు చేస్తారు. కానీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకుంటూ పోయిన వ్య‌క్తిగా ట్రంప్ మాత్ర‌మే నిలుస్తారు`` ఇది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ గురించి స‌ర్వేలో ఆ దేశ ప్ర‌జ‌లు చెప్పిన మాట‌. తాజాగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజాదరణ బాగా క్షీణించిందని ఒక సర్వేలో వెల్లడైన విష‌యం. గతేడాది ఎన్నికల సమయంలో ట్రంప్‌ కు బాగా మద్దతిచ్చిన వారే ఇప్పుడు ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత కనపరుస్తున్నారు. ఆయన పనితీరు నిరాశ కలిగిస్తోందని వారు అంటున్నారు. చిన్న పట్టణాలు - గ్రామీణ ప్రాంతాల్లో ట్రంప్‌ ప్రజాదరణ క్రమేపీ క్షీణిస్తోందని రాయిటర్స్‌/ఐప్సోస్‌ డైలీ ట్రాకింగ్‌ పోల్‌ లో వెల్లడైంది. దేశంలోని 15శాతం ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. వారే తాజాగా ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.

సెప్టెంబరులో మెట్రోయేతర ప్రాంతాల్లో 47శాతం మంది ప్రజలు ట్రంప్‌ ను అధ్యక్షుడుగా ఆమోదిస్తుండగా - మరో 47శాతం మంది ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. ట్రంప్‌ పదవిని అధిష్టించిన తొలినాలుగు వారాల్లో మద్దతు 55శాతం ఉండగా వ్యతిరేకత 39శాతం ఉంది. గ్రామీణుల్లో శ్వేత జాతీయులైన రిపబ్లికన్‌ ఓటర్లలో కూడా ట్రంప్‌ కు మద్దతు తగ్గిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థ - జాతీయ భద్రత విషయంలో ట్రంప్‌కు ఇంకా కొంత మద్దతు లభిస్తోంది. కానీ ఇమ్మిగ్రేషన్‌ విషయంలో గ్రామీణ అమెరికన్లు మాత్రం చాలా అసంతృప్తిగా ఉన్నారు. పార్టీలో - వైట్‌ హౌస్‌ లో ముఠా కుమ్ములాటలు - వాదులాటలు - వాగ్యుద్ధాల స‌హ‌జంగా మారింద‌ని వ్యాఖ్యానించారు. దేశంలో అక్రమంగా నివసిస్తున్న ఇమ్మిగ్రెంట్లను బయటకు పంపిస్తానన్న హామీని నిలబెట్టుకుంటారా అన్న దానిపై ఆయన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఓహియోలోని గ్రామీణ ప్రాంతమైన మెక్‌ కానెల్‌ స్విల్లేలో మోర్గాన్‌ కౌంటీకి వెలుపల వుండే రిటైర్డ్‌ బ్యాంకర్‌ జాన్‌ విల్సన్‌ తన అసంతృప్తి - నిరాశకు పలు కారణాలు చెబుతున్నారు. సమయం దొరికితే గోల్ఫ్‌ రిసార్ట్‌ లకు ట్రంప్‌ వెళ్లడాన్ని ఆయన తీవ్రంగా విమర్శిస్తున్నాడు. వీటికన్నా ట్రంప్‌ ముందుగా ఆరోగ్య సంరక్షణా వ్యవస్థపై దృష్టి పెట్టాలని ఆయన భావిస్తున్నారు. 'ప్రతీ అధ్యక్షుడు పొరపాట్లు చేస్తారు. కానీ ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేసుకుంటూ పోతే దానికీ కూడా ఒక పరిమితి వుంటుంది.'' అని విల్సన్‌ పేర్కొన్నారు. మోర్గాన్‌ కౌంటీలో గతేడాది లక్షలాది మంది ప్రజల అభిమానాన్ని చూరగొన్న ట్రంప్‌ ఇప్పుడు మొత్తంగా ఆ పట్టును పోగొట్టుకుంటున్నారు. కాగా ఈ సర్వే ఫలితాలపై ట్రంప్‌ ప్రభుత్వం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. మొత్తమ్మీద చూసినట్లైతే ఈ ఏడాది ట్రంప్‌ ప్రజాదరణ క్రమేపీ క్షీణిస్తోందని, దానికి గల కారణాలు కూడా చాలా ఉన్నాయని సర్వే పేర్కొంది.