Begin typing your search above and press return to search.

ట్రంప్ ను కెలికితే....ఇలాగే ఉంటుంది మరి

By:  Tupaki Desk   |   26 Sep 2017 8:00 AM GMT
ట్రంప్ ను కెలికితే....ఇలాగే ఉంటుంది మరి
X
ఔను. అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్‌ కు తిక్కుంది. అయితే అది ఎందుకు ఉంది? ఏంటి అని కొలిచేందుకు ఏదైన ఒక లెక్క కావాలి. అది ట్రంప్ పారామీట‌ర్ల ప్ర‌కారం ఉండాలి అని రాజ‌కీయ‌విశ్లేష‌కులు అంటున్నారు. ఎందుకంటే....ఇన్నాళ్లు శ‌త్రువు అనుకున్న‌వారు ఇప్పుడు మిత్రులు అయ్యారు. అదే రీతిలో మిత్రుల్లో కొంద‌రు శ‌త్రువులుగా మారిపోయారు కాబ‌ట్టి! ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే.....తమ దేశంలోకి రాకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి ఎనిమిది దేశాల పౌరులపై నిషేధం విధించారు. ఇంతకుముందు ప్రకటించిన ఆరు దేశాల నుంచి సూడాన్‌ను తొలిగించారు.తాజా జాబితాలో ఉత్తరకొరియా - వెనిజులా - చాద్‌ లను కూడా చేర్చారు. త‌ద్వారా త‌న‌దో ప్ర‌త్యేక స్టైల్ అని తెలియ‌జెప్పారు. అంతేకాకుండా తనతో కయ్యానికి కాలుదువ్వుతున్న ఉత్తరకొరియా తన తిక్కేంటో రుచిచూపించారు.

ట్రంప్ ఇదివరకు ఆరు ముస్లిం దేశాల పౌరుల ప్రవేశంపై విధించిన నిషేధం ఆదివారంతో ముగిసింది. దీంతో ఆయన సోమవారం తాజా ఉత్తర్వులను జారీ చేశారు. తాజా జాబితాలో సోమాలియా - యెమెన్ - సిరియా - లిబియా - ఇరాన్ - ఉత్తర కొరియా - చాద్ - వెనిజులా ఉన్నాయి. పాత జాబితాలోని ఐదు దేశాలపై విధించిన నిషేధం కొనసాగనుండగా, కొత్తగా చేర్చిన మూడు దేశాలపై నిషేధం అక్టోబర్ 18 నుండి అమలులోకి రానుంది. కాగా ఇరాక్ నుండి వచ్చే వారికి అదనపు తనిఖీ ఉంటుందని ట్రంప్ ఉత్తర్వులు పేర్కొన్నాయి. ఎప్ప‌ట్లాగే...ట్రంప్ త‌న నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకున్నారు. అంతర్గత భద్రత విభాగం సమీక్ష అనంతరం - అమెరికా ప్రజల రక్షణ - భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆయా దేశాల పౌరుల రాకపై నిషేధం విధిస్తున్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. దేశ భద్రతకు ప్రమాదకరంగా ఉన్న పూర్వ ప్రభుత్వాల విఫల విధానాలను తాము కొనసాగించదలచుకోలేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా ప్రజల భద్రత - రక్షణ తనకు అత్యంత ప్రధానమని - ఈ నిషేధ ఉత్తర్వుల ద్వారా ఆ పవిత్ర బాధ్యతను నెరవేరుస్తున్నానని ట్రంప్ తెలిపారు.

కాగా, అమెరికాలో భద్రతా చర్యలను పెంచడం చరిత్రలో ఇదే మొదటిసారి అని వైట్‌ హౌస్ తెలిపింది. సీమాంతర నేరాలు - ఉగ్రవాద ప్రమాదం పొంచి ఉన్న నేటి యుగంలో అమెరికన్ల భద్రత - రక్షణకు భరోసానిచ్చే ఇమిగ్రేషన్ వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఇది కీలకమైన అడుగు అని వెల్ల‌డించింది. ఉత్తర కొరియా ఏ విషయంలోనూ తమ ప్రభుత్వంతో సహకరించలేదని, తాము విధించిన అన్ని ప్రమాణాలలోను ఆ దేశం విఫలమైందని - అందుకే ఆ దేశ పౌరుల ప్రవేశంపై నిషేధం విధించామని వైట్‌ హౌస్ పేర్కొంది. సీమాంతర నేరాలు - ఉగ్రవాద దాడులు - ఇమిగ్రేషన్ మోసాలను అరికట్టే బాధ్యత అన్ని దేశాలపై సమానంగా ఉందని వ్యాఖ్యానించింది. అమెరికా ప్రభుత్వం విధించిన ప్రయాణ ప్రమాణాలను చేరుకోని, తాము కోరిన సమాచారాన్ని ఇవ్వని దేశాల పౌరులను తమ దేశంలోకి అనుమతించే ప్రసక్తే లేదని వైట్‌ హౌస్ తేల్చిచెప్పింది. తాజాగా ఎనిమిది దేశాలపై విధించిన నిషేధం షరతులతో కూడినదని, అమెరికన్ పౌరుల భద్రతకు సంబంధించి తాము విధించిన ప్రమాణాలను అవి అమలు చేస్తే రానున్న రోజుల్లో నిషేధాన్ని ఎత్తివేసే అవకాశం ఉందని ముంద‌స్తు అంచనా వేసింది.