Begin typing your search above and press return to search.

భారతీయ ఉద్యోగుల‌కు ట్రంప్ తీపిక‌బురు

By:  Tupaki Desk   |   10 Oct 2017 2:07 PM GMT
భారతీయ ఉద్యోగుల‌కు ట్రంప్ తీపిక‌బురు
X
అధికారం చేప‌ట్టింది మొద‌లు అమెరికా అంటేనే వ‌ల‌సదారులు భ‌య‌ప‌డేలా చేస్తున్న ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కొత్త నిర్ణ‌యం తీసుకున్నారు. అందులోనూ అది భారతీయుల‌కు అనుకూల‌మైనది కావ‌డం గ‌మ‌నార్హం. ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని ప్రతిపాదించారు. ఈ విధానం అత్యంత నిపుణులైన భారతీయ ఉద్యోగులకు లబ్ధి చేకూరుస్తుందని భావిస్తున్నారు. ఆదివారం అమెరికన్ కాంగ్రెస్‌ కు సమర్పించిన ఈ విధానం దేశ ప్రయోజనాలకు ఉపయోగకరం అని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ ప్రతిపాదనల్లో హెచ్1బీ వీసాల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.

తాజాగా ట్రంప్ ప్ర‌తిపాదించిన విధానంలో దేశ గ్రీన్ కార్డు వ్యవస్థను సమగ్రంగా పరిశీలించడం, మెక్సికో సరిహద్దులో నిర్మించనున్న గోడకు నిధులు - దేశంలోకి ప్రవేశించే మైనర్లను నిరోధించడం వంటి అంశాలు ఉన్నాయి. ట్రంప్ తన ప్రతిపాదనలు ప్రతిభ ఆధారిత వలస విధానం భారత్‌కు చెందిన అత్యంత నిపుణులైన ఉద్యోగులకు ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన వారికి ఉపయోగపడగలదని భావిస్తున్నారు. తమ తల్లిదండ్రులను అమెరికాకు తెచ్చుకోవాలనుకుంటున్న వేలమంది భారతీయ అమెరికన్ల ప్రయత్నాలకు ఇది విఘాతం కలిగించనుంది. ట్రంప్ ప్రతిపాదన ప్రకారం విదేశీయుల జీవిత భాగస్వామికి - పిల్లలకు మాత్రమే అమెరికాలో శాశ్వత నివాసం లేదా గ్రీన్‌ కార్డు హోదా కల్పిస్తారు. వారి తల్లిదండ్రులు - అక్కాచెల్లెళ్లు - అన్నదమ్ములను అనుమతించరు.

మ‌రోవైపు ట్రంప్ ప్రతిపాదనలను కాంగ్రెస్‌ లోని డెమోక్రటిక్ నేతలు వ్యతిరేకిస్తున్నారు. డ్రీమర్లుగా నిబంధనలకు విరుద్ధంగా ప్రవేశించే బాలలను పరిరక్షించేందుకు ట్రంప్‌ను ఒప్పించాలని వారు భావిస్తున్నారు. అయితే డ్రీమర్లకు రెండేళ్ల‌ పని అనుమతినిచ్చే డాకా కార్యక్రమాన్ని రద్దు చేస్తామని ట్రంప్ గత నెలలో ప్రకటించారు. తాను ప్రతిపాదించిన సంస్కరణలు అమలు చేయకపోతే అమెరికన్ ఉద్యోగులు - పన్ను చెల్లింపుదారులపై తీవ్ర భారం వేస్తున్న అక్రమ వలసలు - గొలుసుకట్టు వలసలను నిరోధించలేమని ట్రంప్ కాంగ్రెస్‌ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. గొలుసుకట్టు వలసలకు ముగింపు పలికే ప్రతిభ ఆధారిత వలస విధానాన్ని తమ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నదని ట్రంప్ పేర్కొన్నారు. గ్రీన్‌ కార్డులు ఇచ్చేందుకు పాయింట్ ఆధారిత వ్యవస్థను ఏర్పాటు చేయాలని, వీసా లాటరీని తొలిగించాలని, శరణార్థుల సంఖ్యను తగ్గించాలని ప్రతిపాదించారు.