Begin typing your search above and press return to search.

గ్రీన్ కార్డు ఉన్నోళ్లపై ట్రంప్ కనికరం

By:  Tupaki Desk   |   21 Feb 2017 4:46 AM GMT
గ్రీన్ కార్డు ఉన్నోళ్లపై ట్రంప్ కనికరం
X
ఏడు ముస్లిందేశాలకు చెందిన వారిని అమెరికాకు అనుమతించే విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్న నిర్ణయం ఎంతటి రచ్చ చేసిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ట్రంప్ నిర్ణయాన్ని ప్రపంచ దేశాలతోపాటు.. అమెరికన్లు తీవ్రస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ముస్లిం దేశాల ప్రజల్ని అమెరికాలోకి అనుమతించకుండా ఉండే ఉత్తర్వులపై కోర్టు చెక్ చెప్పినప్పటికీ.. దాన్ని సవరించే కార్యక్రమానికి ట్రంప్ తెర తీసిన వైనం తెలిసిందే. తాజా ఉత్తర్వులు ఎలా ఉంటాయన్న సందేహం ఒకపక్క వెంటాడుతుంటే.. మరోవైపు.. ట్రంప్ తీరును గర్హిస్తూ.. అమెరికన్లు సరికొత్త ఆందోళనల్ని చేపట్టారు.

‘‘నేనూ ముస్లింనే’’ అంటూ వివిధ మతాలకు చెందిన వారు నినాదాలిస్తూ.. భారీ ర్యాలీల్నినిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ట్రంప్ తన తాజా ఉత్తర్వులకు కొన్ని మార్పులు చేయనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం.. బ్యాన్ ఉన్న ఏడు దేశాలకు చెందిన పౌరుల్లో.. ఇప్పటికే గ్రీన్ కార్డు ఉన్నవారిని అమెరికాలోకి అనుమతించేలా నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. ఈ సమాచారంపై హోమ్ లాండ్ సెక్యూరిటీ డిపార్ట్ మెంట్ స్పందించటం లేదు.

ఈ నిర్ణయాన్ని అధికారికంగా సమీక్షించాల్సి ఉందని చెబుతున్నారు. తాజా ముసాయిదాలోనూ ఏడు ముస్లిం దేశాలను లక్ష్యంగా చేసుకున్నా.. ఆ దేశాలకు చెందిన గ్రీన్ కార్డులున్న వారిని మాత్రం అమెరికాలోకి అనుమతించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. అంటే.. ఇప్పటికే గ్రీన్ కార్డులున్న వారు మాత్రమే అమెరికాకు రాగలుగుతారు. కొత్తగామాత్రం వచ్చే అవకాశం లేనట్లేనని చెప్పొచ్చు. మరీ నిర్ణయం అధికారికం అయితే.. అమెరికన్ల స్పందన ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/