Begin typing your search above and press return to search.

అమెరికా లెక్క‌!... కిమ్ మాట‌ల‌తో విన‌డ‌ట‌!

By:  Tupaki Desk   |   31 Aug 2017 8:37 AM GMT
అమెరికా లెక్క‌!... కిమ్ మాట‌ల‌తో విన‌డ‌ట‌!
X
ప్రశాంత వాతావరణం నెలకొంటున్న సమయంలో ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ దూకుడు కారణంగా మళ్లీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా ఆధీనంలోని గ్వామ్‌ ద్వీపాన్ని లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా చేపట్టిన క్షిపణి ప్రయోగం అగ్రరాజ్యానికి ఆగ్రహం తెప్పించింది. హనుమంతుడి ముందు కుప్పిగంతులన్న చందంగా తమతోనే ఢీ అంటే ఢీ అంటున్న కిమ్‌ వైఖరిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. 'కిమ్‌ మాటలతో వినే రకం' కాదు అంటూ ట్వీట్‌ చేశారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియాను దృష్టిలో ఉంచుకుని ఓ న్యూక్లియర్‌ సూపర్‌ బాంబ్‌ ను పరీక్షించినట్లు అమెరికా ప్రకటించింది.

తన మాటలతో, చేతలతో మంటలు పుట్టిస్తున్న కిమ్‌ను లక్ష్యంగా చేసుకుని ఉత్తర కొరియా దుందుడుకు వైఖరికి కళ్లెం వేసేందుకు అగ్రరాజ్యం అమెరికా సన్నాహాలు మొదలు పెట్టింది. హవాయి తీరంలో అమెరికా వాయుసేన - క్షిపణి భద్రతా ఏజెన్సీ (ఎండీఏ)లు బుధవారం ఖండాంతర క్షిపణి పరీక్ష నిర్వహించినట్లు పసిఫిక్‌ మిస్సైల్‌ రేంజ్‌ ఫెసిలిటీ ఓ ప్రకటనలో తెలిపింది. యూఎస్‌ ఎస్‌ జాన్‌ పాల్‌ జోన్స్‌ నౌక నుంచి దీనిని నిర్వహించారు. కాగా, వాయుసేన పరీక్షించిన బీ61-12 బాంబును కిమ్‌ దేశాన్ని అడ్డుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అమెరికా ప్రకటన కిమ్‌ దేశాన్ని ఆందోళనలోకి నెట్టింది.

అమెరికాపై అణుబాంబులు వేయగలమని చాలా రోజులుగా ఉత్తర కొరియా దుందుడుకు వ్యాఖ్యలు చేస్తోంది. అమెరికా మిత్రదేశాలైన దక్షిణ కొరియా - జపాన్‌ పై బాంబుల వర్షం కురిపిస్తామని బెదిరిస్తోంది. ఈ క్రమంలోనే క్షిపణి ప్రయోగాలు చేసింది. మంగళవారం ఏకంగా జపాన్‌ మీదుగా క్షిపణిని ప్రయోగించింది. పసిఫిక్‌ తీరంలోని గ్వామ్‌ ద్వీపాన్ని నాశనం చేస్తామని ఉత్తర కొరియా పదేపదే హెచ్చరిస్తోంది. ‘అలా చేస్తే ప్రపంచ పటంలో మీ దేశం లేకుండా చేస్తాం’ అని అమెరికా ఘాటుగా బదులిచ్చినసంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికా క్షిపణి ప్రయోగం ఉత్తర కొరియాకు ఆందోళన కలిగిస్తోంది.