Begin typing your search above and press return to search.

ఉత్త‌ర కొరియా అణ్వ‌స్త్రాల‌పై ట్రంప్ సెటైర్‌

By:  Tupaki Desk   |   3 Jan 2017 8:01 AM GMT
ఉత్త‌ర కొరియా అణ్వ‌స్త్రాల‌పై ట్రంప్ సెటైర్‌
X
ఖండాంతర క్షిపణి పరీక్షల్లో ఉత్తర కొరియా తుది దశకు చేరుకున్నదని ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించడంపై అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎద్దేవా చేశారు. కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా కిమ్ జోంగ్ ఉన్ త‌న‌ దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ అణ్వాయుధాలతో అమెరికాలోని ప్రధాన భూభాగాలను సైతం ఢీకొనేలా రెండు అణు క్షిపణి పరీక్షలు చేపట్టామ‌ని ప్ర‌క‌టించ‌డంపై ట్రంప్ ట్వీట్ చేశారు. ఉత్త‌ర కొరియా మిస్సైళ్ల‌కు అమెరికాపై దాడి చేసే అంత సీన్ లేద‌ని తీసిపారేసిన ట్రంప్ ఈ విష‌యంలో అమెరికా వాసులు నిశ్చింత‌గా ఉండ‌వ‌చ్చ‌ని ప్ర‌క‌టించారు. ఈ సంద‌ర్భంగా త‌న దేశ ప్ర‌స్తుత పాల‌కుల‌ను, త‌న నిత్య ప్ర‌త్య‌ర్థి అయిన చైనాను ట్రంప్ విమ‌ర్శించారు.

అమెరికా ప‌ట్ల ప‌క్ష‌పాత దోర‌ణిలో వ్య‌వ‌హ‌రిస్తూ చైనా దోచేసుకుంటున్న‌ప్ప‌టికీ ఆ దేశానికి మ‌ద్ద‌తు ఇచ్చార‌ని ట్రంప్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అదే స‌మ‌యంలో అక్ర‌మ వాణిజ్య విధానాల‌తో ముందుకు సాగుతున్న చైనా త‌మ‌పైకి ఉత్త‌ర కొరియాను ఎగ‌దోస్తోంద‌ని ట్రంప్ విమ‌ర్శించారు. అంతేకాకుండా తాము అలాంటి ప‌నులు చేయ‌డం లేద‌ని చైనా పేర్కొన‌డాన్ని ట్రంప్ ఎద్దేవా చేశారు. ఏదిఏమైనా సొంత ఖండంలో చేసిన అణ్వ‌స్త్ర ప‌రీక్ష‌లే విఫ‌ల‌మైనా ఉత్త‌ర కొరియా అమెరికాకు ముప్పుపెట్టే ప‌రిస్థితి లేనేలేద‌ని ట్రంప్ తీసిపారేశారు. దీంతోపాటుగా త‌మ‌ను అణ్వ‌స్త్ర దేశంగా గుర్తించాల‌నే ఉత్త‌ర కొరియా డిమాండ్ నెర‌వేరద‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు.

కాగా.. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్భంగా కిమ్ జోంగ్ త‌న దేశ ప్ర‌జ‌ల‌తో 2016వ సంవత్సరంలో క్షిపణి, అణు పరీక్షలను విజయవంతంగా నిర్వహించామని పేర్కొన్నారు. "ఉత్తర కొరియా అణు శక్తిగా అవతరించింది. తూర్పు ప్రాంతంలో గొప్ప సైనిక శక్తిగా ఉన్న ఉత్తర కొరియాను అత్యంత శక్తిమంతమైన దేశాలు కూడా తాకలేవు. అణ్వాయుధాలతో అమెరికాలోని ప్రధాన భూభాగాలను సైతం ఢీకొనేలా రెండు అణు క్షిపణి పరీక్షలు చేపట్టాం. వీటిని విజయవంతంగా ప్రారంభించేందుకు పూర్తిస్థాయి సైనిక శక్తిని ఉపయోగిస్తాం" అని పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/