Begin typing your search above and press return to search.

దివాళ తీసిన ట్రంప్ టీం..జీతాల కోసం గ‌గ్గోలు

By:  Tupaki Desk   |   22 Aug 2017 5:11 PM GMT
దివాళ తీసిన ట్రంప్ టీం..జీతాల కోసం గ‌గ్గోలు
X
ఆగ్ర‌రాజ్యం అమెరికా అంటే మ‌న‌కు ట‌క్కున గుర్తుకు వ‌చ్చేది ధ‌నిక దేశం. డ‌బ్బులు చూసి ఖ‌ర్చు చేయాల్సిన అవ‌స‌రం ఉండ‌ని భూత‌ల స్వ‌ర్గం అని తెలుసు. అయితే అలాంటి దేశానికి అధ్య‌క్షుడంటే ఆయ‌న‌కు ఎంత సెక్యూరిటీ ఉంటుంది? దానికి ఎంత ఖ‌ర్చు ఉంటుంది? ఎంత హంగామా ఉంటుంది? కానీ ఆయ‌న ర‌క్ష‌ణ చూసే సీక్రెట్ స‌ర్వీస్ మాత్రం త‌మ ద‌గ్గ‌ర డ‌బ్బులు లేవ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ట్రంప్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల ర‌క్ష‌ణ కోసం సెప్టెంబ‌ర్ చివ‌రి వ‌ర‌కు స‌రిప‌డా డ‌బ్బులే ఉన్నాయ‌ని, ఆ త‌ర్వాత ప‌రిస్థితి ఏంటో అర్థం కావ‌డం లేద‌ని ఆ ఏజెన్సీ వెల్ల‌డించింది.
కాంగ్రెస్ జోక్యం చేసుకుంటేగానీ తాము బ‌య‌ట‌ప‌డ‌లేమ‌ని ఆ ఏజెన్సీ స్ప‌ష్టంచేసింది.

ఈ చిత్ర‌మైన క‌ష్టానికి ట్రంప్ తీరు కార‌ణం అంటున్నారు. వాస్త‌వానికి సెక్యూరిటీ కోసం కేటాయించే మొత్తం డిసెంబ‌ర్ వ‌ర‌కు రావాల్సి ఉంటుంది. కానీ ఈ ఏడాది ట్రంప్‌, ఆయ‌న కుటుంబ స‌భ్యుల టూర్లు ఎక్కువ కావ‌డంతో సీక్రెట్ స‌ర్వీస్‌పై భారం ఎక్కువైంది. ప్ర‌తి వీకెండ్‌లో ట్రంప్‌, ఆయ‌న భార్య మెలానియా ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌ కి న్యూజెర్సీలోని బెడ్‌ మిన్‌ స్ట‌ర్ గోల్ఫ్ క్ల‌బ్‌ కు వెళ్తున్నారు. ఈ ఇద్ద‌రితోపాటు ట్రంప్ న‌లుగురి సంతానానికి కూడా సీక్రెట్ స‌ర్వీసే సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. భ‌ద్ర‌తను పెంచ‌డానికి ఈసారి కొత్తగా 800 మందిని తీసుకోవ‌డంతో వాళ్ల జీతాల ఖ‌ర్చులు కూడా భార‌మ‌య్యాయి. ఇప్ప‌టికే కాంగ్రెస్ నుంచి జీతాల ప‌రిమితి - ఓవ‌ర్‌ టైమ్‌ పై ప‌లుమార్లు అనుమ‌తి తీసుకోవాల్సి వ‌చ్చింది. ట్రంప్ వ‌చ్చిన త‌ర్వాతే సీక్రెస్ స‌ర్వీస్‌ కు ఖ‌ర్చులు ఎక్కువ‌య్యాయి. ఒబామా హ‌యాం కంటే ఇప్పుడు అద‌నంగా మ‌రో 11 మందికి భ‌ద్ర‌త క‌ల్పించాల్సి వ‌స్తోంది.

ఇలా ప‌లు కార‌ణాల‌తో ఈ ఏడాది ట్రంప్ ర‌క్ష‌ణ కోసం 1100కుపైగా ఉద్యోగులు ఓవ‌ర్‌ టైమ్ ప‌ని చేస్తున్నార‌ని ఏజెన్సీ డైరెక్ట‌ర్ రాండాల్ఫ్ అలెస్ తెలిపారు. దీనికి చ‌ట్ట‌బ‌ద్ధ ప‌రిష్కారం కోసం కొన్ని నెలలుగా తాము హోమ్‌ లాండ్ సెక్యూరిటీ డిపార్ట్‌ మెంట్‌ - కాంగ్రెస్‌ తో క‌లిసి ప‌నిచేస్తున్నామ‌ని చెప్పారు. త‌మ జీతాల ప‌రిమితిని చ‌ట్ట‌స‌భ‌లు పెంచ‌క‌పోతే.. ఇప్ప‌టికే స‌మ‌యానికి మించి ట్రంప్ సెక్యూరిటీ కోసం ప‌నిచేస్తున్న సిబ్బందికి జీతాలు ఇవ్వ‌డానికీ ఇబ్బందులు ప‌డాల్సిన ప‌రిస్థితి తలెత్త‌నుంది.